Share News

కొత్తగా 25 బీ2 బాంబర్ల తయారీకి ఆర్డర్‌ ఇచ్చాం!

ABN , Publish Date - Jan 23 , 2026 | 04:00 AM

అమెరికా స్టెల్త్‌ బాంబర్ల సంఖ్యను రెట్టింపు చేయడానికి తాము కొత్తగా 25 బీ2 బాంబర్ల తయారీకి ఆర్డర్‌ ఇచ్చినట్టు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ బుధవారం దావో్‌సలో ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

కొత్తగా 25 బీ2 బాంబర్ల తయారీకి ఆర్డర్‌ ఇచ్చాం!

  • డావోస్‌లో ట్రంప్‌ ప్రకటన

  • ఆ విమానాలతయారీ ఆగిపోయింది

  • ట్రంప్‌ చెబుతున్నది ‘బీ21 రైడర్ల’ గురించి అయి ఉండొచ్చంటున్న నిపుణులు

దావోస్‌, జనవరి 22: అమెరికా స్టెల్త్‌ బాంబర్ల సంఖ్యను రెట్టింపు చేయడానికి తాము కొత్తగా 25 బీ2 బాంబర్ల తయారీకి ఆర్డర్‌ ఇచ్చినట్టు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ బుధవారం దావో్‌సలో ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ సందర్భంగా ఆయన.. గత ఏడాది జూన్‌లో ఇరాన్‌లోని అణు స్థావరాలనే లక్ష్యంగా చేసుకుని ‘ఆపరేషన్‌ మిడ్‌నైట్‌ హ్యామర్‌’ పేరిట బీ2 బాంబర్లతో తాము చేసిన దాడి గురించి ప్రస్తావించారు. అప్పట్లో ఆ విమానాలు తెల్లవారుజామున 2 గంటల సమయంలో చిమ్మచీకటిలో ఇరాన్‌లోకి ప్రవేశించి దాడి చేశాయని గుర్తుచేశారు. ప్రస్తుతం అమెరికా వద్ద 19 బీ2 బాంబర్లు స ర్వీసులో ఉన్నాయి. వాటికి తోడుగా మరో 25 బాంబర్లను ఆర్డర్‌ చేశామని ట్రంప్‌ చెబుతున్నారు. కానీ.. అమెరికా బీ2 స్పిరిట్‌ బాంబర్ల తయారీని రెండు దశాబ్దాల క్రితమే నిలిపివేసిందని, దాన్ని తిరిగి ప్రారంభించడం అసాధ్యమని రక్షణరంగ నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే బీ2 అసెంబ్లీ లైన్‌ను మళ్లీ ఏర్పాటు చేయాలంటే పూర్తిగా కొత్తగా మొదలుపెట్టాల్సి ఉంటుంది. వాటి ఫ్లయింగ్‌ వింగ్‌ నిర్మాణానికి ఉపయోగించిన భారీ కాంపోజిట్‌ మౌల్డులను మళ్లీ తయారుచేయాలంటే కొన్నేళ్లు పడుతుంది. కాబట్టి.. బహుశా ట్రంప్‌ చెబుతున్నది బీ2 బాంబర్ల స్థానంలో అభివృద్ధి చేస్తున్న బీ21 రైడర్ల గురించి అని.. రెండింటికీ తేడా తెలియకపోవడం వల్లే ఆయన అలా చెప్పి ఉంటారని నిపుణులు పేర్కొంటున్నారు.

Updated Date - Jan 23 , 2026 | 04:00 AM