ఇరాన్ ఇంకెంతమాత్రం మధ్యప్రాచ్యాన్ని శాసించలేదు.. భారీ దాడులు తప్పవని ట్రంప్ హెచ్చరిక
ABN , Publish Date - Mar 07 , 2026 | 07:04 PM
అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులతో ఓడిపోయిన దేశంగా ఇరాన్ మారిందని, ఆ దేశం ఇంకెతమాత్రం మద్యప్రాచ్య ప్రాంతంపై ఆధిపత్యం చలాయించే శక్తి కాదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు.
వాషింగ్టన్: అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులతో ఓడిపోయిన దేశంగా ఇరాన్ మారిందని, ఆ దేశం ఇంకెంతమాత్రం మధ్యప్రాచ్య ప్రాంతంపై ఆధిపత్యం చలాయించే శక్తి కాదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అన్నారు. ఇరాన్ తన పొరుగుదేశాలకు క్షమాపణలు చెప్పి దాడులు ఆపేస్తామని హామీ ఇవ్వడంపై ట్రంప్ తన 'ట్రూత్ సోషల్'లో తాజా వ్యాఖ్యలు చేశారు.
దీనికి ముందు, గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలే లక్ష్యంగా దాడులు సాగిస్తూ వచ్చిన ఇరాన్ వెనక్కి తగ్గింది. గల్ఫ్ దేశాలపై జరుపుతున్న దాడులకు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్ (Masoud Pezeshkian) క్షమాపణలు చెప్పారు. ఇరుగుపొరుగు దేశాలపై క్షిపణులు, డ్రోన్ దాడులు చేసే ఉద్దేశం తమకు లేదని చెప్పారు. దీనిపై డొనాల్డ్ వెంటనే ట్రంప్ స్పందించారు.
'మధ్యప్రాచ్యంలోని పొరుగుదేశాలకు ఇరాన్ క్షమాపణ చెప్పింది. ఇంకెంతమాత్రం దాడులు చేయమంటూ దిగొచ్చింది. అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన అవిశ్రాంత దాడులే ఇందుకు కారణం. మధ్యప్రాచ్యాన్ని తన అధీనంలోకి తీసుకుని పాలించాలని ఇరాన్ చూసింది. కానీ ఓడిపోయిన దేశంగా మధ్యప్రాచ్యానికి తొలిసారి క్షమాపణలు చెప్పుకుంది. ఇరాన్ ఇంకెంత మాత్రం ఆధిపత్య చెలాయించే శక్తి కాదు. మధ్యప్రాచ్యంలో ఓడిపోయిన శక్తి' అని అన్నారు. ఇరాన్ తన చెడుప్రవర్తన కారణంగా భారీ నష్టాన్ని ఎదుర్కొంటోందన్నారు. ఆ దేశం పూర్తిగా లొంగిపోయేంత వరకూ, పతనం అయ్యేంత వరకూ ఈ పరిస్థితి కొనసాగుతుందని ట్రంప్ హెచ్చరించారు.
రెండో వారంలోకి ప్రవేశించిన యుద్ధం
ఇరాన్ యుద్ధం రెండో వారంలోకి అడుగుపెట్టింది. ఉద్రిక్తతలు తగ్గించేందుకు అటు అమెరికా-ఇజ్రాయెల్ కానీ, అటు ఇరాన్ కానీ నిరాకరిస్తున్నాయి. అయితే ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్ ఇరుగుపొరుగు దేశాలపై దాడులకు తాజాగా క్షమాపణలు చెప్పారు. ఇకపై తాము దాడులు జరపమన్నారు. అయితే ఆయా దేశాల భూభాగాల నుంచి ఇరాక్‌పై దాడులు జరపరాదని షరతు పెట్టారు. అమెరికా-ఇజ్రాయెల్ ఒత్తిళ్లకు తలవంచే ప్రసక్తే లేదన్నారు. ఇరాన్ ప్రజలు ఎన్నడూ లొంగిపోరని, ఇరాన్‌ను లొంగదీసుకోవచ్చని అనుకునే వాళ్లు ఎప్పటికీ సక్సెస్ కారని, తమ దేశాన్ని తాము కాపాడుకుంటామని మీడియాతో మాట్లాడుతూ ఆయన చెప్పారు.
ఇవి కూడా చదవండి..
ఇకపై దాడులు చేయం... గల్ఫ్ దేశాలకు సారీ చెప్పిన ఇరాన్ అధ్యక్షుడు
ఇరాన్ బేషరతుగా లొంగిపోవాల్సిందే.. ట్రంప్ స్పష్టీకరణ