ట్రంప్‌ను చంపడానికి ఇరాన్ కుట్ర?.. ఆ రెండు ప్లాన్స్ ఫెయిల్..
ABN , Publish Date - Mar 09 , 2026 | 01:35 PM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను చంపడానికి ఇరాన్ కుట్ర చేసినట్లు అమెరికాకు చెందిన ఓ ప్రముఖ మీడియా సంస్థ పేర్కొంది. ఇరాన్ 2024లో రెండు సార్లు ట్రంప్‌ను చంపడానికి కుట్ర చేసింది. ఇందుకోసం టీమ్‌లను కూడా రంగంలోకి దింపింది.
న్యూఢిల్లీ, మార్చి 9: అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు సంయుక్తంగా ఇరాన్‌తో యుద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 28వ తేదీన రెండు దేశాలు టెహ్రాన్‌లోని 30 చోట్ల బాంబుల వర్షం కురిపించాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయారు. ఆయనతో పాటు భార్య, కూతురు, అల్లుడు, మనవడు చనిపోయారు. యుద్ధం పదవ రోజుకు చేరుకుంది. ఇరాన్ ఒంటరిగానే పోరాటం చేస్తోంది. అరబ్ దేశాల్లోని అమెరికా ఎయిర్ బేస్‌లపై దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్‌పై మిస్సైల్స్ వర్షం కురిపిస్తోంది.
ట్రంప్‌ను చంపడానికి కుట్ర..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను చంపడానికి ఇరాన్ కుట్ర చేసినట్లు అమెరికాకు చెందిన ఓ ప్రముఖ మీడియా సంస్థ పేర్కొంది. ఆ ప్రముఖ మీడియా సంస్థ కథనం ప్రకారం.. ఇరాన్ 2024లో రెండు సార్లు ట్రంప్‌ను చంపడానికి కుట్ర చేసింది. ఇందుకోసం టీమ్‌లను కూడా రంగంలోకి దింపింది. 2024లో ట్రంప్ అధ్యక్ష పదవి పోటీలో ఉన్నారు. జోరుగా ప్రచారాలు నిర్వహిస్తూ ఉన్నారు. అమెరికాలోని ఓ ఇరాన్ స్పై ట్రంప్‌ను చంపడానికి అమెరికాకు చెందిన ఇద్దరు హంతకులకు సుపారీ ఇచ్చాడు. అయితే, వీరిద్దరూ పోలీసులకు దొరికిపోయారు. వీరిలో ఒకరిని పాకిస్థాన్‌కు చెందిన ఆసిఫ్ రజా మర్చంట్‌గా గుర్తించారు.
2020లో అమెరికా చేసిన దాడుల్లో ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కమాండర్ ఖాసీమ్ సోలెమని చనిపోయాడు. దీనికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఇరాన్ ట్రంప్‌ను చంపడానికి పూనుకుంది. మరో ప్లాన్‌లో ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్.. ఫర్హద్ షకేరీ అనే వ్యక్తిని ట్రంప్‌ను చంపడానికి పురమాయించింది. 7 రోజుల్లోనే ట్రంప్‌ను చంపాలని అతడికి ఆదేశాలు జారీ చేసింది. ఒక వేళ ట్రంప్‌ను చంపలేకపోతే.. ప్లాన్‌ను ఎన్నికలు అయిపోయే వరకు వాయిదా వేస్తామని చెప్పింది. ట్రంప్ ఆ ఎన్నికల్లో ఓడిపోతే చంపటం సులభం అవుతుందని ఇరాన్ భావించింది. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ఆదేశాల మేరకు షకేరీ న్యూయార్క్‌కు చెందిన కార్లీస్లే రివెరా, జోనాదన్ లోడ్‌హోల్ట్‌లకు సుపారీ ఇచ్చాడు. ట్రంప్‌ను చంపడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. దాడి జరగక ముందే పోలీసులు షకేరీని అరెస్ట్ చేశారు. ఇలా రెండు సార్లు ఇరాన్ చేసిన ప్రయత్నాలు ఫెయిల్ అయ్యాయి.
ఇవి కూడా చదవండి
కూకట్‌పల్లి నల్లచెరువుపై సీఎం రేవంత్‌రెడ్డి స్పెషల్ ఫోకస్
మా తర్వాత లక్ష్యం ఆ మెడల్ గెలవడమే: సూర్య కుమార్