Share News

కాగ్నిజెంట్‌కు షాక్‌.. భారతీయులపై ప్రభావం ఎంత?

ABN , Publish Date - Sep 09 , 2026 | 08:57 PM

ప్రముఖ టెక్ సంస్థ కాగ్నిజెంట్‌కు అమెరికా షాకిచ్చింది. నూతన పీఈఆర్‌ఎమ్ దరఖాస్తులను సమర్పించేందుకు కంపెనీకి అనుమతి నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

కాగ్నిజెంట్‌కు షాక్‌.. భారతీయులపై ప్రభావం ఎంత?
Cognizant Green Card Suspension

ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ టెక్ సంస్థ కాగ్నిజెంట్‌కు అమెరికా షాకిచ్చింది. నూతన పీఈఆర్‌ఎమ్ (PERM) దరఖాస్తులను సమర్పించేందుకు కంపెనీకి అనుమతి నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. వీసా కార్యక్రమాల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై జరుగుతున్న దర్యాప్తులో భాగంగానే ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అమెరికా ప్రభుత్వం హెచ్‌-1బీ, పీఈఆర్‌ఎం ఉద్యోగ వీసా కార్యక్రమాల్లో మోసం, దుర్వినియోగంపై దర్యాప్తు ముమ్మరం చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం వచ్చింది (Cognizant Green Card Suspension).


అమెరికాలో ఉద్యోగం ద్వారా గ్రీన్‌కార్డ్‌ పొందాలనుకునే విదేశీ ఉద్యోగులకు పీఈఆర్‌ఎం ప్రక్రియ చాలా కీలకం. సాధారణంగా అమెరికా కంపెనీ ఒక విదేశీ ఉద్యోగిని శాశ్వతంగా స్పాన్సర్‌ చేయాలంటే ముందుగా కార్మిక శాఖకు పీఈఆర్‌ఎం దరఖాస్తు చేస్తుంది. ఆ ఉద్యోగానికి తగిన అర్హత కలిగిన అమెరికా ఉద్యోగి అందుబాటులో లేడని, విదేశీ ఉద్యోగిని నియమించడం వల్ల అమెరికన్‌ ఉద్యోగుల వేతనాలు, పని పరిస్థితులపై ప్రతికూల ప్రభావం ఉండదని కంపెనీ నిరూపించాల్సి ఉంటుంది. పీఈఆర్‌ఎం ఆమోదం తర్వాతే గ్రీన్‌కార్డ్‌ ప్రక్రియలో తదుపరి దశలకు వెళ్లే అవకాశం ఉంటుంది (Cognizant PERM Suspension).


కాగ్నిజెంట్‌లో పనిచేస్తున్న హెచ్‌-1బీ ఉద్యోగుల్లో గ్రీన్‌కార్డ్‌ స్పాన్సర్‌షిప్‌ కోసం కొత్తగా పీఈఆర్‌ఎం ప్రక్రియ ప్రారంభించాల్సిన వారు ఈ నిర్ణయంతో ప్రధానంగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా అమెరికాలో చాలా కాలంగా పనిచేస్తున్న భారతీయ హెచ్‌-1బీ ఉద్యోగులకు ఇది మరింత అనిశ్చితిని సృష్టించవచ్చు. చెన్నైలో 1994లో ప్రారంభమైన కాగ్నిజెంట్‌ ప్రస్తుతం అమెరికాలో ప్రధాన కార్యాలయం కలిగిన బహుళజాతి ఐటీ సంస్థగా ఉంది. జూన్‌ 30 నాటికి కాగ్నిజెంట్‌కు 3,510 హెచ్‌-1బీ పిటిషన్లకు ఆమోదాలు లభించాయి ( Indian IT Workers US).


ప్రస్తుతం ఈ చర్య కాగ్నిజెంట్‌ పైనే నేరుగా ప్రభావం చూపిస్తోంది. అయితే అమెరికా ప్రభుత్వం పీఈఆర్‌ఎం, హెచ్‌-1బీ కార్యక్రమాలపై మరింత కఠినంగా వ్యవహరిస్తే, అమెరికాలో పెద్ద సంఖ్యలో విదేశీ నిపుణులను నియమించుకునే ఇతర ఐటీ సంస్థలపై కూడా అదనపు పరిశీలన పెరగవచ్చనే ఆందోళన ఉంది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్ వంటి భారతీయ ఐటీ దిగ్గజ సంస్థలపై కూడా అమెరికా కార్మిక శాఖ నిశిత పరిశీలన పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.


ఇవి కూడా చదవండి..

ఎస్-400, ఎస్‌యు-57, బ్రహ్మోస్‌పై భారత్‌ ఫోకస్.. మోదీ-పుతిన్ భేటీలో కీలక చర్చలు..


మరో పదేళ్లలో మనుషుల్ని ఏఐ చంపేయొచ్చు.. ఆంత్రోపిక్‌ పరిశోధకుడి సంచలన హెచ్చరిక..

Updated Date - Sep 09 , 2026 | 08:58 PM