భారత్‌కు రష్యా పౌర విమానాలు!
ABN , Publish Date - Jan 23 , 2026 | 03:58 AM
ప్రయాణికుల విమానాలు అంటే.. అటు అమెరికాకు చెందిన బోయింగ్ సంస్థవి లేదా ఇటు యూర్‌పకు చెందిన ఎయిర్‌బస్ సంస్థకు చెందినవే ఉంటుంటాయి.
అమెరికా బోయింగ్, యూరప్ ఎయిర్‌బ్‌సలకు పోటీగా ఎస్‌జే-100, ఐఎల్-114, ఎంఎస్-21, టీయూ-214 విమానాలు
భారత్‌లో తయారీకి వీలు కల్పించేందుకూ రష్యా సిద్ధం
న్యూఢిల్లీ, జనవరి 22: ప్రయాణికుల విమానాలు అంటే.. అటు అమెరికాకు చెందిన బోయింగ్ సంస్థవి లేదా ఇటు యూర్‌పకు చెందిన ఎయిర్‌బస్ సంస్థకు చెందినవే ఉంటుంటాయి. మరికొన్ని విమాన సంస్థలున్నా వీటిదే ఆధిపత్యం. దానికితోడు ప్రపంచవ్యాప్తంగా పౌర విమానాల కోసం విపరీతమైన డిమాం డ్ ఉంది. విమానాలు కొనేందుకు సిద్ధంగానే ఉన్నా.. ఇప్పట్లో అందలేని పరిస్థితి. ఇలాంటి సమయంలో రష్యా తమ పౌర విమానాలను భారత్‌కు అందజేసేందుకు ముందుకొచ్చింది. 1,500 కిలోమీటర్లలోపు ప్రాంతీయ ప్రయాణాలకు సరిపోయే సుఖోయ్ జెట్ (ఎస్‌జే)-100, ఇల్యూషనోవ్ (ఐఎల్)-114.. మూడు వేల కిలోమీటర్ల వరకు ప్రయాణించగల ఆధునిక ఎంఎస్-21, ఏకధాటిగా 6,500 కిలోమీటర్ల దూరం ప్రయాణించగల అత్యాధునిక టీయూ-214 విమానాలు ఈ జాబితాలో ఉన్నాయి ఈ విమానాలకు సంబంధించి ఇంజన్లు, ఇతర భాగాల నుంచి ఇంటీరియర్ వరకు పూర్తిగా రష్యా అభివృద్ధి చేసినవే కావడం గమనార్హం.. బోయింగ్ 757, ఎయిర్‌బస్ 321 విమానాలకు రష్యా టీయూ-214 పోటీగా నిలవనుంది. అంతేకాదు బోయింగ్, ఎయిర్‌బ్‌సలతో పోలిస్తే.. ఈ విమానాల నిర్వహణ వ్యయం చాలా తక్కువని.. విమానయాన సంస్థలు తక్కువ వ్యయంతోనే సర్వీసులు నిర్వహించేందుకు వీలవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఎస్‌జే-100, ఐఎల్-114 విమానాలు చిన్న రన్‌వేలపైనా సులువుగా టేకాఫ్, ల్యాండింగ్ కాగలవని అంటున్నారు.
భారత్‌లో ఉత్పత్తికి రష్యా సుముఖత!
ఎస్‌జే-100 విమానాలను భారత్‌లో ఉత్పత్తి చే సేందుకు రష్యా ఇప్పటికే సుముఖత వ్యక్తం చేసింది. హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్)తో కలిసి ఉమ్మడిగా తయారు చేయడంపై ఒప్పందం కుదిరింది. ఐఎల్-114, టీయూ-214 విమానాల సరఫరా, భారత్‌లో తయారు చేయడంపై చర్చలు జరుగుతున్నాయి. ఈ అంశంలో ముందడుగు పడితే.. భారత విమానయాన సంస్థలకు విమానాల కొరత తప్పడంతోపాటు మరమ్మతులు, నిర్వహణ భారం తగ్గుతుంది. భారత్‌లో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విమానయాన రంగంలో రష్యా విమానాలు కీలకంగా మారుతాయని.. ముఖ్యంగా దేశవ్యాప్తంగా విమాన సేవల విస్తరణ కోసం చేపట్టిన ‘ఉడాన్’ పథకానికి ఊతమిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో పౌర విమానాల తయారీలో బోయింగ్, ఎయిర్‌బ్‌సల ఆధిపత్యానికి సవాలు విసిరినట్టేనని పేర్కొంటున్నారు.
హైదరాబాద్‌తోనే ప్రపంచం ముందుకు!
హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయంలో ఈ నెల 28వ తేదీ నుంచి 31వరకు జరగనున్న ‘వింగ్స్ ఇండియా 2026’ షోలో రష్యా పౌర విమానాలు ఎస్‌జే-100, ఐఎల్-114లను ప్రదర్శించనున్నారు. కేవలం విమానాల రూపాన్నే కాకుండా లోపల సీట్లు, ఇతర ఏర్పాట్లను కూడా వీక్షించే ఏర్పాట్లు చేస్తున్నారు. రష్యా ఈ విమానాలను ఆ దేశం బయట ప్రదర్శిస్తుండటం ఇదే తొలిసారి కావడం గమనార్హం.