మరో పదేళ్లలో మనుషుల్ని ఏఐ చంపేయొచ్చు.. ఆంత్రోపిక్ పరిశోధకుడి సంచలన హెచ్చరిక..
ABN , Publish Date - Sep 09 , 2026 | 03:03 PM
కృత్రిమ మేధ అభివృద్ధిపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రముఖ ఏఐ సంస్థ ఆంత్రోపిక్‌కు చెందిన పరిశోధకుడు జాకబ్ కాక్సన్ సంచలన హెచ్చరిక చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: కృత్రిమ మేధ (AI) అభివృద్ధిపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రముఖ ఏఐ సంస్థ ఆంత్రోపిక్‌కు చెందిన పరిశోధకుడు జాకబ్ కాక్సన్ సంచలన హెచ్చరిక చేశారు. మనుషులకంటే తెలివైన, తనను తాను నిరంతరం అభివృద్ధి చేసుకునే ఏఐ వ్యవస్థలు దశాబ్దం ముగిసేలోపే మానవాళికి తీవ్ర ముప్పుగా మారే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు (Anthropic researcher AI warning).
ఈ ఆందోళనల కారణంగానే ఆంత్రోపిక్ నుంచి వైదొలుగుతున్నట్లు కాక్సన్ ప్రకటించారు. కాక్సన్ గత మూడు సంవత్సరాల్లో ఓపెన్‌ఏఐ, ఆంత్రోపిక్ సంస్థల్లో ఏఐ మోడళ్ల శిక్షణకు సంబంధించిన పరిశోధనలు చేశారు. ఈ రెండు సంస్థలూ అత్యంత శక్తిమంతమైన, స్వయం-అభివృద్ధి చెందగల ఏఐని తయారు చేసేందుకు ప్రమాదకర పోటీలో పడ్డాయని విమర్శించారు.
ప్రస్తుతం ఉన్న ఏఐ మోడళ్ల గురించి కాకుండా.. భవిష్యత్తులో తనను తాను మెరుగుపరుచుకునే సూపర్‌ఇంటెలిజెన్స్ ఏర్పడటమే తన ప్రధాన ఆందోళన అని ఆయన వివరించారు. అలాంటి వ్యవస్థలు మనుషుల సామర్థ్యాలను మించి వేగంగా అభివృద్ధి చెందితే వాటిని నియంత్రించడం కష్టమవుతుందని హెచ్చరించారు (AI could kill humans).
ఆంత్రోపిక్ అలైన్‌మెంట్ సైన్స్ లీడ్‌గా ఉన్న ఇవాన్ హుబింగర్ కూడా కాక్సన్ తరహాలోనే స్పందించారు. తన వ్యక్తిగత అంచనా ప్రకారం, వచ్చే పదేళ్లలో మానవాళిని ఏఐ అంతం చేసే అవకాశం 10 శాతానికి మించి ఉందని అభిప్రాయపడ్డారు (AI extinction risk). రికర్సివ్ సెల్ఫ్-ఇంప్రూవ్‌మెంట్ వల్ల సూపర్‌ఇంటెలిజెన్స్ ఏర్పడటం మానవాళికి నిజమైన సవాలు అని పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఏఐ సంస్థలు పరస్పరం సమన్వయం చేసుకుని భద్రతా ప్రమాణాలను పాటించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
Also Read:
గ్యాస్, గుండెపోటు మధ్య తేడా ఏంటి? ఈ విషయాలు తెలుసుకోండి
నిద్రలో చెమటలు పడుతున్నాయా? కారణం ఇదే కావచ్చు!