Pune Gangster Nomination: ఎన్నికల్లో గ్యాంగ్‌స్టర్ నామినేషన్! చేతులను తాళ్లతో కట్టేసి తీసుకొచ్చిన పోలీసులు
ABN , Publish Date - Dec 28 , 2025 | 08:34 AM
పుణెకు చెందిన ఓ గ్యాంగ్‌స్టర్ తాజాగా స్థానిక పురపాలక ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న నిందితుడి ముఖానికి నల్లని వస్త్రాన్ని కప్పి, చేతులను తాళ్లతో కట్టేసి అతడిని పోలీసులు పటిష్ఠ భద్రత మధ్య నామినేషన్ ఫైలింగ్ కేంద్రానికి పోలీసులు తీసుకొచ్చారు.
ఇంటర్నెట్ డెస్క్: ముఖం కనిపించకుండా నల్లని వస్త్రాన్ని కప్పి.. చేతులనూ తాళ్లతో కట్టేసి అతడిని పోలీసులు సినీఫక్కీలో తీసుకొచ్చారు. ఆ తరువాత అతడు దర్జాగా స్థానిక సంస్థల ఎన్నికల్లో నిలిచేందుకు నామినేషన్ దాఖలు చేశాడు. ఈ నాటకీయ ఘటన మహారాష్ట్రలోని పుణెలో చోటుచేసుకుంది. ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్న గ్యాంగ్‌స్టర్ బంధు అండేకర్ తాజాగా ఇలా నామినేషన్ దాఖలు చేశాడు (Pune gangster - Civic Polls nomination).
ఆయుష్ కోమ్కర్ అనే వ్యక్తి హత్య కేసులో బంధు అలియాస్ సూర్యకాంత్ రాణోజీ అండేకర్ నిందితుడిగా ఉన్నారు. సెప్టెంబర్ 5న ఆయుష్ నానా పేఠ్ ప్రాంతంలో హత్యకు గురయ్యాడు. అతడిపై కాల్పులు జరపడంతో మృతి చెందాడు. ఆయుష్ కోమ్కర్ తండ్రి పేరు గణేశ్ కోమ్కర్. బంధు అండేకర్ తనయుడు వనరాజ్ అండేకర్ హత్య కేసులో ఆయన నిందితుడిగా ఉన్నారు. వనరాజ్ గతంలో ఎన్సీపీ తరపున కార్పొరేటర్‌గా ఉన్నారు. ప్రస్తుతం బంధు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బంధు అండేకర్ సోదరి సోనాలీ అండేకర్, మరో బంధువు లక్ష్మీ అండేకర్ కూడా నామినేషన్లు దాఖలు చేశారు.
బంధు అండేకర్‌ను పోలీసులు పటిష్ఠ భద్రత మధ్య భవానీ పేట్‌లోని నామినేషన్ ఫైలింగ్ సెంటర్‌కు తీసుకొచ్చారు. యరవాడ సెంట్రల్ జైల్ నుంచి పోలీసు వ్యానులో తీసుకొచ్చారు. అండేకర్ ముఖం కనిపించకుండా నల్లని వస్త్రం కప్పి, చేతులను తాళ్లతో కట్టేసి నామినేషన్ కేంద్రం లోపలకి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా అండేకర్ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. భవానీ పేట్ వార్డ్ ఆఫీసు అభ్యర్థులుగా వారు నామినేషన్ దాఖలు చేశారని అండేకర్ తరపు న్యాయవాది తెలిపారు. నామినేషన్ దాఖలు చేసేందుకు వీలుగా ఎమ్‌సీఓసీఏ ప్రత్యేక కోర్టు అండేకర్‌కు ఇటీవలే కొన్ని పరిమితులతో కూడిన అనుమతిని జారీ చేసింది.
ఇవీ చదవండి
గుడ్ న్యూస్.. రైల్వే శాఖ సమగ్ర ప్రణాళిక.. 2030 కల్లా..
Madras High Court: 16 ఏళ్లలోపు వారికి ఇంటర్నెట్ నిషేధం