Share News

శాంతి మండలిని ప్రారంభించిన ట్రంప్‌

ABN , Publish Date - Jan 23 , 2026 | 04:04 AM

గాజాలో శాంతి కోసం తాను ప్రతిపాదించిన ‘శాంతి మండలి(బోర్డ్‌ ఆఫ్‌ పీస్‌)’ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ గురువారం దావోస్‌ లో ప్రారంభించారు.

శాంతి మండలిని ప్రారంభించిన ట్రంప్‌

  • గాజాలో శాంతి సాధన తర్వాత ఈ బోర్డును ఇతర విషయాలకూ వర్తింపజేస్తామని వ్యాఖ్య

  • పాకిస్థాన్‌ సహా 20కిపైగా దేశాల సంతకాలు

  • కార్యక్రమానికి హాజరు కాని భారత్‌

దావోస్‌, జనవరి 22: గాజాలో శాంతి కోసం తాను ప్రతిపాదించిన ‘శాంతి మండలి(బోర్డ్‌ ఆఫ్‌ పీస్‌)’ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ గురువారం దావోస్‌ లో ప్రారంభించారు. అందులో అన్ని దేశాలూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారుగానీ.. అమెరికా మిత్రదేశాలే చాలావరకూ అందులో భాగం కాకపోవడం గమనార్హం. భారత్‌ కూడా ఆ బోర్డుకు దూరంగానే ఉంది. ట్రంప్‌ ఆహ్వానాన్ని మన్నించి ఈ బోర్డులో చేరేందుకు 22 దేశాలు అంగీకరించాయి. వాటిలో.. పాకిస్థాన్‌, సౌదీ అరేబియా, టర్కీ, యూఏఈ, ఖతార్‌, ఉజ్బెకిస్థాన్‌, ఇండోనేసియా, జోర్డాన్‌, కజకిస్థాన్‌ వంటి ముస్లిం దేశాలే ఎక్కువగా ఉండడం గమనార్హం. శాంతి బోర్డులో చేరేందుకు అంగీకారం తెలుపుతూ పలువురు దేశాధినేతలు సంతకం చేసిన అనంతరం ట్రంప్‌ వారిని ఉద్దేశించి.. ‘మీరు ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతులు’ అని వ్యాఖ్యానించారు. కాగా.. ట్రంప్‌ వ్యవహారశైలితో తీవ్రంగా విభేదిస్తున్న ఫ్రాన్స్‌, నార్వే, స్లోవేనియా, స్వీడన్‌, యూకే ఈ బోర్డులో చేరడానికి (కనీసం ప్రస్తుతానికి) ఇష్టపడలేదు. భారత్‌, చైనా, రష్యా, జర్మనీ, ఇటలీ, సింగపూర్‌, తదితర దేశాలు ఇందులో చేరుతామనిగానీ, చేరబోమని గానీ చెప్పలేదు.

Updated Date - Jan 23 , 2026 | 06:23 AM