Share News

వెనెజువెలాపై దాడిలో సానిక్‌ ఆయుధాల వినియోగం!

ABN , Publish Date - Jan 23 , 2026 | 04:01 AM

వెనెజువెలాపై దాడి సమయంలో అమెరికా సైనికులు.. రహస్య సానిక్‌ ఆయుధాలను వినియోగించినట్లుగా ఇప్పటివరకూ వ్యక్తమైన సందేహాలను ట్రంప్‌ పరోక్షంగా ధ్రువీకరించారు.

వెనెజువెలాపై దాడిలో సానిక్‌ ఆయుధాల వినియోగం!

  • పరోక్షంగా ధ్రువీకరించిన ట్రంప్‌

వాషింగ్టన్‌, జనవరి 22: వెనెజువెలాపై దాడి సమయంలో అమెరికా సైనికులు.. రహస్య సానిక్‌ ఆయుధాలను వినియోగించినట్లుగా ఇప్పటివరకూ వ్యక్తమైన సందేహాలను ట్రంప్‌ పరోక్షంగా ధ్రువీకరించారు. ఇటీవల ఓ టీవీ చానల్‌లో ప్రసారమైన ఇంటర్వ్యూలో యాంకర్‌.. సానిక్‌ ఆయుధాల్ని ఉపయోగించిన మాట వాస్తవమేనా అని ట్రంప్‌ను ప్రశ్నించారు. దీనికి ట్రంప్‌ బదులిస్తూ.. ‘ఎవరికీ తెలియని ఆయుధాలు మనవద్ద ఉన్నాయి. వాటి గురించి మాట్లాడుకోకపోవటమే మంచిది. కానీ, అవి అద్భుతమైన ఆయుధాలు. అది ఓ గొప్ప దాడి’ అని పేర్కొన్నారు. ఈ నెల 3వ తేదీన వెనెజువెలా రాజధాని కారకా్‌సపై అమెరికా సైనికులు జరిపిన దాడిలో 83 మంది మరణించారు. వీరిలో వెనెజువెలాకు చెందిన 47 మంది సైనికులు, ఆ దేశానికి రక్షణ కల్పించటానికి వచ్చిన క్యూబా సైనికులు 32 మంది ఉన్నారు. మిగిలినవారు సాధారణ పౌరులు. ఈ దాడిలో గాయపడిన ఓ వెనెజువెలా సైనికుడి ఇంటర్వ్యూ అప్పట్లో బయటకు వచ్చింది. దానిని అమెరికా వైట్‌హౌస్‌ కార్యదర్శి కూడా సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ‘అకస్మాత్తుగా ఏదో వచ్చి పడింది. అది అత్యంత తీవ్రమైన ధ్వని తరంగంలా ఉంది. తల లోపలి నుంచి పగిలిపోతున్నట్లు అనిపించింది. అక్కడున్న మాకందరికీ ముక్కు లోంచి రక్తం కారటం మొదలైంది. కొందరు రక్తం కక్కుకున్నారు. మేం నేల మీద పడి అచేతనంగా ఉండిపోయాం’ అని ఆ వీడియోలో సదరు సైనికుడు చెప్పటం కనిపించింది. అమెరికా సైనికులు తమ వెంట బందీగా తీసుకెళ్లిన వెనెజువెలా అధ్యక్షుడు మదురో షర్టుపైన రక్తపు మరకలు ఉండటం కూడా అప్పట్లో వెలువడిన ఫొటోల్లో కనిపించిన విషయం తెలిసిందే. ఆయన మీద కూడా ఈ తరహా ఆయుధమే ప్రయోగించి ఉంటారని ఇప్పుడు తెలుస్తోంది.

Updated Date - Jan 23 , 2026 | 04:01 AM