మొజ్తాబా ఖమేనీకి పుతిన్ అభినందనలు, కొత్త సుప్రీంను టార్గెట్ చేయవద్దన్న చైనా
ABN , Publish Date - Mar 09 , 2026 | 05:39 PM
ఇరాన్ కొత్త సుప్రీం నేత మజ్తాబా ఖమేనీకి రష్యా అభినందనలు చెప్పగా, కొత్త సుప్రీంను మట్టుబెడతామంటూ ఇజ్రాయెల్ మిలటరీ చేస్తున్న హెచ్చరికలతో చైనా విభేదించింది.
టెహ్రాన్: అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులు జరిపి ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీని మట్టుబెట్టడంతో పశ్చిమాసియాలో తలెత్తిన ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్ తన దాడులను లెబనాన్, బీరుట్‌కు విస్తరించింది. ఇరాన్ సైతం ఇజ్రాయెల్‌తో పాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై క్షిపణులు, డ్రోన్‌లతో విరుచుకుపడుతోంది. ఇరాన్‌ను విడగొట్టి దేశం నుంచి చమురును తరలించాలని అమెరికా ప్లాన్ చేస్తోందని టెహ్రాన్ ఆరోపిస్తోంది. ఇరాన్ కొత్త సుప్రీం నేతగా ఎన్నికైన మొజ్తాబా ఖమేనీకి పూర్తి బాసటగా నిలుస్తామని ఆదేశ మిలటరీ ప్రకటించింది. తాజాగా ఇరాన్ కొత్త సుప్రీం నేతకు రష్యా అభినందనలు చెప్పగా, కొత్త సుప్రీంను మట్టుబెడతామంటూ ఇజ్రాయెల్ మిలటరీ చేస్తున్న హెచ్చరికలతో చైనా విభేదించింది.
దేశాన్ని ముందుకు నడిపించండి: పుతిన్
ఇరాన్ కొత్త సుప్రీం నేతగా నియమితులైన మొజ్తాబా ఖమేనీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ అభినందనలు తెలియజేశారు. ఈ విషయాన్ని క్రెమ్లిన్ వెల్లడించింది. మొజ్తాబా తన తండ్రి అలీ ఖమేనీ వారసత్వాన్ని కొనసాగిస్తూ దేశాన్ని గౌరవప్రదంగా ముందుకు నడిపిస్తారన్న ఆశాభావాన్ని పుతిన్ వ్యక్తం చేశారు. కొత్త నేత ప్రస్తుత సంక్లిష్ట దశలో దేశానికి దిశానిర్దేశం చేస్తూ ప్రజల్లో ఐక్యతను పెంపొందిస్తారని నమ్ముతున్నట్టు పేర్కొన్నారు.
నాయకత్వ మార్పిడి అంతర్గత విషయం: చైనా
ఇరాన్ సుప్రీం నేతగా ఎవరిని ఎన్నుకున్నా తమ తదుపరి టార్గెట్ ఆయనే అవుతాడని ఇజ్రాయెల్ మిటలరీ ఇటీవల చేసిన హెచ్చరికలపై చైనా ఘాటుగా స్పందించింది. నాయకత్వ మార్పిడి అనేది ఆదేశ అంతర్గత వ్యవహారమని, ఇరాన్ సార్వభౌమాధికారం, భద్రత, ప్రాంతీయ సమగ్రతను తప్పనిసరిగా గౌరవించాలని బీజింగ్ ఒక ప్రకటనలో పేర్కొంది.
ఇవి కూడా చదవండి..
ఇరాన్ నూతన సుప్రీం లీడర్‌గా మొజ్తాబా ఖమేనీ.. ప్రస్థానమిదే..
క్షిపణి దాడి మృతుల్లో భారతీయులు లేరు.. ఇండియన్ ఎంబసీ పోస్ట్