Share News

వాషింగ్టన్ మేయర్ ఎన్నికల బరిలో తమిళ మహిళ

ABN , Publish Date - Apr 05 , 2026 | 10:52 AM

అమెరికాలోని వాషింగ్టన్‌లో జరగబోయే మేయర్ ఎన్నికల్లో భారత సంతతి మహిళ పోటీ చేయనున్నారు. ఎన్నికలు ప్రారంభమైనప్పటి నుంచి డెమోక్రటిక్ ఆధిపత్యం కొనసాగుతున్న ఆ ప్రాంతంలో ఆమె విజయం ఖాయమని విశ్లేషకుల అభిప్రాయం. వివరాల్లోకెళితే...

వాషింగ్టన్ మేయర్ ఎన్నికల బరిలో తమిళ మహిళ
Rini Sampath

ఇంటర్నెట్ డెస్క్: తమిళనాడులోని తేనిలో జన్మించిన రిని సంపత్(31) వాషింగ్టన్ డీసీలో జరగబోయే మేయర్ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ఈ ఎన్నికల్లో బరిలో నిలిచేందుకు కావల్సిన నామినేషన్ అర్హతను సాధించిన ఆమె.. తొలి దక్షిణాసియా అభ్యర్థిగా గుర్తింపు పొందారు.


రిని సంపత్.. ప్రస్తుతం ప్రభుత్వ కాంట్రాక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. వృత్తి జీవితమంతా ప్రభుత్వ కార్యక్రమాలకు, పౌరసేవలను మెరుగుపరచడంలో గడిపిన ఆమె.. డెమోక్రటిక్ పార్టీ తరఫున ఈ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. డెమోక్రటిక్ పార్టీ తరఫున 'ఫిక్స్ ది బేసిక్స్', 'ఏ న్యూ డీసీ' నినాదాలతో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. నగరంలోని రోడ్లపై గుంతలను పూడ్చడం, మురుగునీటి వ్యవస్థను అరికట్టడం, ధరలను తగ్గించడం, ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోవడం వంటి వాటికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు ఆమె స్పష్టం చేశారు.


రిని ఏడేళ్ల వయసులో ఆమె తల్లిదండ్రులు యూఎస్‌కు వలస వెళ్లారు. సుమారు దశాబ్దానికి పైగా ఆమె వాషింగ్టన్ డీసీలోనే నివసిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ డెమోక్రాట్ల ఆధిపత్యం కొనసాగుతోంది. 1975 నుంచి అక్కడ మేయర్ ఎన్నికలు జరుగుతుండగా ఇప్పటివరకు రిపబ్లికన్ మేయర్ లేరు. కావున.. రిని విజయం నల్లేరుపై నడకలేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రాథమిక ఎన్నికలు జూన్ 16న జరగనుండగా, సాధారణ ఎన్నికలు నవంబర్ 3న జరగనున్నాయి.


ఇవీ చదవండి:

టిక్కెట్ ఇవ్వకపోవడం కాదు, నేనే పోటీ చేయనని చెప్పాను: అన్నామలై

ఐదేళ్లు ప్రశాంతంగా జీవించాలంటే బీజేపీని ఐక్యంగా అడ్డుకోండి.. మమత పిలుపు

Updated Date - Apr 05 , 2026 | 12:56 PM