Nicolas Maduro Capture: వెనెజువెలా అధ్యక్షుడి కొంప ముంచిన ఛాలెంజ్!
ABN , Publish Date - Jan 04 , 2026 | 04:34 PM
ప్రస్తుతం అమెరికా కస్టడీలో ఉన్న వెనెజువెలా మాజీ అధ్యక్షుడు మదురో కొన్ని నెలల క్రితం చేసిన సవాలు తాలూకు వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ వీడియోను స్వయంగా శ్వేత సౌధం షేర్ చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: వెనెజువెలా అధ్యక్షుడు నికొలస్ మదురోను అమెరికా సైన్యం రాజధాని కారకాస్‌లో అదుపులోకి తీసుకుని అమెరికాకు తరలించడం యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. అమెరికాకు మాదకద్రవ్యాలు సరఫరా చేస్తూ నార్కో-టెర్రరిజానికి పాల్పడే వారెవరికైనా ఇదే గతి పడుతుందంటూ క్యూబా, మెక్సికో దేశాలను హెచ్చరించారు. అయితే, ఈ ఘటనకు కొద్ది నెలల మునుపు మదురో అమెరికాకు విసిరిన సవాలు తాలూకు వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌గా మారింది (Maduro viral challenge video).
‘దమ్ముంటే రండి.. నేను ఇక్కడే మీకోసం వేచి చూస్తా.. పిరికిపందల్లారా.. ఆలస్యం చేయొద్దు’ అంటూ అమెరికాను ఉద్దేశించి మదురో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతేడాది ఆగస్టులో మదురోపై ప్రకటించిన రివార్డును అమెరికా పెంచిన తరుణంలో ఆయన ఈ కామెంట్స్ చేశారు.
ఈ వీడియోను తాజాగా నెట్టింట పంచుకున్న శ్వేత సౌధం మదురోను హేళన చేసింది. సైనిక చర్యకు సంబంధించిన వీడియోలను కూడా పంచుకుంది. ‘కుదిరినంత కాలం తప్పించుకున్నాడు.. ఇక ఆట కట్టించాము’ అన్న ట్రంప్ కామెంట్స్‌ను కూడా శ్వేత సౌధం వీడియోలో షేర్ చేసింది. దీంతో, ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ ట్రెండవుతోంది. జనాలు ఈ వీడియోపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్ పేరిట రంగంలోకి దిగిన అమెరికా సైన్యం స్థానిక కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి రాజధాని కరాకాస్‌లో మదురో, ఆయన భార్య సీలియా ఫ్లోరెస్‌ను అదుపులోకి తీసుకుని అమెరికాకు తరలించింది. స్టీల్ గోడలతో శత్రుదుర్భేద్యమైన గదిలోకి వెళ్లి దాక్కునేందుకు ప్రయత్నిస్తుండగా అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వారిని బ్రూక్లిన్‌లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్‌లో ఉంచారు.
ఇవీ చదవండి:
ఆ కంటెంట్‌ను తొలగిస్తాం.. అప్‌లోడ్ చేసిన అకౌంట్లను సస్పెండ్ చేస్తాం: ఎలన్ మస్క్
వెనెజువెలా నూతన అధ్యక్షురాలిగా డెల్సీ రోడ్రిగ్జ్ నియామకం