అమెరికా వలసల శాఖ అధికారుల అదుపులో 5 ఏళ్ల చిన్నారి.. దేశవ్యాప్తంగా కలకలం
ABN , Publish Date - Jan 23 , 2026 | 08:20 AM
అమెరికాలో ఐదేళ్ల బాలుడిని అమెరికా వలసల శాఖ అధికారులు అదుపులోకి తీసుకోవడం కలకలానికి దారి తీసింది. అధికారుల తీరుపై అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ కూడా మండిపడ్డారు. వారి చర్య అనైతికమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా వలసల శాఖ అధికారుల తీరు మరోసారి వివాదాస్పదంగా మారింది. మిన్నెసొటాలో మంగళవారం అక్రమ వలసదారుడు ఏడ్రియన్ అలెగ్జాండర్ ఆరియాస్‌తో పాటు అతడి ఐదేళ్ల తనయుడు లియమ్‌ను కూడా ఇమిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఉదంతంపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ కూడా మండిపడ్డారు. కుటుంబంతో ఉండాల్సిన ఐదేళ్ల బాలుడిని అదుపులోకి తీసుకోవడం తప్పంటూ నెట్టింట ఆగ్రహం వ్యక్తం చేశారు (ICE Officials Detain 5 year old in Minnesota).
అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఈక్వెడార్ దేశానికి చెందిన ఏడ్రియన్ 2024లో అమెరికాకు వచ్చాడు. శరణార్థిగా అమెరికాలో కుటుంబంతో కలిసి ఉండేందుకు దరఖాస్తు చేసుకున్నాడు. అప్పటి బైడెన్ ప్రభుత్వం అతడికి అమెరికాలో ఉండేందుకు తాత్కాలిక ప్రాతిపదికన కొన్ని అనుమతులు కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది.
ఇక వలసలపై ఉక్కుపాదం మోపుతున్న అమెరికా అధికారులు తాజాగా ఏడ్రియన్‌ను టార్గెట్ చేశారు. మంగళవారం లియమ్ స్కూలు నుంచి తిరిగొచ్చే సమయంలో ఇంట్లోనే ఉన్న ఏడ్రియన్‌ను అరెస్టు చేశారు. తొలుత లియమ్‌తో ఇంటి తలుపులు కొట్టించారు. ఆ తరువాత తలుపు తెరిచిన ఏడ్రియన్‌ను అరెస్టు చేశారని సమాచారం. ఈ క్రమంలో బాలుడిని కూడా అధికారులు అరెస్టు చేశారన్న వార్త కలకలానికి దారి తీసింది. ఈ వార్తలపై మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ మండిపడ్డారు. తండ్రిని అదుపులోకి తీసుకునేందుకు ఐదేళ్ల బాలుడిని ఎరగా వాడుకున్నారని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి చర్యలు అనైతికమని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారిని కూడా ఎందుకు అదుపులోకి తీసుకున్నారని ప్రశ్నించారు. ప్రస్తుతం తండ్రీకొడుకులు ఇద్దరూ టెక్సాస్‌లోని ఓ ప్రభుత్వ శిబిరంలో ఉన్నారు.
ఈ ఉదంతంపై డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంలాండ్ శాఖ ప్రతినిధి స్పందించారు. తమ టార్గెట్ చిన్నారి కాదని, అతడి తండ్రి మాత్రమేనని స్పష్టం చేశారు. ఏడ్రియన్ అరెస్టు సమయంలో బాలుడి తల్లి చిన్నారి కస్టడీని తీసుకునేందుకు నిరాకరించిందని చెప్పారు. ఈ క్రమంలో ఏడ్రియన్ అభ్యర్థన మేరకే చిన్నారిని కూడా తమ వెంట తీసుకెళ్లామని చెప్పుకొచ్చారు. ఈ ఉదంతంపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ కూడా స్పందించారు. చిన్నారిని అరెస్టు చేయలేదని క్లారిటీ ఇచ్చారు. ‘ఐదేళ్ల చిన్నారిని అంత చలిలో బయటే వదిలిపెట్టి వచ్చేయమంటారా?’ అని విలేకరులను ఎదురు ప్రశ్నించారు. ఇక లియమ్ త్వరగా తిరిగి రావాలని ఆశిస్తున్నట్టు అతడి స్కూల్ టీచర్లు, సహ విద్యార్థులు తెలిపారు.
ఇవీ చదవండి:
అమెజాన్‌లో 16వేల ఉద్యోగాల కోత?
శాంతి మండలిని ప్రారంభించిన ట్రంప్