అమెరికా సైన్యంపై దాడులు.. ఇరాన్ స్టార్‌లింక్ వినియోగించిందా..
ABN , Publish Date - Nov 29 , 2026 | 03:09 PM
అమెరికా సైన్యాన్ని లక్ష్యంగా చేసుకుని చేపట్టిన దాడుల కోసం ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ సేవలను ఇరాన్ అనధికారికంగా ఉపయోగించినట్లు సంచలన కథనం వెలుగులోకి వచ్చింది.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా సైన్యాన్ని లక్ష్యంగా చేసుకుని చేపట్టిన దాడుల కోసం ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ సేవలను ఇరాన్ అనధికారికంగా ఉపయోగించినట్లు సంచలన కథనం వెలుగులోకి వచ్చింది. ఈ విషయం తెలిసి స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ తీవ్ర ఆగ్రహానికి గురైనట్లు 'వాషింగ్టన్ పోస్ట్' వెల్లడించింది. ఇరాన్‌తో పాటు అమెరికా సైన్యం కూడా తన సంస్థకు చెందిన సాంకేతికతను నిబంధనలకు విరుద్ధంగా వినియోగించడంపై మస్క్ అసహనం వ్యక్తం చేసినట్లు పేర్కొంది (Iran Starlink).
మార్చి మొదటి వారంలో ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌లు దాడులు ప్రారంభించిన సమయంలో స్టార్‌లింక్ సేవలను అనధికారికంగా వాడుకున్నాయని సమాచారం. బదులుగా పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేపట్టినప్పుడు ఇరాన్ కూడా స్టార్లింక్నే ఉపయోగించుకుందని తెలుస్తోంది. ఇరాన్ తన సైనిక అవసరాల కోసం స్టార్‌లింక్‌ను ఉపయోగించడం మస్క్‌కు తీవ్ర ఆగ్రహం తెప్పించినట్లు కథనం పేర్కొంది. అలాగే అమెరికా సైన్యం కూడా తక్కువ ధర ప్లాన్‌ను తీసుకుని ఉపగ్రహ సమాచార వ్యవస్థ స్టార్షీల్డ్ను ఉపయోగించడం మస్క్‌కు కోపం తెప్పించిందని తెలిపింది (Iran US Military Conflict).
కాగా, అనధికారిక వినియోగాన్ని అడ్డుకునేందుకు స్పేస్ఎక్స్ తన విక్రయ వ్యవస్థలో మరిన్ని నిబంధనలు తీసుకొచ్చినట్లు నివేదిక తెలిపింది (Satellite Internet). పరికరాలను కొనుగోలు చేసే వినియోగదారుల గుర్తింపును ధ్రువీకరించే బాధ్యతను విక్రయదారులపై ఉంచింది. అలాగే మధ్యవర్తుల ద్వారా పరికరాల విక్రయానికి సంబంధించిన కొన్ని విధానాలను నిలిపివేసింది. అయితే ఇరాన్లో స్టార్‌లింక్ సేవలను పూర్తిగా నిలిపివేస్తే సామాన్య ప్రజలు, నిరసనకారులు ఎక్కువగా నష్టపోతారు. అదే సేవలను కొనసాగిస్తే వాటిని ఇరాన్ సైన్యం కూడా ఉపయోగించుకునే ప్రమాదం ఉంది. ఈ రెండు పరిస్థితుల మధ్య స్పేస్ఎక్స్కు పెద్ద సవాలు ఎదురవుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
డీలిమిటేషన్‌తో ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లు పెరుగుతాయో తెలుసా?
అఫ్గానిస్థాన్‌లో భారీ పేలుడు.. ఆరుగురు విద్యార్థుల మృతి, 97 మందికి గాయాలు..!