Share News

ఇరాక్‌లోని అమెరికా ఎంబసీపై ఇరాన్ క్షిపణి దాడి

ABN , Publish Date - Mar 14 , 2026 | 11:49 AM

అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులకు ఇరాన్ ప్రతీకార దాడులు కొనసాగిస్తోంది. ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లోని అమెరికా ఎంబసీపై ఇరాన్ క్షిపణి దాడి జరిపింది. శనివారం ఉదయం భారీ పేలుడు అనంతర అమెరికా ఎంబసీ ప్రాంతంలో దట్టమైన పొగలు కమ్ముకున్నట్టు అధికారులు తెలిపారు.

ఇరాక్‌లోని అమెరికా ఎంబసీపై ఇరాన్ క్షిపణి దాడి
US Embassy attacked in Baghdad

బాగ్దాద్: అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులకు ఇరాన్ ప్రతీకార దాడులు కొనసాగిస్తోంది. ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లోని అమెరికా ఎంబసీపై ఇరాన్ క్షిపణి దాడి జరిపింది. శనివారం ఉదయం భారీ పేలుడు అనంతరం అమెరికా ఎంబసీ ప్రాంతంలో దట్టమైన పొగలు కమ్ముకున్నట్టు అధికారులు తెలిపారు. ఎంబసీ కాంపౌండ్‌లోని హెలిప్యాడ్‌ను లక్ష్యంగా చేసుకుని క్షిపణి దాడి జరిగిందని, హెలిప్యాడ్ దెబ్బతిందని ఇరాక్ సెక్యూరిటీ అధికారులు తెలిపారు.


ఎంబసీ కాంప్లెక్స్‌పై డ్రోన్ దాడి జరిగినట్టు సెక్యూరిటీ అధికారి ఒకరు చెప్పగా, ప్రొజక్టైల్‌ దాడి జరిగినట్టు మరో భద్రతాధికారి చెప్పారు. అయితే ఈ ఘటనపై అమెరికా ఎంబసీ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు ప్రారంభించినప్పటి నుంచి బాగ్దాద్‌లోని అమెరికా ఎంబసీపై ఇరాన్ దాడి జరపడం ఇది రెండోసారి. ఇరాక్‌లో టెహ్రాన్‌కు మద్దతుగా నిలుస్తున్న సాయుధ గ్రూపులు ఈ దాడులకు పాల్పడుతున్నట్టు చెబుతున్నారు.


ఇదీ నేపథ్యం..

దీనికి ముందు, ఇరాన్ చమురుకు వ్యూహాత్మక హబ్‌గా ఉన్న ఖర్గ్ ఐలాండ్‌పై అమెరికా సెంట్రల్ కమాండ్ శనివారంనాడు అత్యంత శక్తివంతమైన దాడులు జరిపింది. తన ఆదేశాల మేరకు జరిగిన ఈ దాడుల్లో ఐలాండ్‌లోని సైనిక కేంద్రాలు తునాతునకలైనట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఇప్పటికైతే ఐలాండ్‌లోని చమురు మౌలిక సదుపాయాలను విడిచిపెట్టామని, హోర్ముజ్ జలసంధిలో వ్యాపార నౌకల రాకపోకలను ఇరాన్ అడ్డుకోవాలని చూస్తే మాత్రం ఐలాండ్‌లోని చమురు మౌలిక సదుపాయలను టార్గెట్ చేసే అవకాశాలను పరిశీలిస్తామని హెచ్చరించారు. దీనికి ఇరాన్ అంతే ఘాటుగా స్పందించారు. ఖర్గ్ ఐలాండ్‌పై దాడులు చేస్తే అమెరికాకు సహకారం అందిస్తున్న సంస్థలకు చెందిన చమురు, ఇంధన మౌలిక సదుపాయాలను బూడిద చేస్తామని ఇరాన్ మిలటరీ హెడ్‌క్వార్టర్స్ హెచ్చరించింది. ఇదే సమయంలో ఇరన్ కొత్త సుప్రీం నేత మొజ్తాబా ఖమేనీ ఆచూకీ చెబితే రూ.92 కోట్ల రివార్డు ఇస్తామని అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రకటించడంపై కూడా ఇరాన్ గుర్రుమంది. ఈ నేపథ్యంలోనే బాగ్దాద్‌లోని అమెరికా ఎంబసీపై తాజాగా ఇరాన్ క్షిపణి దాడికి దిగినట్టు చెబుతున్నారు.


ఇవి కూడా చదవండి..

మొజ్తాబా ఆచూకీ చెబితే రూ.92 కోట్లు.. రివార్డు ప్రకటించిన యూఎస్

ఇరాన్ ఆర్థిక కిరీటం ఖర్గ్ ఐలాండ్‌పై విరుచుకుపడిన అమెరికా సైన్యం

Updated Date - Mar 14 , 2026 | 12:29 PM