Share News

Silver Price Surge: వెండి ధర.. వచ్చే ఏడాది 100 డాలర్ల మార్కును దాటనుందా?

ABN , Publish Date - Dec 28 , 2025 | 09:55 AM

బంగారానికి మించిపోయిన వెండి పెట్టుబడి దారులకు లాభాల వర్షం కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది వెండి ధరల్లో ట్రెండ్‌పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వెండి 100 డాలర్ల మార్కు దాటడం పక్కా అని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Silver Price Surge: వెండి ధర.. వచ్చే ఏడాది 100 డాలర్ల మార్కును దాటనుందా?
Silver Price Prediction in 2026

ఇంటర్నెట్ డెస్క్: ఈ ఏడాది వెండిపై పెట్టుబడి పెట్టిన వారికి లాభాల పంట పండిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సంవత్సరంలో ఇప్పటివరకూ వెండి ధర 170 శాతం మేర పెరిగింది. ఇటీవలే అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ ధర 79 డాలర్ల వద్ద జీవితకాల గరిష్ఠాన్ని తాకింది. భారత్‌లో కూడా కొన్ని నగరాల్లో కిలో వెండి ధర రికార్డు స్థాయిలో రూ.2.6 లక్షలను దాటాయి. వెండి సరఫరాలో కొరత, భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, యూఎస్ విత్త విధానంలో భారీ మార్పులకు తోడు పారిశ్రామిక డిమాండ్ కూడా ఎక్కువ కావడంతో వెండి ధరలు ఓ రేంజ్‌లో పెరుగుతున్నాయి.

మరికొన్ని రోజుల్లో నూతన సంవత్సరంలో కాలుపెట్టబోతున్న తరుణంలో వెండి రేట్ మరింత పెరుగుతాయని నిపుణులు తేల్చి చెబుతున్నారు. ఈ ధర 100 డాలర్లకు ఎప్పుడు చేరుకుంటుందనే అంశంపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ముఖ్యంగా డిసెంబర్‌‌లో ధరల మార్పును గమనించిన వారు త్వరలో కొత్త రికార్డు నమోదు కాక తప్పదని చెబుతున్నారు. డిసెంబర్ 8న 60 డాలర్ల మార్కును దాటిన వెండి ఆ తరువాత రెండు వారాలకే 70 డాలర్లకు చేరుకుంది. బంగారం ధరల్లో పెరుగుదల కూడా వెండికి ఊపునిచ్చింది. ఈ ఏఐ జమానాలో పారిశ్రామిక రంగానికి కీలకంగా మారిన వెండిని అమెరికా ఇటీవల క్రిటికల్ ఖనిజంగా గుర్తించింది. మరోవైపు, సురక్షిత పెట్టుబడి సాధనంగా వెండికి ఎప్పటి నుంచో పేరు స్థిరపడింది. ఈ నేపథ్యంలో అమెరికా డాలర్ బలహీనపడటం, ఫెడ్ రేట్‌ల కోతపై పెరుగుతున్న అంచనాలతో వెండి ధరలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి.


ఈ ఏడాది వెండి ధరల పెరుగుదలకు సరఫరాలో కోతే ప్రధాన కారణమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాది కూడా వెండి సరఫరాలో కోత పడింది. గత నాలుగేళ్లుగా మార్కెట్ అవసరాల మేరకు వెండి సరఫరా లేదని పరిశీలకులు చెబుతున్నారు. వార్షిక వెండి ఉత్పత్తి కొంతకాలంగా 817 మిలియన్ టన్నుల వద్దే స్థిరంగా ఉండగా డిమాండ్ మాత్రం అంతకంతకూ పెరుగుతోంది. ఇది చాలదన్నట్టు వెండిని అమెరికా క్రిటికల్ మినరల్‌గా గుర్తించడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. బంగారం ప్రధానంగా పెట్టుబడి సాధనమైతే వెండి డిమాండ్‌లో 60 శాతం పారిశ్రామిక వర్గాల నుంచే వస్తోంది. సొలార్ సెల్స్, డేటా సెంటర్లు, విద్యుత్ వాహనాల తయారీలో వెండి చాలా కీలకం.

అమెరికా విత్త విధానం కూడా ధరల పెరుగుదలకు కారణం అవుతోంది. వచ్చే ఏడాది అమెరికా ఫెడరల్ రిజర్వ్ మరో రెండు మార్లు ప్రామాణిక వడ్డీ రేటు తగ్గిస్తుందనే అంచనాలు ఉన్నాయి. దీంతో, ఇన్వెస్టర్లు బాండ్ మార్కెట్‌ను కాదనుకుని వెండిపై భారీగా పెట్టుబడులు పెడుతున్నారు.


వచ్చే ఏడాది వెండి ధరల పెరుగుదల తప్పదని మెజారిటీ వర్గాలు భావిస్తున్నా ఇది ఏ స్థాయిలో ఉంటుందనేదానిపై మాత్రం భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. వచ్చే ఏడాది వెండి ధర 100 డాలర్ల మార్కు దాటడం పక్కా అని ఇటీవల జరిగిన ఓ సర్వేలే 57 శాతం మంది రిటైలర్లు అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది మొదట్లో ఔన్స్ వెండి ధర 29.50 డాలర్ల వద్ద ఉండేది. అక్టోబర్‌లో కీలకదశ అయిన 47 డాలర్ల మార్కును దాటింది. ప్రస్తుతం 80 డాలర్లకు చేరువలో ఉంది. ఇక ఇండస్ట్రీ నుంచి ఇదే రీతిలో డిమాండ్ కొనసాగితే వచ్చే ఏడాది కచ్చితంగా 100 డాలర్ల మార్కును దాటుతుందని చెబుతున్నారు. మరికొందరు మాత్రం భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ స్థాయిలో ధరలు ఎక్కువకాలం మనలేవని, త్వరలో ధరల్లో 20 నుంచి 30 శాతం దిద్దుబాటు తప్పదని అంటున్నారు. ఇక పారిశ్రామిక డిమాండ్ వచ్చే ఏడాది కూడా ఇదే రీతిలో కొనసాగితే వెండి సగటు ధర 80 నుంచి 100 డాలర్ల మధ్య ఉండే ఛాన్స్ ఉందని చెబుతున్నారు.


ఇవీ చదవండి

ఈ విషయాలు తెలుసా? పర్సనల్ లోన్ చెల్లించకుండానే రుణగ్రహీత మరణిస్తే..

మ్యూచువల్‌ ఫండ్స్‌ లాభాలపై పన్ను పోటు ఎంత

Updated Date - Dec 28 , 2025 | 10:02 AM