Helicopters Mid-air Collision: షాకింగ్ ఘటన.. గాల్లో ఢీకొన్న హెలికాఫ్టర్లు
ABN , Publish Date - Dec 29 , 2025 | 08:59 AM
రెండు హెలికాఫ్టర్‌లు గాల్లో ఢీకొన్న ఘటన న్యూజెర్సీలో ఆదివారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒక పైలట్ మృతి చెందగా మరో పైలట్ తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రమాద సమయంలో హెలికాఫ్టర్‌లల్లో పైలట్‌లు మాత్రమే ఉన్నారని అధికారులు తెలిపారు.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. న్యూజెర్సీలో ఆదివారం రెండు హెలికాఫ్టర్‌లు గాల్లో ఢీకొని కూలిపోయాయి. అట్లాంటిక్ కౌంటీలోని హామన్‌టన్ మున్సిపల్ ఎయిర్‌పోర్టు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఒక పైలట్ మృతి చెందగా, తీవ్ర గాయాలపాలైన రెండో పైలట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అతడి పరిస్థితి విషమంగా ఉంది (New Jersey Helicopter Crash).
ప్రమాద సమాచారం అందగానే ఘటనా స్థలానికి అత్యవసర సహాయక సిబ్బందిని పంపించామని హామన్‌టన్ పోలీస్ చీఫ్ తెలిపారు. సిబ్బంది వేగంగా స్పందించి మంటలను అదుపుచేశారని అన్నారు. ఎన్‌స్ట్రామ్ ఎఫ్-28ఏ, ఎన్‌స్ట్రామ్ 280సీ హెలికాఫ్టర్‌లు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో హెలికాఫ్టర్‌లలో ప్రయాణికులు ఎవరూ లేరని కూడా చెప్పారు. ఇక పైలట్‌ల వివరాలను మాత్రం ఇంకా వెల్లడించలేదు.
ఈ ప్రమాదంపై ఎఫ్ఏఏతో పాటు నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డు కూడా దర్యాప్తు ప్రారంభించింది. హెలికాఫ్టర్‌లు ప్రయాణించిన మార్గం, పైలట్‌ల మధ్య జరిగిన సంభాషణలు, ఇతర అంశాలను కూడా ఇన్వెస్టిగేటర్లు పరిశీలించనున్నారు. ఎదురుగా వస్తున్న రెండో హెలికాఫ్టర్ ఎందుకు కనబడలేదనే కోణంలో కూడా విచారణ జరపనున్నారు. ప్రమాద సమయంలో వాతావరణం కూడా బాగానే ఉన్నట్టు తెలుస్తోంది. పైలట్‌లకు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌లకు మధ్య సంభాషణలను కూడా ఇన్వెస్టిగేటర్లు పరిశీలించనున్నారు. ముందుగానే అవతలి విహంగాన్ని గుర్తించి పక్కకు తప్పుకోకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయని విమాన ప్రమాదాల మాజీ ఇన్వెస్టిగేటర్ ఆలన్ డీల్ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఓ హెలికాఫ్టర్ గాల్లో గింగిరాలు తిరుగుతూ కూలిపోయిన ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.
ఇవీ చదవండి
వీసా ఫీజు పెంపు.. కాలిఫోర్నియాలో బెంబేలెత్తిస్తున్న టీచర్ల కొరత
ఇటుకలతో దాడి.. బంగ్లాదేశ్‌లో ప్రముఖ సింగర్ కార్యక్రమంలో షాకింగ్ ఘటన