హాకీ ప్రపంచ కప్: సెమీస్ రేసు నుంచి భారత్ ఔట్
ABN , Publish Date - Aug 24 , 2026 | 08:24 PM
2026 పురుషుల హాకీ వరల్డ్ కప్‌లో భారత్‌కు షాక్ తగిలింది. సోమవారం పూల్-ఈ చివరి మ్యాచ్‌లో అర్జెంటీనా చేతిలో భారత్ 3-5 తేడాతో ఓటమి పాలైంది. దీంతో టీమిండియా సెమీస్ రేసు నుంచి నిష్క్రమించింది.
ఇంటర్నెట్ డెస్క్: 2026 పురుషుల హాకీ వరల్డ్ కప్‌లో భారత్‌కు షాక్ తగిలింది. సోమవారం పూల్-ఈ చివరి మ్యాచ్‌లో అర్జెంటీనా చేతిలో భారత్ 3-5 తేడాతో ఓటమి పాలైంది. దీంతో టీమిండియా సెమీస్ రేసు నుంచి నిష్క్రమించింది. పూల్-ఈలో భారత్ చివరి స్థానంతో సరిపెట్టుకుంది. మ్యాచ్ ఆరంభమైన 39 సెకన్లకే అర్జెంటీనాకు జోక్విన్ టొస్కానీ గోల్ అందించాడు. కొద్దిసేపటికే నికోలస్ డి లా టొర్రే మరో గోల్ చేసి అర్జెంటీనా ఆధిక్యాన్ని 2-0కి పెంచాడు. అయితే భారత్ వెంటనే పుంజుకుంది. సుఖ్‌జీత్ సింగ్ గోల్ చేయడంతో ఆధిక్యం 2-1కి తగ్గింది. దీంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది.
మూడో క్వార్టర్‌లో అర్జెంటీనా మరోసారి భారత్‌పై ఒత్తిడి పెంచింది. టొమాస్ డొమెనే వరుసగా రెండు గోల్స్ చేసి అర్జెంటీనా ఆధిక్యాన్ని 4-1కి చేర్చాడు. నాలుగో క్వార్టర్‌లో లూకాస్ టొస్కానీ మరో గోల్ చేయడంతో అర్జెంటీనా 5-1తో నిలిచింది. మ్యాచ్ చివరి రెండు నిమిషాల్లో భారత్ అద్భుతంగా పోరాడింది. సుఖ్‌జీత్ సింగ్ మరో గోల్ చేయగా, హార్దిక్ సింగ్ కూడా గోల్ సాధించాడు. దీంతో స్కోరు 5-3కి చేరింది. అయితే అప్పటికే సమయం పూర్తవడంతో భారత్ ఓటమి తప్పలేదు. చివరి క్షణాల్లో చేసిన ఈ రెండు గోల్స్ కేవలం ఓదార్పుగానే మిగిలాయి.
సెమీస్ ఆశలు గల్లంతు..
పూల్-ఈలో అర్జెంటీనాతో ఓటమితో భారత్ సెమీఫైనల్ రేసు నుంచి నిష్క్రమించింది. టోర్నీలో కొత్త ఫార్మాట్ ప్రకారం పూల్-Eలో అగ్రస్థానంలో నిలిచే రెండు జట్లు మాత్రమే సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ఇక భారత్ ఏడో స్థానం కోసం జరిగే మ్యాచ్‌లో సహ ఆతిథ్య దేశం బెల్జియంతో తలపడనుంది. శుక్రవారం ఈ మ్యాచ్ జరగనుంది. సెమీఫైనల్ లక్ష్యంతో బరిలోకి దిగిన హర్మన్‌ప్రీత్ సింగ్ సేనకు అర్జెంటీనా ఇచ్చిన షాక్‌తో ప్రపంచకప్ పతక ఆశలు దూరమయ్యాయి.
ఇవి కూడా చదవండి:
శ్రీలంకతో రెండో టెస్టు: భారీ స్కోర్.. ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన భారత్
శ్రీలంక ప్లేయర్‌తో గొడవ.. యశస్వి జైస్వాల్‌పై ఐసీసీ చర్యలు