Share News

వినాయక విగ్రహం కొంటున్నారా? ఈ విషయాలు గుర్తుంచుకోండి

ABN , Publish Date - Sep 09 , 2026 | 02:51 PM

వినాయక చవితి సందర్భంగా ఇంట్లో గణపతిని ప్రతిష్ఠించేందుకు చాలామంది కొత్త విగ్రహాన్ని కొనుగోలు చేస్తారు. అయితే గణేశుడి విగ్రహాన్ని కొనేటప్పుడు కొన్ని విషయాలను తప్పక గుర్తుంచుకోవాలని సంప్రదాయాలు చెబుతున్నాయి.

వినాయక విగ్రహం కొంటున్నారా? ఈ విషయాలు గుర్తుంచుకోండి
Ganesh Idol Buying Tips

ఇంటర్నెట్ డెస్క్: 2026 సంవత్సరంలో వినాయక చవితి సెప్టెంబర్ 14, సోమవారం నాడు జరుపుకోనున్నారు. వినాయక చవితి సందర్భంగా చాలా మంది తమ ఇళ్లలో గణపతిని ప్రతిష్ఠించి పూజలు చేస్తారు. అయితే ఇంట్లో గణేశుడి విగ్రహాన్ని పెట్టుకునే ముందు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలని పండితులు చెబుతున్నారు. విగ్రహాన్ని కొనుగోలు చేసేటప్పుడు దాని ఆకారం, తొండం దిశ, రంగు, పరిమాణం వంటి అంశాలను పరిశీలించాలని సూచిస్తున్నారు.


తొండం దిశ:

ఇంట్లో పూజ కోసం తీసుకునే గణేశుడి విగ్రహం తొండం ఎడమ వైపుకు తిరిగి ఉండటం మంచిదని సంప్రదాయంగా భావిస్తారు. దీనిని వామముఖి గణపతి అంటారు. ఇలాంటి విగ్రహం ఇంట్లో సుఖశాంతులు, ఐశ్వర్యానికి ప్రతీకగా భావిస్తారు. కుడివైపు తొండం ఉన్న గణేశుడి విగ్రహాన్ని పూజించడానికి ప్రత్యేక నియమాలు పాటించాల్సి ఉంటుందని పండితులు చెబుతున్నారు.

కూర్చున్న భంగిమ:

కూర్చున్న భంగిమలో ఉన్న గణేశుడి విగ్రహాన్ని ఇంట్లో ప్రతిష్ఠించడం శుభప్రదంగా భావిస్తారు. ఇది స్థిరత్వానికి ప్రతీకగా చెబుతారు. నిలబడి ఉన్న గణేశుడి విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోవడం అంతగా మంచిది కాదని సంప్రదాయ విశ్వాసం.

రంగు:

సింధూరం, తెలుపు, పసుపు రంగుల్లో ఉన్న గణేశుడి విగ్రహాలను శుభప్రదంగా భావిస్తారు. నల్ల రంగు విగ్రహాలను ఇంట్లో ప్రతిష్ఠించకూడదని పండితులు సూచిస్తున్నారు.

ఎలుక, మోదకం ఉండాలి:

గణేశుడి వాహనం ఎలుక. అలాగే మోదకం ఆయనకు ఎంతో ఇష్టమైన నైవేద్యంగా భావిస్తారు. అందుకే విగ్రహంతో పాటు ఎలుక, మోదకం ఉండేలా చూసుకోవడం మంచిది.


విగ్రహం తయారు చేసిన పదార్థం:

పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (POP), రసాయనాలతో తయారు చేసిన విగ్రహాలకు బదులుగా మట్టితో తయారు చేసిన విగ్రహాలను ఎంచుకోవడం మంచిది. ముఖ్యంగా నిమజ్జనం కోసం మట్టి విగ్రహాలు పర్యావరణహితంగా ఉంటాయని పండితులు సూచిస్తున్నారు.

విగ్రహాన్ని పరిశీలించాలి:

విగ్రహాన్ని కొనుగోలు చేసేటప్పుడు ఎక్కడైనా పగుళ్లు ఉన్నాయా, ఏదైనా భాగం విరిగిందా అనే విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. ఎలాంటి లోపాలు లేని విగ్రహాన్ని ఎంచుకోవాలి. ఇంట్లో పూజా మందిరం లేదా పూజ చేసే స్థలానికి సరిపోయే పరిమాణంలో ఉన్న విగ్రహాన్ని తీసుకోవాలని పండితులు చెబుతున్నారు.


Note: ఇందులోని సమాచారం సంప్రదాయ విశ్వాసాలు, ఆచారాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

Also Read:

గ్యాస్‌, గుండెపోటు మధ్య తేడా ఏంటి? ఈ విషయాలు తెలుసుకోండి

నిద్రలో చెమటలు పడుతున్నాయా? కారణం ఇదే కావచ్చు!

Updated Date - Sep 09 , 2026 | 02:54 PM