'ఫ్లైదుబాయ్' ఘటనను 'ఉగ్రదాడి'గా ప్రకటించిన UAE.. కెప్టెన్ స్మిత్ మచ్చార్‌పై ప్రశంసలు
ABN , Publish Date - Oct 02 , 2026 | 09:26 PM
'ఫ్లైదుబాయ్' విమానంలో ఒమానీ కో-పైలట్ జరిపిన దాడిని UAE ప్రభుత్వం 'ఉగ్రవాద చర్య'గా అధికారికంగా ప్రకటించింది. 174 మంది ప్రయాణికుల్ని రక్షించిన భారతీయ పైలట్ స్మిత్ మచ్చార్‌ను రియల్ హీరోగా కొనియాడింది.
ఆంధ్రజ్యోతి, అక్టోబర్ 2: దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న 'ఫ్లైదుబాయ్' విమానంలో ఒమానీ కో-పైలట్ జరిపిన భయానక దాడిని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) ప్రభుత్వం 'ఉగ్రవాద చర్య' (Act of Terror)గా అధికారికంగా ప్రకటించింది. 174 మంది ప్రయాణికులున్న విమానాన్ని రక్షించి, ప్రాణాలకు తెగించి పోరాడిన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చార్‌ను యూఏఈ రియల్ హీరోగా కొనియాడింది.
యూఏఈ అధ్యక్షుడు మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సలహాదారు అన్వర్ గర్గాష్ సామాజిక మాధ్యమం 'ఎక్స్' వేదికగా స్పందిస్తూ కెప్టెన్ స్మిత్ పై ప్రశంసలు కురిపించారు. 'ఫ్లైదుబాయ్ భారతీయ పైలట్ స్మిత్ మచ్చార్ అన్ని రకాల ప్రశంసలకు అర్హుడు. అత్యంత ప్రమాదకరమైన ఉగ్రదాడిని ఎదిరించి, రాబోయే పెద్ద విపత్తును నివారించడంలో ఆయన నిజమైన ధైర్యం, బాధ్యతను ప్రదర్శించారు. చీకటి కమ్ముకున్న విపత్కర పరిస్థితుల్లో ఆయన చూపిన వృత్తిపరమైన బాధ్యత, నైతిక స్పృహ ఆయనను నిజమైన హీరోగా నిలబెట్టాయి.' అలాగే ఎలాంటి కుట్రపూరిత సిద్ధాంతాలకు తావులేకుండా, తీవ్రవాదం, ఉగ్రవాదం ఎదురైనప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
విమానం యూఏఈ కి చెందినది కావడం వల్ల అక్కడి చట్టాల ప్రకారమే దర్యాప్తు జరిపేందుకు పబ్లిక్ ప్రాసిక్యూషన్‌తో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. 174 మంది ప్రయాణికులు ఉన్న విమానాన్ని కూల్చివేసేందుకు ఒమానీ కో-పైలట్ ఎందుకు ప్రయత్నించాడనే కోణంలో కుట్ర వెనుక ఉన్న అసలు కారణాలను (Motive) అన్వేషిస్తున్నారు. అత్యవసరంగా విమానం ల్యాండ్ అయిన సౌదీ అరేబియాకు ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్, భద్రతాధికారులు చేరుకుని దర్యాప్తులో పాల్గొంటున్నారు. సౌదీ-ఇజ్రాయెల్‌ల మధ్య అధికారిక దౌత్య సంబంధాలు లేనప్పటికీ కేసు తీవ్రత దృష్ట్యా ఈ విచారణ జరుగుతోంది. ఇది కేవలం ఉగ్రవాద చర్చేనా లేదా సదరు కో-పైలట్ మానసిక రుగ్మతతో బాధపడుతున్నాడా అనే ప్రతి కోణాన్ని పరిశీలిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి
గాంధీజీ స్ఫూర్తితోనే స్వచ్ఛాంధ్ర కార్యక్రమం: సీఎం చంద్రబాబు
విశాఖ తీరంలో విషాదం.. అలల తాకిడికి ముగ్గురు విద్యార్థుల గల్లంతు