అమెరికాలో 11 మంది భారతీయుల అరెస్ట్.. కారణమిదే.!
ABN , Publish Date - Mar 14 , 2026 | 11:24 AM
ఇమిగ్రేషన్ ప్రయోజనాలను పొందడం కోసం ప్రణాళికాబద్ధంగా కుట్ర పన్నారనే ఆరోపణలపై అమెరికాలో 11 మంది భారతీయ పౌరులను అరెస్టు చేశారు. వారు వీసా మోసానికి కుట్ర పన్నారనే అభియోగం మోపారు.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలో కొందరు భారతీయులు అక్రమంగా నివసించేందుకు చేసిన మాస్టర్ ప్లాన్‌ను ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్‌బీఐ) ఛేదించింది. వీసా మోసానికి కుట్ర పన్నారనే ఆరోపణలపై నాలుగు రాష్ట్రాలలో చేపట్టిన ఆపరేషన్‌లో 11 మందిని అరెస్ట్ చేసింది. సదరు వ్యక్తులు నేర బాధితులుగా డ్రామాలాడి, ఇమ్మిగ్రేషన్ పొందేందుకు సాయుధ దోపిడీలకు పాల్పడ్డారని ఎఫ్‌బీఐ ఆరోపించింది.
అసలేం జరిగిందంటే?
ఎఫ్‌బీఐ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ముఠా ప్రణాళికలో భాగంగా మసాచుసెట్స్ రాష్ట్రంలోని లిక్కర్ షాప్‌లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, కన్వీనియెన్స్ స్టోర్లలో నకిలీ దోపిడీలు జరుగుతాయి. ఈ డ్రామాలో ఓ వ్యక్తి ఆయుధంతో షాపులోకి ప్రవేశించి అక్కడి గుమాస్తాను బెదిరించి నగదుతో ఉడాయించగా.. ఇదంతా సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అవుతుంది. ఈ విషయం కాస్త ఆలస్యంగా పోలీసులకు తెలుస్తుంది. ఆ తర్వాత దొంగ దొరక్కుండా జాగ్రత్తపడతాడు. స్టోర్‌లో దోపిడీ నిర్వహించేందుకు యజమాని, అలాగే బాధితుడిగా నటించినందుకు గుమాస్తాకు డబ్బులు చెల్లిస్తారు. ఈ డ్రామా అంతా పూర్తయ్యాక తామే ఈ దోపిడీ చేశామని పోలీసులకు సమాచారమిచ్చి.. ఆ సాక్ష్యాలతో 'యు' నాన్ ఇమిగ్రెంట్ వీసాకు దరఖాస్తు చేసుకుంటుంటారు.
అయితే.. మొత్తం వ్యవహారాన్ని రాంభాయ్ పటేల్ అనే వ్యక్తి నడిపిస్తున్నారని తెలుస్తోంది. ఇలా వీసాలు పొందేందుకు బాధితులుగా నటించేవారు అతడికి భారీగా డబ్బులిస్తారని సమాచారం. అతడే ఈ ప్లాన్‌ను అమలు చేస్తుంటాడు. కాగా.. రాంభాయ్ పటేల్, అతడి డ్రైవర్‌ను అధికారులు ఇప్పటికే పట్టుకున్నారు. ప్రస్తుతం అరెస్టైన వారిలో జితేంద్ర కుమార్ పటేల్, మహేశ్ కుమార్ పటేల్, సంజయ్ కుమార్ పటేల్, అమితాబెన్ పటేల్, సంగీతాబెన్ పటేల్, మితుల్ పటేల్, రమేష్‌భాయ్ పటేల్, రోనక్ కుమార్ పటేల్, సోనాల్ పటేల్, మింకేశ్ పటేల్ ఉన్నారు. వీరిని బోస్టన్‌లోని ఫెడరల్ కోర్టులో హాజరుపరచనున్నట్టు తెలుస్తోంది.
వీసా మోసానికి పాల్పడినట్టుగా నేరం రుజువైతే.. మూడేళ్ల జైలు శిక్ష, 2.50 లక్షల డాలర్లు(భారత కరెన్సీలో సుమారు రూ.2.10 కోట్లు) భారీ జరిమానా విధించే అవకాశం ఉంది.
ఇవీ చదవండి:
ఆ పరీక్షా షెడ్యూల్‌పై సీబీఎస్ఈ క్లారిటీ.. ఆ వార్తలు ఫేక్ అని స్పష్టం
AI Vs ARపై 'ఏబీఎన్ ఆంధ్రజ్యోతి' డైరెక్టర్ ప్రత్యేక విశ్లేషణ