Silver Market Cap: సూపర్.. ప్రపంచంలో నెం.3 స్థానానికి చేరిన వెండి! ఏకంగా..
ABN , Publish Date - Dec 24 , 2025 | 12:24 PM
వెండి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. వెండి మార్కెట్ క్యాప్ ప్రస్తుతం 4.04 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. మార్కెట్ విలువ పరంగా యాపిల్‌ను ఓవర్‌టేక్ చేసిన సిల్వర్ ప్రస్తుతం మూడో అత్యంత విలువైన ఆస్తిగా నిలిచింది.
ఇంటర్నెట్ డెస్క్: మార్కెట్ నిపుణుల అంచనాలను తారుమారు చేస్తూ ప్రస్తుతం వెండి ధర దూసుకుపోతోంది. చరిత్రలో మునుపెన్నడూ చూడని రికార్డులు నెలకొల్పుతోంది. పేదల బంగారంగా పేరుపడ్డ వెండి తాజాగా ప్రపంచంలోనే మూడో అత్యంత విలువైన పెట్టుబడి సాధనంగా మారింది. ప్రస్తుతం వెండి మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏకంగా 4.04 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. యాపిల్ సంస్థను అధిగమించి మరీ వెండి ఈ ఘనతను సాధించింది. ప్రస్తుతం మార్కెట్ క్యాప్ పరంగా తొలి స్థానంలో బంగారం ఉండగా, రెండో స్థానంలో కంప్యూటర్ చిప్ తయారీ సంస్థ ఎన్‌విడియా ఉంది (Silver Overtakes Apple in Market Cap).
ఈ ఏడాది వెండిపై రాబడులు ఏకంగా 140 శాతం మేర పెరిగాయి. ఈ వారంలో ఇప్పటివరకూ ధరలు 9 శాతం మేర పెరిగాయి. బుధవారం అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ వెండి స్పాట్ ధర 72 డాలర్లను తాకింది. భారత్‌లో కిలో వెండి ధర రూ.2.33 లక్షలుగా ఉంది. ఇలా నిరంతరంగా ధరల్లో పెరుగుదల నమోదు కావడం సామాన్యులతో పాటు నిపుణులను కూడా ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
అమెరికా విత్త విధానంపై నెలకొన్న అంచనాలు వెండి ధరల ర్యాలీకి ప్రధాన కారణమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా వచ్చే ఏడాది యూఎస్ ఫెడ్ ప్రామాణిక వడ్డీ రేటులో కోత ఉంటుందన్న అంచనాలతో వెండి ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ప్రస్తుత ఫెడ్ చీఫ్ తరువాత బాధ్యతలు చేపట్టే వ్యక్తి వడ్డీ రేట్‌ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అభీష్టానికి అనుగుణంగా మరింత తగ్గించే అవకాశం ఉందని భావిస్తున్న మార్కెట్ వర్గాలు వెండిపై పెట్టుబడులు కుమ్మరిస్తున్నాయి.
మార్కెట్ సంబంధిత అంశాలతో పాటు వెండికి ఉన్న వ్యవస్థాగత బలాలు కూడా ధరల పెరుగుదలకు మరో ముఖ్య కారణమని నిపుణులు చెబుతున్నారు. ఎలక్ట్రానిక్స్ రంగంలో భారీ అభివృద్ధి నమోదు అవుతుండటంతో వెండికీ అదే స్థాయిలో డిమాండ్ పెరుగుతోంది. ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ట్ వాహనాలు, మెడికల్ ఎక్విప్‌మెంట్స్‌కు పైపూతగా వెండికి డిమాండ్ అధికం. దీంతో, ధరలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. అక్టోబర్‌లో స్వల్పంగా ధరలు తగ్గినా ఆ తరువాత మళ్లీ పుంజుకున్నాయి. ఈటీఎఫ్‌ల రూపంలో పెట్టుబడులు వెల్లువెత్తడంతో పాటు పారిశ్రామికంగా డిమాండ్ పుంజుకోవడంతో వెండి ధరలకు అడ్డుఅదుపు లేకుండా పోతోంది.
ధరల పెరుగుదలకు సంబంధించి టెక్నికల్ అంశాలను బట్టి చూస్తే వెండి ధరలు గరిష్ఠస్థాయికి చేరుకున్న సూచనలు కనిపిస్తున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. వెండికి సంబంధించిన ఆర్ఎస్ఐ సూచీ 80 పాయింట్స్ వద్ద తచ్చాడుతుండటాన్ని ఇందుకు సూచనగా చెబుతున్నాయి. ఆర్ఎస్‌ఐ సూచీ 70 దాటిందంటే ధరల్లో కరెక్షన్ అప్పదనేది నిపుణులు అంచనా. మరోవైపు, చైనాలో వెండి నిల్వలు అడుగంటడంతో సరఫరా కొరత తీవ్రమై ధరల పెరుగుదల కొనసాగే అవకాశం ఉందని కొందరు అంచనా వేస్తున్నారు.
ఇలా మార్కెట్ వర్గాల పలు రకాల అభిప్రాయాలను వ్యక్తీకరిస్తున్నప్పటికీ ఇన్వెస్టర్లలో వెండిపై విశ్వాసం బలంగా ఉంది. ‘ప్రస్తుత పరిస్థితుల్లో అమ్మకాలు జోరందుకోవాల్సింది పోయి బంగారం, వెండిపై పెట్టుబడులు పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు అంచనాలకు మించి పెరిగినా ఆశ్చర్యపోవక్కర్లేదని’ పెపర్‌స్టోన్ గ్రూప్ సంస్థ స్ట్రాటజిస్టు ఒకరు తెలిపారు.
ఇవీ చదవండి:
భారీగా పెరిగిన పసిడి, వెండి ధరలు.. రికార్డులు బ్రేక్
ఈ ఏడాది ఐటీ నియామకాల్లో 16 శాతం వృద్ధి