ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీకి సంబంధించిన అరుదైన వీడియో విడుదల!
ABN , Publish Date - Aug 25 , 2026 | 10:09 AM
ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా అలీ ఖమేనికి సంబంధించి ఓ అరుదైన వీడియో బయటకు వచ్చింది. ఆయన అనారోగ్యంతో ఉన్నారన్న ఊహాగానాల నేపథ్యంలో ఈ వీడియో బయటకు రావడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా అలీ ఖమేని తీవ్ర అనారోగ్యంతో ఉన్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయనకు సంబంధించిన ఓ వీడియో బయటకు వచ్చింది. ఆ వీడియోలో మతపరమైన విద్యా అధ్యయన సెషన్‌కు ఖమేనీ అధ్యక్షత వహిస్తున్నట్లు కనిపిస్తారు. ఒక విద్యార్థి సమర్పించిన థీసిస్‌ను శ్రద్ధగా వింటూ దానిపై తన పరిశీలనను, అభిప్రాయాలను తెలియజేయడం కనిపిస్తుంది.
ఆ విద్యార్థి ప్రెజెంటేషన్‌ను మెచ్చిన మొజ్తబా అలీ ఖమేని 20కి గాను 19.5 మార్కులు ఇస్తారు. అంతేకాక ఆ ప్రజెంటేషన్‌ను 'పరిపూర్ణమైనది'గా ఆయన అభివర్ణించారు. తెరవెనుక రాజకీయ, సైనిక వ్యవహారాలలో ఆయన పాత్రపై ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొన్న తరుణంలో ఈ అరుదైన వీడియో బయటికి రావడం గమనార్హం. మరోవైపు, ఈ ఏడాది ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన మెరుపు దాడిలో ఆయన తండ్రి, మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణించిన విషయం తెలిసిందే.
అదే దాడుల్లో మొజ్తబా తీవ్రంగా గాయపడ్డారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్యంపై తీవ్ర అనిశ్చితి నెలకొంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని సుప్రీం లీడర్ సమ్మౌండ్‌పై జరిగిన ఈ దాడిలో ఆయన ముఖం, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయని పలు అంతర్జాతీయ మీడియా నివేదికలు పేర్కొన్నాయి. ఆ గాయాల కారణంగా ఆయన బహిరంగ ప్రదేశాలకు దూరంగా ఉంటున్నారని తెలిపాయి. అయినప్పటికీ, తీవ్ర గాయాల నుంచి ఆయన క్రమంగా కోలుకుంటున్నారని, మానసికంగా ఎంతో చురుగ్గా ఉన్నారని సమాచారం.
ప్రస్తుతం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీనియర్ అధికారులతో సమావేశాలు నిర్వహిస్తూ.. యుద్ధం, వాషింగ్టన్‌తో సాగుతున్న చర్చల వంటి కీలక నిర్ణయాల్లో చురుగ్గా పాల్గొంటున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇరాన్ రాజకీయ పరిణామాల నేపథ్యంలో మొజ్తబా వీడియో వెలుగులోకి రావడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
ఇవి కూడా చదవండి:
ట్రంప్ ప్రభుత్వం భారీ షాక్.. వీసా ఫీజు పెంచుతూ ప్రతిపాదనలు..
బళ్లారి చేరుకున్న మంత్రి లోకేశ్.. పలు ప్రాజెక్ట్‌లకు శంకుస్థాపన