Share News

ఆ ఒక్కచోట ఎందుకిలా?

ABN , Publish Date - Nov 10 , 2026 | 12:12 AM

The impact of caste dynamics in Narasannapeta నరసన్నపేట జడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఓటమికి కుల సమీకరణాలే ప్రధాన కారణమయ్యాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మండలంలోని ఎంపీటీసీ ఫలితాల్లో కూటమి సుమారు 6 వేల ఓట్ల ఆధిక్యం సాధించినప్పటికీ.. జడ్పీటీసీ ఎన్నికల్లో మాత్రం వైసీపీ అభ్యర్థి విజయం సాధించడం చర్చనీయాంశంగా మారింది.

ఆ ఒక్కచోట ఎందుకిలా?

  • నరసన్నపేటలో కుల సమీకరణాల దెబ్బ

  • కూటమికి జడ్పీటీసీ సీటు దూరం

  • క్రాస్‌ ఓటింగ్‌తో జనసేన అభ్యర్థి ఓటమి

  • 22 ఎంపీటీసీ స్థానాల్లో 17 టీడీపీ కైవసం

  • ఈ ఫలితాల్లో 6 వేలకుపైగా కూటమి ఆధిక్యం

  • జిల్లాలో సార్వత్రిక ఎన్నికల తరహాలోనే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కూటమి ప్రభంజనం సృష్టించింది. ఎన్నికలు జరిగిన రెండు మునిసిపాలిటీలు కైవసం చేసుకుంది. 30 జడ్పీటీసీ స్థానాలకు గాను 29 గెలుచుకుని జడ్పీ పీఠాన్ని సొంతం చేసుకుంది. నరసన్నపేటలో మాత్రమే అదీ అతి తక్కువ తేడాతో కూటమి అభ్యర్థి ఓడిపోయారు. ఇక్కడ కులసమీకరణాలు దెబ్బతీశాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎంపీటీసీ స్థానాల్లో 6వేలకు పైగా మెజార్టీ వచ్చిన కూటమికి.. జడ్పీటీసీ ఫలితంలో మాత్రం 401 ఓట్లు తక్కువ వచ్చాయి.

  • నరసన్నపేట, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): నరసన్నపేట జడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఓటమికి కుల సమీకరణాలే ప్రధాన కారణమయ్యాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మండలంలోని ఎంపీటీసీ ఫలితాల్లో కూటమి సుమారు 6 వేల ఓట్ల ఆధిక్యం సాధించినప్పటికీ.. జడ్పీటీసీ ఎన్నికల్లో మాత్రం వైసీపీ అభ్యర్థి విజయం సాధించడం చర్చనీయాంశంగా మారింది. భారీగా జరిగిన క్రాస్‌ ఓటింగే జనసేన అభ్యర్థి ఓటమికి కారణమని విశ్లేషిస్తున్నారు. నరసన్నపేట మండలంలో మొత్తం 65,677 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో వైసీపీ అభ్యర్థి పంచిరెడ్డి సత్యనారాయణకు చెందిన వెలమ సామాజికవర్గం ఓటర్లు 19,673 మంది (31 శాతం) ఉండగా.. కూటమి అభ్యర్థి బలగ ప్రవీణ్‌కు చెందిన శ్రీశయన సామాజికవర్గం ఓటర్లు 11,908 మంది (17 శాతం) ఉన్నారు. ప్రాదేశిక ఎన్నికల్లో 45,247 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీటిలో 2,644 ఓట్లు చెల్లుబాటు కాలేదు. మరో 638 ఓట్లు నోటాకు పడ్డాయి. కూటమి అభ్యర్థి బలగ ప్రవీణ్‌కు 20,133 ఓట్లు రాగా.. వైసీపీ అభ్యర్థి పంచిరెడ్డి సత్యనారాయణకు 20,534 ఓట్లు వచ్చాయి. దీంతో వైసీపీ అభ్యర్థి 401 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. కాంగ్రెస్‌ అభ్యర్థికి 808, స్వతంత్ర అభ్యర్థికి 490 ఓట్లు వచ్చాయి.

  • ఎంపీటీసీల్లో కూటమి హవా

  • మండలంలోని 22 ఎంపీటీసీ స్థానాల్లో 17 చోట్ల టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఈ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులకు 5,820 ఓట్ల ఆధిక్యం లభించింది. మూడు స్థానాల్లో పోటీ చేసిన జనసేన రెబల్‌ అభ్యర్థులకు 988 ఓట్లు, నడగాంలో టీడీపీ రెబల్‌ అభ్యర్థికి 111 ఓట్లు వచ్చాయి. మొత్తంగా కూటమి అభ్యర్థులకు 6,918 ఓట్ల ఆధిక్యం లభించినట్లు అంచనా. మరోవైపు ఐదు స్థానాల్లో గెలిచిన వైసీపీ అభ్యర్థులకు 960 ఓట్ల ఆధిక్యం మాత్రమే లభించింది.

  • కుల సమీకరణాలే కీలకం!

  • జడ్పీటీసీ టికెట్‌ కేటాయింపులో కూటమి పార్టీలు కుల సమీకరణాలను పరిగణనలోకి తీసుకోకపోవడమే ఓటమికి కారణమని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. జనసేన తరపున వెలమ సామాజికవర్గానికి చెందిన అభ్యర్థిని బరిలోకి దించి ఉంటే నరసన్నపేట స్థానం కూటమి ఖాతాలో పడేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రెండు ప్రధాన సామాజికవర్గాల ఓట్లు ఆయా అభ్యర్థులకు మళ్లడంతో క్రాస్‌ ఓటింగ్‌ భారీగా జరిగిందని భావిస్తున్నారు. మరోవైపు ఎంపీటీసీ స్థానాల్లో కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం కూడా వైసీపీకి కలిసొచ్చింది. మడపాం, కరగాం, నరసన్నపేట-3 స్థానాల్లో టీడీపీ, జనసేన, వైసీపీ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. దీంతో కూటమి ఓట్లు చీలిపోయాయి. కరగాంలో పోలింగ్‌ రోజు పలువురు ఓటర్లు జడ్పీటీసీ బ్యాలెట్‌ను ఖాళీగా ఉంచి ఎంపీటీసీ స్థానానికే ఓటు వేసినట్లు చెబుతున్నారు. చెల్లని ఓట్లు 2,644కు చేరడానికి ఇది కూడా కారణమై ఉండవచ్చని విశ్లేషిస్తున్నారు. నరసన్నపేట జడ్పీటీసీ స్థానం తొలుత టీడీపీకే వస్తుందని భావించినప్పటికీ.. పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించారు. దీంతో తక్కువ సమయంలో జనసేన అభ్యర్థి ఓటర్లను కలుసుకోవాల్సి వచ్చింది. ప్రచారానికి తగిన సమయం లేకపోవడం కూడా ఓటమికి మరో కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - Nov 10 , 2026 | 12:12 AM