Maharashtra Road Accident. డ్రైవర్ కునికిపాటు.. 25 ప్రాణాలు బుగ్గి
ABN , First Publish Date - 2023-07-02T03:24:46+05:30 IST
పెద్ద వేగంగా కూడా వెళ్లడం లేదు.. ఇతర ఇబ్బందీ ఏమీ లేదు.. కానీ.. అర్ధరాత్రి వేళ బస్సు డ్రైవర్ కునుకేయడం పెను ప్రమాదానికి దారితీసింది.
మహారాష్ట్ర బుల్దానా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..
సమృద్ధి మహామార్గ్ ఎక్స్‌ప్రెస్ వేపై బస్సు బోల్తా
అర్ధరాత్రి వేళ అందరూ గాఢ నిద్రలో ఉండగా ఘటన..
స్తంభాన్ని ఢీ కొట్టి పల్టీ, డీజిల్ లీకై మంటలు
బస్సులో 33 మంది..
అద్దాలు పగులగొట్టుకుని వచ్చిన కొందరు ప్రయాణికులు
చనిపోయినవారి వివరాల గుర్తింపునకు డీఎన్‌ఏ పరీక్ష..
డ్రైవర్ తప్పిదమేనని తేల్చిన ప్రభుత్వం
అదనపు డ్రైవర్ మృతి..
మృతుల కుటుంబాలకు కేంద్రం రూ.2 లక్షలు, రాష్ట్రం రూ.5 లక్షల పరిహారం
నాగ్‌పూర్, జూలై 1: పెద్ద వేగంగా కూడా వెళ్లడం లేదు.. ఇతర ఇబ్బందీ ఏమీ లేదు.. కానీ.. అర్ధరాత్రి వేళ బస్సు డ్రైవర్ కునుకేయడం పెను ప్రమాదానికి దారితీసింది. 25 నిండు ప్రాణాలను బలిగొంది. తమ సీట్లలో గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు ఏం జరిగిందో తెలుసుకునేలోపే శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయారు. మహారాష్ట్ర బుల్దానా జిల్లాలో సమృద్ధి మహా మార్గ్ ఎక్స్‌ప్రెస్ వే మీదశుక్రవారం అర్ధరాత్రి 1.30 సమయంలో జరిగిన దుర్ఘటన తీరిది. డ్రైవర్ తప్పిదమే ఇందుకు కారణమని ప్రభుత్వం ప్రాథమికంగా తేల్చింది.

బస్సు నడుపుతున్న డ్రైవర్, క్లీనర్ సహా 8 మంది బతికి బయటపడ్డారు. వీరికి తీవ్ర గాయాలయ్యాయి. అదనంగా వచ్చిన డ్రైవర్ చనిపోయాడు. 33 మందితో విదర్భ ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేటు స్లీపర్ కోచ్ బస్సు శుక్రవారం సాయంత్రం 4 గంటలకు నాగపూర్ నుంచి పుణె బయల్దేరింది. యావత్మల్ జిల్లా కరంజాలో రాత్రి భోజనం తర్వాత మరో 150 కిలోమీటర్లు ప్రయాణించాక ప్రమాదానికి గురైంది. గంటకు 6070 కిలోమీటర్ల వేగంతోనే వెళ్తున్నప్పటికీ డ్రైవర్ నిద్రలోకిజారుకోవడంతో పింపల్హుటా వద్ద బస్సు అదుపుతప్పింది. స్తంభం, డివైడర్‌ను ఢీకొట్టి బోల్తాపడింది.