Share News

సుంకాలపైవెనక్కి తగ్గిన ట్రంప్‌

ABN , Publish Date - Jan 23 , 2026 | 04:03 AM

గ్రీన్‌లాండ్‌ విషయంలో తన మాట వినని 8 యూరప్‌ దేశాలపై ప్రతీకార సుంకాలు విధిస్తానని బెదిరించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌..

సుంకాలపైవెనక్కి తగ్గిన ట్రంప్‌

  • గ్రీన్‌లాండ్‌ విషయంలో యూరప్‌ దేశాలపై సుంకాలుండవని ప్రకటన

  • ఆర్కిటిక్‌ విషయంలో నాటోతో డీల్‌ కుదిరిందని వెల్లడి

  • అట్లాంటిక్‌ ప్రాంతంపై కొత్త చార్టర్‌ కోసం యూరప్‌ దేశాల భేటీ

దావోస్‌/కోపెన్‌హెగెన్‌, జనవరి 22: గ్రీన్‌లాండ్‌ విషయంలో తన మాట వినని 8 యూరప్‌ దేశాలపై ప్రతీకార సుంకాలు విధిస్తానని బెదిరించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. ఎట్టకేలకు వెనక్కు తగ్గారు. ఇకపై అదనపు సుంకాల విధింపు ఉండబోదని బుధవారం సోషల్‌మీడియా వేదికగా ప్రకటించారు. దావో్‌సలో ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో మాట్లాడిన అనంతరం సీఎన్‌బీసీ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మరో కొత్త విషయం చెప్పారు. ఆర్కిటిక్‌ ప్రాంత రక్షణ, ఉద్రిక్తతల నివారణ కోసం ‘భవిష్యత్తులో చేసుకోబోయే ఒప్పందం’ కోసం విధివిధానాలను రూపొందించే విషయంలో నార్త్‌ అట్లాంటిక్‌ ట్రీటీ ఆర్గనైజేషన్‌ (నాటో) కార్యదర్శి జనరల్‌ మార్క్‌ రుట్టేతో డీల్‌ కుదిరిందని వెల్లడించారు. అయితే ఆ డీల్‌ వివరాలు మాత్రం బయటపెట్టలేదు. మరోవైపు 175 బిలియన్‌ డాలర్ల వ్యయంతో అమెరికాలో ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేస్తున్న గగనతల రక్షణ వ్యవస్థ గోల్డెన్‌ డోమ్‌ మిసైల్‌ డిఫెన్స్‌ ప్రోగ్రామ్‌ను గ్రీన్‌లాండ్‌కు కూడా విస్తరించే అంశంలో చర్చలు జరిగాయని పేర్కొన్నారు. దావో్‌సలో ఆయన ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడు తూ.. జెలెన్‌స్కీతో భేటీ సుహృద్భావ వాతావరణంలో జరిగిందని తెలిపారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ను తమ అధికారులు నేడో రేపో కలుస్తారని చెప్పారు.

మా సార్వభౌమత్వంపై బేరసారాలు ఉండవు: డెన్మార్క్‌

గ్రీన్‌లాండ్‌ విషయంలో డెన్మార్క్‌ తన విధానాన్ని మరోసారి స్పష్టంచేసింది. తమ దేశ సార్వభౌమత్వంపై ఎవరితోనూ బేరసారాలు నిర్వహించబోమని ఆ దేశ ప్రధాని మెట్టీ ఫ్రెడరిక్‌సెన్‌ తేల్చి చెప్పారు. గురువారం ఆమె ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ‘ఆర్కిటిక్‌ భద్రత నాటో కూటమి మొత్తానికి సంబంధించినది. డెన్మార్క్‌ రాజ్యం గురించి నాటోకు పూర్తి అవగాహన ఉంది. మా దేశ భద్రత, పెట్టుబడులు, ఆర్థిక అంశాలపై చర్చలకు మేము ఎల్లప్పుడూ సిద్ధమే. సార్వభౌమత్వం విషయంలో మాత్రాం బేరసారాలు నిర్వహించలేం’ అని స్పష్టంచేశారు. మరోవైపు ట్రంప్‌ విధానాలతో చికాకు పడిన యూరప్‌ దేశాలు మరింతగా ఏకమవుతున్నాయి. అట్లాంటిక్‌ ప్రాంతంలో భవిష్యత్తులో ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా చూసే కొత్త చార్టర్‌ (ఒప్పందం) రూపకల్పనకు యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) కూటమిలోని దేశాల అధినేతలు గురువారం అత్యవసరంగా సమావేశమయ్యారు. కాగా, గ్రీన్‌లాండ్‌ వివాదంపై పుతిన్‌ స్పందించారు. బుధవారం రాత్రి నేషనల్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గ్రీన్‌లాండ్‌ వివాదం రష్యాకు సంబంధం లేనిదని తేల్చి చెప్పారు.

Updated Date - Jan 23 , 2026 | 04:03 AM