బ్లూ స్పారో క్షిపణితో ఖమేనీపై దాడి
ABN , Publish Date - Mar 07 , 2026 | 04:05 AM
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణానికి కారణమైన క్షిపణి బ్లూ స్పారో అని పలు అంతర్జాతీయ వార్త కథనాలు స్పష్టం చేస్తున్నాయి. న్యూయార్క్ పోస్టు కథనం ప్రకారం..
ఎఫ్-15 ఈగిల్ జెట్స్ వినియోగం
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణానికి కారణమైన క్షిపణి బ్లూ స్పారో అని పలు అంతర్జాతీయ వార్త కథనాలు స్పష్టం చేస్తున్నాయి. న్యూయార్క్ పోస్టు కథనం ప్రకారం.. ఆ క్షిపణిని ఓ ఫైటర్ జెట్ నుంచి ప్రయోగించారు. ఇరాన్ నాయకత్వంపై బ్లూ స్పారో క్షిపణిని ప్రయోగించినట్లు ఇజ్రాయెల్ అధికారులు చెప్పారు. ఆ క్షిపణి టెహ్రాన్‌వైపు వెళ్తున్న మార్గంలో దాని శకలాలు పశ్చిమ ఇరాక్‌లో కనుగొన్నట్లు వారు తెలిపారు. ఇంత కచ్చితంగా ఖమేనీపై దాడి చేయడానికి ఆధునిక ఆయుధ వ్యవస్థతో పాటు ఏళ్ల తరబడి మొస్సాద్, ఇజ్రాయెల్ సైబర్ సెక్యూరిటీ వ్యవస్థ యూనిట్ 8,200 కృషి ఉంది. తమ దేశ ముఖ్య నేతలతో ఖమేనీ సమావేశం అవుతున్నారన్న కచ్చిమైన సమాచారంతో ఇజ్రాయెల్ దాడికి సిద్ధమైంది. ఆ రోజు ఉదయం 7.30 నిమిషాలకు ఎఫ్-15 ఈగిల్ జెట్స్‌తో పాటు ఇజ్రాయెల్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ టేకాఫ్ తీసుకున్నాయి. 9.40 సమయంలో మొదటి క్షిపణిని సెంట్రల్ టెహ్రాన్‌వైపు ప్రయోగించారు. దాని తర్వాత ఖమేనీ ఉన్న ప్రాంగణంవైపు 30 వరకు కచ్చితమైన దాడులు చేశారు. వీటిలో పలు బ్లూ స్పారో క్షిపణులు కూడా ఉన్నాయి. ఈ దాడులు జరిగిన కొద్ది సేపటికే సుప్రీం లీడర్ ఇంటి వద్ద పొగలు రేగుతున్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఆ ప్రదేశంలో చాలా భవంతులు దెబ్బతిన్నాయని రిపోర్టులు వెలువడ్డాయి. ఖమేనీ చనిపోయినట్లు తర్వాత రోజు అధికారికంగా సమాచారం వచ్చింది.
క్షిపణి ప్రత్యేకతలు ఇవీ..
ఈ బ్లూ స్పారో క్షిపణిని ‘మిస్సైల్ ఫ్రం స్పేస్’ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే దాని గమనం అలా ఉంటుంది. ఇది సుమారు 1,240 మైళ్ల దూరం ప్రయాణించగలదు. ఈ క్షిపణి గగనతల రక్షణ వ్యవస్థలకు చిక్కకుండా తన ప్రయాణ మార్గాన్ని మధ్యలో మార్చుకోగలదు. ఈ క్షిపణిని ప్రయోగించిన తర్వాత ఆకాశంవైపు అత్యంత ఎత్తుకు వెళ్లి అక్కడి నుంచి నిటారుగా భూమిపైన నిర్దేశించిన లక్ష్యంపైకి అత్యధిక వేగంతో దాడి చేస్తుంది. ఈ క్వాజి బాలిస్టిక్ గమనం వల్ల ఆ క్షిపణిని గగనతల రక్షణ వ్యవస్థలు గుర్తించడం కష్టం. ఈ బ్లూస్పారో క్షిపణిని అత్యంత రక్షణాత్మక ప్రదేశాలపైకి ప్రయోగిస్తారు. అందువల్లే ఫిబ్రవరి 28న ఖమేనీపైకి దీనిని ఎక్కుపెట్టారు. తన స్పారో క్షిపణి కుటుంబంలోని బ్లాక్ స్పారో, సిల్వర్ స్పారోలతో పాటు ఈ బ్లూ స్పారోను కూడా ఇజ్రాయెల్ అభివృద్ధి చేసింది. దీని పొడవు 6.5 మీటర్లు, బరువు 1.9 టన్నులు ఉంటుంది. ఎఫ్-15 ఈగిల్ వంటి ఫైటర్ జెట్ల నుంచి వీటిని ప్రయోగించవచ్చు.

ఖమేనీ హత్యకు నవంబరులోనే ప్లాన్
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ హత్యకు ఇజ్రాయెల్ నవంబరులోనే ప్రణాళిక రచించింది. సమయం కోసం వేచి చూసి ఇరాన్‌లోని అస్థిర పరిస్థితులు తమకు అనుకూలంగా మార్చుకుంది. అధునాతన క్షిపణులతో దాడి చేసి ఖమేనీని హత్య చేసింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ వెల్లడించారు. ఖమేనీ హత్యకు నెతన్యాహు 2025 నవంబరులో ఓ చిన్న ఫోరమ్‌ను ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ ప్రణాళిక ప్రకారం 2026 మధ్యలో.. జూన్ నెలలో ఖమేనీని అంతమొందించాలని భావించామన్నారు. అయితే, ఇరాన్‌లో అంతర్గత నిరసనలు వెల్లువెత్తుతున్న సమయంలో ఆ ప్రణాళిక వేగవంతమైందన్నారు. షెడ్యూల్ కంటే ముందుగానే దాడి చేయడానికి ఇరాన్‌లోని అస్థిరత అమెరికా-ఇజ్రాయెల్‌కు ఉపకరించిందని తెలిపారు. ప్రాథమిక ప్రణాళికలో అమెరికా ప్రమేయం లేదని, తామే ఈ ఆపరేషన్ స్వయంగా పూర్తి చేయాలని అనుకున్నామని ఆయన స్పష్టం చేశారు.