Share News

ఎస్-400, ఎస్‌యు-57, బ్రహ్మోస్‌పై భారత్‌ ఫోకస్.. మోదీ-పుతిన్ భేటీలో కీలక చర్చలు..

ABN , Publish Date - Sep 09 , 2026 | 03:36 PM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య ఈ నెల 11న న్యూఢిల్లీలో ద్వైపాక్షిక భేటీ జరగనుంది. బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో జరగనున్న ఈ సమావేశంలో రక్షణ, వాణిజ్యం, ఇంధనం, అణుశక్తి, సాంకేతిక సహకారంపై చర్చలు జరిగే అవకాశం ఉంది.

ఎస్-400, ఎస్‌యు-57, బ్రహ్మోస్‌పై భారత్‌ ఫోకస్.. మోదీ-పుతిన్ భేటీలో కీలక చర్చలు..
Modi Putin Meeting

ఇంటర్నెట్ డెస్క్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య ఈ నెల 11న న్యూఢిల్లీలో ద్వైపాక్షిక భేటీ జరగనుంది. బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో జరగనున్న ఈ సమావేశంలో రక్షణ, వాణిజ్యం, ఇంధనం, అణుశక్తి, సాంకేతిక సహకారంపై చర్చలు జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా రక్షణ రంగంలో ఎస్-400, ఎస్‌యు-57, బ్రహ్మోస్ కోనుగోళ్లపై భారత్ కీలక చర్చలు జరపనున్నట్టు సమాచారం (Modi Putin Meeting).


భారత్‌-రష్యా రక్షణ సహకారంలో ఎస్-400 వైమానిక రక్షణ వ్యవస్థ కీలకమైనది. భారత్‌ గతంలో రష్యాతో ఐదు ఎస్-400 వ్యవస్థల కోసం ఒప్పందం చేసుకుంది. వాటిల్లో మూడింటిని ఇప్పటికే రష్యా నుంచి డెలివరీ తీసుకుంది. మిగిలిన రెండింటినీ ఈ ఏడాది చివర్లో అందుకోవాల్సి ఉంది. వాటి గురించి, భవిష్యత్ రక్షణ అవసరాల గురించి కూడా మోదీ-పుతిన్ చర్చించే అవకాశం ఉంది (India Russia Defence Deal).


మోదీ-పుతిన్ భేటీలో అత్యంత ఆసక్తికరమైన అంశం రష్యా ఎస్‌యు-57 ఐదో తరం స్టెల్త్ ఫైటర్ జెట్. భారత్‌కు ఎస్‌యు-57 విమానాలను విక్రయించే అంశం చర్చల అజెండాలో ఉందని క్రెమ్లిన్‌ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ వెల్లడించారు. అయితే భారత్‌ కేవలం విమానాలను కొనుగోలు చేయడంపైనే కాకుండా టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్‌పై కూడా ఆసక్తి చూపుతోంది. ఎస్‌యు-57 తయారీకి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని భారత్‌లోకి తీసుకురావడం ద్వారా దేశీయంగా తయారీ సామర్థ్యాన్ని పెంచుకోవాలన్నది ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది (Su-57 India).


ఇక, భారత్‌-రష్యా సంయుక్త రక్షణ సహకారానికి ప్రతీకగా నిలిచిన బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ మిసైల్‌ను కూడా మరింత అభివృద్ధి చేయాలని ఇరు దేశాలు భావిస్తున్నాయి. బ్రహ్మోస్‌కు అదనపు సామర్థ్యాలు, కొత్త ఫీచర్లు జోడించి దాని పనితీరును పెంచడం గురించి చర్చలు జరుగుతున్నాయని పెస్కోవ్ తెలిపారు. ఇది కేవలం భారత సైనిక సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా భవిష్యత్తులో రక్షణ ఎగుమతులకు కూడా ఉపయోగపడే అవకాశం ఉంది (BrahMos Upgrade).


మోదీ-పుతిన్ చర్చలు రక్షణ రంగానికే పరిమితం కావు. ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులు, అణుశక్తి సహకారం, అరుదైన ఖనిజాల అన్వేషణ వంటి అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. భారత్‌-రష్యా సంబంధాలను సాంప్రదాయ ఆయుధ కొనుగోళ్లకు మించి సంయుక్త తయారీ, టెక్నాలజీ భాగస్వామ్యం, పెట్టుబడులు వంటి రంగాల్లో మరింత విస్తరించాలనే ప్రయత్నం కనిపిస్తోంది. సెప్టెంబర్ 12-13 తేదీల్లో న్యూఢిల్లీలో బ్రిక్స్ సదస్సు జరగనుంది. దీనికి ఒక రోజు ముందు మోదీ-పుతిన్ ద్వైపాక్షిక భేటీ జరగనుంది.


ఇవీ చదవండి:

పిరికి జడ్జి అనిపించుకోవడం కన్నా చావడం మేలు

టీచర్‌ ఉద్యోగాలకు టెట్‌.. లెక్చరర్‌ పోస్టులకు నెట్‌ తప్పనిసరి

Updated Date - Sep 09 , 2026 | 04:25 PM