Share News

Madras High Court: 16 ఏళ్లలోపు వారికి ఇంటర్నెట్‌ నిషేధం

ABN , Publish Date - Dec 27 , 2025 | 05:47 AM

ఆస్ట్రేలియా తరహాలో 16 ఏళ్లలోపు చిన్నారులకు ఇంటర్నెట్‌ వినియోగం నిషేధించేలా ప్రత్యేక చట్టం చేయడంపై పరిశీలించాలని మద్రాస్‌ హైకోర్టు మదురై ధర్మాసనం కేంద్రప్రభుత్వానికి సూచించింది....

Madras High Court: 16 ఏళ్లలోపు వారికి ఇంటర్నెట్‌ నిషేధం

  • ఆస్ట్రేలియా తరహాలో చట్టం తీసుకురావచ్చేమో పరిశీలించండి ... కేంద్రానికి మద్రాస్‌ హైకోర్టు సూచన

చెన్నై, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): ఆస్ట్రేలియా తరహాలో 16 ఏళ్లలోపు చిన్నారులకు ఇంటర్నెట్‌ వినియోగం నిషేధించేలా ప్రత్యేక చట్టం చేయడంపై పరిశీలించాలని మద్రాస్‌ హైకోర్టు మదురై ధర్మాసనం కేంద్రప్రభుత్వానికి సూచించింది. అంతేగాక సోషల్‌ మీడియాపై అవగాహనా ప్రచారాన్ని సమర్థవంతంగా చేయాలని ఆదేశించింది. ఆస్ట్రేలియా ప్రభుత్వం అమలు చేసిన లాంటి చట్టం మన దేశంలో కూడా అమలులోకి వచ్చే వరకు అందుబాటులో ఉన్న అన్ని మీడియాల ద్వారా అవగాహన కల్పించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ జి.జయచంద్రన్‌, జస్టిస్‌ కేకే రామకృష్ణన్‌లతో కూడిన మదురై ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అశ్లీల చిత్రాలు సులువుగా అందుబాటులో ఉంటున్న ఇంటర్నెట్‌ను చిన్నారులు వీక్షించకుండా చర్యలు చేపట్టాలంటూ విజయ్‌కుమార్‌ అనే సామాజిక సేవా కార్యకర్త దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై స్పందించిన ధర్మాసనం ఈ మేరకు సూచనలు చేసింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఇంటర్నెట్‌లో అశ్లీల చిత్రాలు పుంఖానుపుంఖాలుగా అందుబాటులో ఉంచుతున్నారని, అలాంటి చిత్రాలను ఎవరైనా సులువుగా చూసే అవకాశం ఉందని వివరించారు. దీని వల్ల చిన్నారుల భవిష్యత్తు పాడవుతుందని, చిన్నారుల సంరక్షణ చట్టాల ప్రకారం ఇలాంటి అశ్లీల చిత్రాలను నిషేధించేలా చర్యలు చేపట్టాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ.. చిన్నారులు ఇలాంటి అశ్లీల చిత్రాలు చూడకుండా ఉండేలా కొత్త సాఫ్ట్‌వేర్‌ ప్రవేశపెట్టాల్సిన అవసరముందని, ఈ చిత్రాలు వీక్షించడం ద్వారా వారి మానసిక స్థితి పక్కదోవ పట్టే అవకాశముందని అభిప్రాయపడింది. ఆస్ట్రేలియా ప్రభుత్వం తరహాలో 16 ఏళ్లలోపు వారు ఇంటర్నెట్‌ చూడకుండా ప్రత్యేక చట్టం చేయాల్సిన అవసరముందని సూచించింది. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు త్వరితగతిన చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది. పిల్లల హక్కుల పరిరక్షణకు అవగాహన కల్పించడం జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్‌, తమిళనాడు బాలల హక్కుల రక్షణ కమిషన్‌ చట్టబద్ధమైన విధి అని స్పష్టం చేసింది.

Updated Date - Dec 27 , 2025 | 05:47 AM