Share News

జాన్ హార్వర్డ్ విగ్రహంలోని 3 తప్పులు ఇవే! నిజం తెలిస్తే షాక్ అవుతారు

ABN , Publish Date - Sep 07 , 2026 | 02:48 PM

ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధి చెందిన యూనివర్సిటీల్లో హార్వర్డ్ ఒకటి. అమెరికాలో ఉన్న ఈ విశ్వవిద్యాలయంలో చదివిన ఎంతో మంది విద్యార్థులు వివిధ దేశాల్లో అత్యున్నత పదవుల్లో ఉన్నారు. ఈ యూనివర్సిటీ ప్రాంగణంలో ఉన్న జాన్ హార్వర్డ్ కాంస్య విగ్రహం అందరినీ ఆకట్టుకుంటుంది.

జాన్ హార్వర్డ్ విగ్రహంలోని 3 తప్పులు ఇవే! నిజం తెలిస్తే షాక్ అవుతారు
Harvard University

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధి చెందిన యూనివర్సిటీల్లో హార్వర్డ్ ఒకటి. అమెరికాలో ఉన్న ఈ విశ్వవిద్యాలయంలో చదివిన ఎంతో మంది ప్రపంచ దేశాల్లో వివిధ ఉన్నత స్థాయిలో ఉన్నారు. ఈ యూనివర్సిటీ ప్రాంగణంలో ఉన్న జాన్ హార్వర్డ్ కాంస్య విగ్రహం విద్యార్థులు, పర్యాటకులను ఆకట్టుకుంటుంది. పరీక్షలకు ముందు విద్యార్థులు ఈ విగ్రహానికి నమష్కరిస్తే మంచి మార్కులు వస్తాయనేది ఇక్కడ తరతరాలుగా వస్తున్న నమ్మకం. ఈ విగ్రహం ఎంతో ప్రత్యేకంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ విగ్రహంలో ఎవరికి తెలియని కొన్ని దోషాలు ఉన్నాయి. అందుకే విద్యార్థులు, పూర్వ విద్యార్థులు దీనిని సరదాగా 'మూడు అబద్ధాల విగ్రహం' (Statue of Three Lies) అని పిలుస్తారు. మరి.. ఆ మూడు అబద్ధాలు లేదా తప్పులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..


మొదటి తప్పు ఏమిటంటే... ఈ విగ్రహంలో ఉన్న రూపం అసలు జాన్ హార్వర్డ్‌దే కాదు. జాన్ హార్వర్డ్ అసలు రూపం ఎలా ఉంటుందనేదానికి సంబంధించి చరిత్రలో ఎటువంటి ఆధారాలు, ఫొటోలు లభించలేదు. 1884లో శిల్పి డానియెల్ చెస్టర్ ఫ్రెంచ్ ఈ విగ్రహాన్ని చెక్కేటప్పుడు.. షెర్మన్ హోర్ అనే విద్యార్థిని రూపాన్ని ఉపయోగించుకున్నారట. అంటే అక్కడ జాన్ హార్వర్డ్ పేరుతో ఉన్న విగ్రహంలో హార్వర్డ్ రూపం లేకపోవడం గమనార్హం.


రెండో తప్పు విషయానికి వస్తే.. జాన్ హార్వర్డ్ ఈ విశ్వవిద్యాలయానికి వ్యవస్థాపకుడు కానే కాదు. ఆ విగ్రహం శాసనంలో ఆయన్ని 'వ్యవస్థాపకుడు' అని పేర్కొన్నప్పటికీ, ఆయన కనీసం ఆ కాలేజీలో చదవలేదు కూడా. నిజానికి ఆయన విశ్వవిద్యాలయానికి తొలి దాత మాత్రమే. ఆయన తన ఆస్తిలో సగాన్ని, సుమారు 400లకు పైగా పుస్తకాలను యూనివర్సిటీకి విరాళంగా ఇచ్చారు. మసాచుసెట్స్ బే కాలనీకి చెందిన గ్రేట్ అండ్ జనరల్ కోర్టు ఓటింగ్ ద్వారా ఈ విశ్వవిద్యాలయం అధికారికంగా ఏర్పాటయింది. ఆయన చేసిన భారీ విరాళానికి గుర్తింపుగా మాత్రమే ఈ సంస్థకు ఆయన పేరు పెట్టారు.


ఇక చివరిది, మూడో తప్పు ఏమిటంటే.. ఈ విగ్రహంపై చెక్కిన స్థాపన సంవత్సరం కరెక్ట్ కాదు. విగ్రహం అడుగుభాగంలో 1638 అని రాసి ఉంటుంది. కానీ హార్వర్డ్ విశ్వవిద్యాలయాన్ని 1636లోనే స్థాపించారు. దీంతో ఇది అమెరికాలోనే అత్యంత పురాతనమైన ఉన్నత విద్యా సంస్థగా నిలిచింది. ప్రారంభంలో దీనిని 'న్యూ కాలేజ్' అని పిలిచేవారు. ఆ తర్వాత 1639 మార్చిన దీనికి అధికారికంగా హార్వర్డ్ పేరు పెట్టారు. ఇలా చరిత్ర పరంగా హార్వర్డ్ విగ్రహం విషయంలో అనేక వివాదాలు, తప్పులు ఉన్నప్పటికీ.. తమకు అదృష్టాన్ని తెస్తుందనే నమ్మకంతో విద్యార్థులు ఈ విగ్రహం కాళ్లను తాకే సంప్రదాయం నేటికీ కొనసాగుతూనే ఉంది.


ఇవి కూడా చదవండి:

జపాన్‌లో టీఏజే ఆధ్వర్యంలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవాలు

దులీప్ ట్రోఫీ ఫైనల్: విధ్వంసం.. ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ

Updated Date - Sep 07 , 2026 | 02:59 PM