Share News

Mutual Fund Tax India: మ్యూచువల్‌ ఫండ్స్‌ లాభాలపై పన్ను పోటు ఎంత

ABN , Publish Date - Dec 28 , 2025 | 05:51 AM

దేశీయంగా స్టాక్‌ మార్కెట్‌ పెట్టుబడులతో పాటు మ్యూచువల్‌ ఫండ్స్‌ (ఎంఎఫ్‌) పథకాల్లోనూ పెట్టుబడులు గణనీయంగా పెరుగుతున్నాయి. గత నెలాఖరు నాటికి ఈ పథకాల నిర్వహణలోని ఆస్తుల (ఏయూఎం) విలువ...

Mutual Fund Tax India: మ్యూచువల్‌ ఫండ్స్‌ లాభాలపై పన్ను పోటు ఎంత

దేశీయంగా స్టాక్‌ మార్కెట్‌ పెట్టుబడులతో పాటు మ్యూచువల్‌ ఫండ్స్‌ (ఎంఎఫ్‌) పథకాల్లోనూ పెట్టుబడులు గణనీయంగా పెరుగుతున్నాయి. గత నెలాఖరు నాటికి ఈ పథకాల నిర్వహణలోని ఆస్తుల (ఏయూఎం) విలువ ఏకంగా రూ.81 లక్షల కోట్లకు చేరాయి. ఈ సంవత్సరం ఇప్పటి వరకు సెన్సెక్స్‌, నిఫ్టీ సగటున 8 నుంచి 10 శాతం లాభాలు ఇస్తే.. మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాలు 12 నుంచి 15 శాతం రాబడులు ఇచ్చాయి. దీంతో చాలా మంది ఇన్వెస్టర్లు ముఖ్యంగా స్టాక్‌ మార్కెట్‌ మెలుకువలు పెద్దగా తెలియని రిటైల్‌ మదుపరులు ఎంఎఫ్‌ పథకాల్లో మదుపు చేస్తున్నారు. స్థిర ఆదాయాన్ని కోరుకునే మదుపరులు డెట్‌ పథకాల్లో మదుపు చేస్తుంటే, కొద్దిగా నష్ట భయానికి సిద్ధమయ్యే మదుపరులు ఈక్విటీ, బ్యాలెన్స్‌డ్‌ లేదా మల్టీ అసెట్స్‌ ఫండ్స్‌ను ఎంచుకుంటున్నారు. అయితే చాలా మంది ఎంఎఫ్‌ మదుపరులకు ఈ పథకాల పెట్టుబడులపై వచ్చే లాభాలపై పన్నుల ప్రభావం గురించి పెద్దగా అవగాహన లేదు. ఆ ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం.

పన్నుల ప్రభావం

  • బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వచ్చే వడ్డీపై ఏటా పన్ను పోటు పడుతుంది.

  • ఎంఎఫ్‌ పథకాల పెట్టుబడిపై వచ్చే లాభాలను మూలధన లాభాలుగా పరిగణించి ఆదాయ పన్ను విధిస్తారు.

  • ఎంఎఫ్‌ పథకాల యూనిట్లను అమ్మినప్పుడు (రిడంప్షన్‌), ఒక పథకం నుంచి మరో పథకానికి మారినప్పుడు వచ్చే లాభాలపై మాత్రమే పన్నుల పోటు ఉంటుంది.

  • ఈ పథకాల్లో పెట్టుబడి పెట్టేటప్పుడు, ఆ పథకాల్లో కొనసాగినంత కాలం ఎలాంటి పన్ను పోటు ఉండదు.

  • పథకం క్యాటగిరీ, ఎంత కాలం తర్వాత పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు? అనే అంశాల ఆధారంగా ఈ పెట్టుబడులపై వచ్చే రాబడులపై పన్ను విధిస్తారు.


ఈక్విటీ పథకాలు

  • ఈ పథకాల ద్వారా సమీకరించిన నిధుల్లో కనీసం 65 శాతం నిధులను ఎంఎ్‌ఫలు దేశీయ ఈక్విటీ మార్కెట్లో పెట్టుబడి పెట్టి ఉండాలి.

  • ఈ పథకాల్లో పెట్టిన పెట్టుబడులను ఏడాది తర్వాత వెనక్కి తీసుకుంటే వచ్చే లాభాలను దీర్ఘకాలిక మూలధన లాభాలుగా పరిగణించి 12.5 శాతం పన్ను విధిస్తారు.

  • మళ్లీ ఈ దీర్ఘకాలిక మూలధన లాభాల్లో ఏటా రూ1.25 లక్షల వరకు పూర్తి మినహాయింపు లభిస్తుంది.

  • ఈక్విటీ పథకాల యూనిట్లను ఏడాదిలోగా వెనక్కి తీసుకుంటే వచ్చే లాభాలను స్వల్పకాలిక మూలధన లాభాలుగా పరిగణించి 20 శాతం పన్ను విధిస్తారు.

డెట్‌ పథకాలు

తమ నిధుల్లో 35 శాతం కంటే తక్కువ మొత్తాన్ని ఈక్విటీ మార్కెట్లో పెట్టుబడి పెట్టే డెట్‌ పథకాలపై పన్నుల పోటు వేరే విధంగా ఉంటుంది. ఈ పథకాలపై వచ్చే రాబడులను ఆయా వ్యక్తుల ఆదాయంలో కలిపి.. ఆయా శ్లాబుల వారీగా పన్ను విధిస్తారు. ఇక్కడ మదుపరులు ఎంత కాలం పాటు ఆ పథకంలో ఉన్నారు? అనే విషయం లెక్కలోకి రాదు.

డివిడెండ్స్‌పైనా పన్ను

ఎంఎఫ్‌ మదుపరులు ఐడీసీడబ్ల్యూ (ఇన్‌కమ్‌ డిస్ట్రిబ్యూషన్‌ కమ్‌ క్యాపిటల్‌ విత్‌డ్రాయల్‌) ఆప్షన్‌ కింద అందుకునే ఎంఎఫ్‌ పథకాల డివిడెండ్‌ ఆదాయం పూర్తిగా ఆదాయ పన్ను పరిధిలోకి వస్తుంది. ఈ ఆదాయాన్ని ఆయా వ్యక్తుల ఆదాయానికి జోడించి, వారి వారి ఆదాయ శ్లాబుల ప్రకారం పన్ను విధిస్తారు. ఇక్కడ ఆ పథకం ఈక్విటీ, డెట్‌, హైబ్రిడ్‌ అనే వ్యత్యాసాలు ఏమీ చూడరు.

మల్టీ అసెట్‌ ఫండ్స్‌

  • ఈ ఫండ్స్‌ తాము సమీకరించిన నిధుల్లో కనీసం పది శాతం చొప్పున ఈక్విటీ, డెట్‌, గోల్డ్‌లో మదుపు చేయాలి.

  • ఈ ఫండ్స్‌ మొత్తం పెట్టుబడుల్లో 65 శాతం లేదా అంతకంటే ఎక్కువ మొత్తం ఈక్విటీలో ఉంటే.. ఆ ఫండ్‌ ద్వారా వచ్చే లాభాలకు, ఈక్విటీ ఫండ్స్‌ రాబడులకు వర్తించే పన్నుల విధానమే వర్తిస్తుంది.

  • పథకం మొత్తం పెట్టుబడుల్లో 35 నుంచి 65 శాతం మధ్య ఈక్విటీలో ఉండే పథకాలపై వచ్చే దీర్ఘకాలిక మూలధన లాభాలపై 12.5 శాతం పన్ను పోటు పడుతుంది. కాకపోతే ఇందుకోసం ఈ పథకాల్లో పెట్టుబడులను కనీసం రెండేళ్ల పాటు ఆ పథకంలోనే ఉంచాలి.


హైబ్రిడ్‌ ఎంఎ్‌ఫలు

ఈ పథకాలు తాము సమీకరించిన నిధులను ఈక్విటీ, డెట్‌, గోల్డ్‌లో మదుపు చేస్తాయి. ఇందులో ఎంత మొత్తాన్ని ఈక్విటీ షేర్లలో మదుపు చేశారు? అనే అంశం ఆధారంగా ఈ పథకాల రాబడులపై పన్ను ఆధారపడి ఉంటుంది.

  • 65 నుంచి 75 శాతం పెట్టుబడులు ఈక్విటీలో ఉండే అగ్రెసివ్‌ హైబ్రిడ్‌ ఫండ్‌పై వచ్చే లాభాలకు ఈక్విటీ ఫండ్స్‌ లాభాలకు వర్తించే పన్నుల నిబంధనలే వర్తిస్తాయి.

  • 65 శాతానికి మించిన పెట్టుబడులు ఈక్విటీలో ఉండే బ్యాలెన్సెడ్‌ అడ్వాంటేజ్‌ ఫండ్స్‌ రాబడులకూ ఇదే పన్నుల సూత్రం వర్తిస్తుంది.

ఇన్‌కమ్‌ ప్లస్‌ ఆర్బిట్రేజ్‌ ఫండ్స్‌

ఈ పథకాల ద్వారా సమీకరించే నిధులను ఎంఎ ఫ్‌లు ఆర్బిట్రేజ్‌ వ్యూహంతో రుణ పత్రాల్లో మదుపు చేస్తాయి. కనీసం రెండేళ్ల పాటు ఈ పథకాల్లో ఉన్న తర్వాత ఈ పథకాలపై వచ్చే లాభాలకు దీర్ఘకాలిక మూలధన లాభాల కింద 12.5 శాతం పన్ను విధిస్తారు.


ఈక్విటీ ఈటీఎ్‌ఫలు

  • ఈక్విటీ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్స్‌ (ఎఫ్‌ఓఎఫ్‌) ద్వారా సమీకరించే నిధుల్లో 90 శాతానికిపైగా నిధులను ఎంఎ్‌ఫలు ఈక్విటీ ఈటీఎ్‌ఫల్లో ఇన్వెస్ట్‌ చేయాలి.

  • ఈ పథకాల్లో కనీసం ఏడాదికి పైగా ఉంచుకున్న పెట్టుబడులపై వచ్చే లాభాలపై దీర్ఘకాలిక మూలధన లాభాల కింద 12.5 శాతం పన్ను విధిస్తారు.

  • ఇంటర్నేషనల్‌ ఫండ్స్‌తో సహా ఇతర ఈటీఎ్‌ఫలైతే రెండేళ్లకు పైగా ఉంచుకునే పెట్టుబడులపై వచ్చే లాభాలకూ 12.5 శాతం దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నే వర్తిస్తుంది.

గోల్డ్‌ ఈటీఎ్‌ఫలు

  • ఈ ఈటీఎ్‌ఫల్లో పెట్టుబడులు ఏడాదికి పైగా ఉంచుకుంటే వచ్చే లాభాలకి 12.5 శాతం దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను వర్తిస్తుంది.

  • గోల్డ్‌, సిల్వర్‌ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్స్‌ (ఎఫ్‌ఓఎఫ్‌) అయితే కనీసం 24 నెలల పాటు పెట్టుబడులు అలాగే ఉంచాలి. అప్పుడే దీర్ఘకాలిక మూలధన లాభాల కింద 12.5 శాతం పన్ను వర్తిస్తుంది.

ఎలా వ్యవహరిస్తే మేలు ?

ఈక్విటీ పథకాల దీర్ఘకాలిక మూలధన లాభాల కింద ఏటా రూ.1.25 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. ఎంఎఫ్‌ మదుపరులు ఈ సౌలభ్యాన్ని ఏటా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. స్థిర ఆదాయ పథకాల ద్వారా సమర్ధవంతమైన ప్రత్యామ్నాయ పన్ను ఆదా కోసం చూసే మదుపురులు ఆర్బిట్రేజ్‌ ఫండ్స్‌, ఇన్‌కమ్‌ ప్లస్‌ ఆర్బిట్రేజ్‌ ఫండ్స్‌లో పెట్టుబడుల కోసం ఆలోచించవచ్చు. కొద్దిగా నష్టభయాన్ని తట్టుకోగలిగితే హైబ్రిడ్‌ ఫండ్స్‌పైనే ఒక కన్నేయవచ్చు. ఇక్కడ మదుపరులు తమ పెట్టుబడి లక్ష్యం, కాలవ్యవధిని కూడా గుర్తుంచుకోవాలి.

ఇవీ చదవండి:

సూపర్.. ప్రపంచంలో నెం.3 స్థానానికి చేరిన వెండి!

ఈ ఏడాది ఐటీ నియామకాల్లో 16 శాతం వృద్ధి

Updated Date - Dec 28 , 2025 | 05:51 AM