Share News

Personal Loan: ఈ విషయాలు తెలుసా? పర్సనల్ లోన్ చెల్లించకుండానే రుణగ్రహీత మరణిస్తే..

ABN , Publish Date - Dec 27 , 2025 | 03:17 PM

తీసుకున్న అప్పు తీర్చకుండానే రుణగ్రహీత మరణిస్తే ఏం జరుగుతుంది అనే సందేహం మీకు ఎప్పుడైనా కలిగిందా? అసలు ఇలాంటి విషయాల్లో పూర్తి అవగాహనతో ఉండాలని నిపుణులు చెబుతున్నారు. మరి వ్యక్తిగత లోన్‌కు సంబంధించి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

Personal Loan: ఈ విషయాలు తెలుసా? పర్సనల్ లోన్ చెల్లించకుండానే రుణగ్రహీత మరణిస్తే..
Personal Loan

ఇంటర్నెట్ డెస్క్: లైఫ్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. కానీ అత్యవసర సందర్భాల్లో పెద్ద మొత్తాలను కూడా పర్సనల్‌ లోన్‌ కింద సుదీర్ఘ చెల్లింపు వ్యవధితో తీసుకోవాల్సి రావచ్చు. ఇలా అప్పు తీసుకున్నాక వ్యక్తులు మరణిస్తే ఏం జరుగుతుందనే సందేహం చాలా మందికి కలిగే ఉంటుంది. ఇలాంటి విషయాలపై ముందే అవగాహన పెంచుకుంటే చివరి నిమిషంలో రుణగ్రహీతల కుటుంబసభ్యులు, వారసులకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు (Personal Loans).

సాధారణంగా వ్యక్తిగత లోన్ ఇచ్చే సమయంలో బ్యాంకులు లబ్ధిదారులకు చెందిన ఎలాంటి ఆస్తులను సెక్యూరిటీ కింద పరిగణించరు. అంటే.. రుణగ్రహీత మరణించాక మిగిలిన అప్పు రాబట్టుకొనేందుకు బ్యాంకులు అతడి ఆస్తులు జప్తు చేసుకునే అవకాశం ఉండదు. కాబట్టి, ఆర్థిక సంస్థలు ప్రత్యామ్నాయ మార్గాల్ని ఎంచుకుంటాయి (Personal Loan Recovery Details).

అప్పు చెల్లించకుండానే రుణగ్రహీత మరణించిన సందర్భాల్లో ఆర్థిక సంస్థలు ముందుగా లోన్ ప్రొటెక్షన్ ఇన్సూరెన్స్ ఉందో లేదో చెక్ చేస్తాయి. అలాంటి పాలసీ ఉన్నట్టైతే బ్యాంకులు సంబంధిత ఇన్సూరర్ నుంచి మిగిలిన మొత్తానికి క్లెయిమ్ చేసుకుంటాయి. అప్పుడు ఇన్సూరెన్స్ సంస్థ మిగిలిన అప్పును చెల్లిస్తుంది. ఆ తరువాత బ్యాంక్ లోన్ అకౌంట్ క్లోజ్ అవుతుంది. దీంతో, మృతుడి కుటుంబానికి ఎలాంటి ఇబ్బందీ ఉండదు.

ఇన్సూరెన్స్ లేని పక్షంలో బ్యాంకులు ఇతర ప్రత్యామ్నాయాలను ఎంచుకుంటాయి. రుణగ్రహీతతో పాటు మరో కోఅప్లికెంట్‌గా లోన్ తీసుకున్నవారు ఎవరైనా ఉన్నారా అని చెక్ చేస్తాయి. లేని పక్షంలో ఎవరైనా రుణగ్రహీత అప్పు తీర్చేలా హామీ (గ్యారెంటర్) ఇచ్చారా లేదా అనే అంశాన్ని చెక్ చేస్తాయి. ఈ సందర్భాల్లో కోఅప్లికెంట్‌తో పాటు గ్యారెంటర్ కూడా రుణగ్రహీత తీసుకున్న లోన్‌లో మిగిలిన మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.


కోఅప్లికెంట్‌లు, గ్యారెంటర్లు లేని సందర్భాల్లో బ్యాంకులు రుణగ్రహీత ఆస్తుల నుంచి మిగిలిన లోన్ మొత్తాన్ని రికవరీ చేసే ప్రయత్నం చేస్తాయి. అంటే, రుణగ్రహీతకు చెందిన బ్యాంక్ అకౌంట్స్, పెట్టుబడులు, బంగారం, రియలెస్టేట్, ఇతర ఆస్తుల నుంచి మిగిలిన మొత్తాన్ని రాబట్టుకొంటారు. ఇవీ సరిపోని పక్షంలో మృతుడికి అందే ఇన్సూరెన్స్ మొత్తం నుంచి లోన్‌ మొత్తాన్ని రికవరీ చేస్తాయి.

సాధారణంగా రుణగ్రహీత వారసులకు వారి వ్యక్తిగత అప్పు చెల్లించాల్సిన బాధ్యత ఉండదు. అయితే, లోన్‌కు సంబంధించిన నిబంధనల్లో వారసుల ప్రస్తావన ఉంటే వారు లోన్ తీర్చకతప్పదు. రుణగ్రహీత నుంచి వారసత్వంగా ఆస్తి పొందిన వారి నుంచి మిగిలిన డబ్బును రాబట్టుకొనే అవకాశం కూడా ఉంది.

లబ్దిదారుడికి ఇచ్చిన అప్పును రాబట్టుకొనేందుకు అవకాశం కొన్ని సందర్భాల్లో ఉండదు. అత్యంత అరుదుగా మాత్రమే ఇలా జరుగుతుంది. ఇలాంటప్పుడు బ్యాంకులు ఈ లోన్‌ను రైటాఫ్ చేస్తాయి. తమ అకౌంట్ స్టేట్‌మెంట్స్‌లో ఇలాంటి లోన్లను నష్టంగా చూపిస్తాయి.


ఇవీ చదవండి:

సూపర్.. ప్రపంచంలో నెం.3 స్థానానికి చేరిన వెండి! ఏకంగా..

వామ్మో.. భగ్గుమన్న బంగారం, వెండి ధరలు

Updated Date - Dec 27 , 2025 | 03:38 PM