యుద్ధం ఎఫెక్ట్... కెన్యాలో నిలిచిపోయిన వేలాది కార్లు
ABN , Publish Date - Mar 22 , 2026 | 03:54 PM
పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్ కారణంగా కెన్యా తీరంలో వేలాది లగ్జరీ కార్లు చిక్కుకున్నాయి. జపాన్ నుంచి దుబాయ్ చేరాల్సిన 4 వేల కార్లు కెన్యా పోర్టులో నిలిచిపోయాయి. ఇరాన్ హర్మూజ్ జలసంధిలో నౌకల రాకపోకలపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.
ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్ - అమెరికా, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ ఎదురు దాడులు చేస్తోంది. ఈ క్రమంలోనే హర్మూజ్ జలసంధిలో నౌకల రాకపోకలపైనా ఆంక్షలు కొనసాగిస్తోంది. దీంతో అనేక ఇంధన, గ్యాస్, సరకు రవాణా నౌకలు నిలిచిపోతున్నాయి. ఈ యుద్ధం ఎఫెక్ట్‌తో కెన్యా తీరంలో వేలాది లగ్జరీ కార్లు చిక్కుకున్నాయి.
కెన్యా సముద్రం తీరంలో నిలిచిపోయినా కార్లు జపాన్ నుంచి దుబాయ్‌కు చేరాల్సి ఉంది. ఇప్పటికే దాదాపు నాలుగు వేల కార్లు ఇక్కడ చిక్కుకుపోగా.. వచ్చే వారం మరో ఐదు వేల వాహనాలు రానున్నాయి. గత నెలలో పోర్షే సహా ఆయా కంపెనీల లగ్జరీ కార్ల లోడ్‌తో జపాన్‌లోని యోకోహామా నుంచి నౌకలు బయల్దేరాయి. దుబాయ్‌లోని జాబెల్ అలీ పోర్ట్‌లో వాటిని దిగుమతి చేయాల్సి ఉంది. అయితే, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం మొదలైంది.
మార్చి 1న జాబెల్ అలీ పోర్ట్‌పైనా దాడులు జరిగాయి. దీంతో నాలుగు వేల కార్లతో అక్కడికి వెళ్లాల్సిన ఓ నౌకను కెన్యాలోని లాము పోర్టుకు మళ్లించారు. ఇక్కడి గోడౌన్లలో ఆ కార్లను పార్క్ చేశారు. వచ్చే వారం మరో ఐదు వేల వాహనాలతో కూడిన నౌక రానున్నట్లు లాము నౌకాశ్రయ అధికారులు తెలిపారు. పశ్చిమాసియాలో పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకునేవరకు ఈ కార్లను ఇక్కడే ఉంటాయని వారు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి:
ఖతార్ మిలటరీ హెలికాప్టర్ కుప్పకూలి ఆరుగురు మృతి
ట్రంప్ ఆరోగ్యంగానే ఉన్నారా.. విమానం దిగుతూ తడబడిన నేపథ్యంలో చర్చ..