గాంధీజీ స్ఫూర్తితోనే స్వచ్ఛాంధ్ర కార్యక్రమం: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Oct 02 , 2026 | 06:50 PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ‘స్వచ్ఛాంధ్ర అవార్డ్స్-2026’ కార్యక్రమంలో పాల్గొన్నారు. విజయవాడ ఏ-కన్వెన్షన్‌లో ఏర్పాటు చేసిన అవార్డుల ప్రదానోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 22 విభాగాల్లో 130 రాష్ట్రస్థాయి అవార్డులు, 2,044 జిల్లా స్థాయి అవార్డులను సీఎం అందించారు.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ‘స్వచ్ఛాంధ్ర అవార్డ్స్-2026’ కార్యక్రమంలో పాల్గొన్నారు. విజయవాడ ఏ-కన్వెన్షన్‌లో ఏర్పాటు చేసిన అవార్డుల ప్రదానోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 22 విభాగాల్లో 130 రాష్ట్రస్థాయి అవార్డులు, 2,044 జిల్లా స్థాయి అవార్డులను సీఎం అందించారు. స్వచ్ఛ గ్రామాలు, పట్టణాలు, సంస్థలు, ప్రాంగణాలకు అవార్డులు ప్రదానం చేశారు. అవార్డులు పొందిన వారిని ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. 'మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రిల జయంతిని పురస్కరించుకుని వారికి నివాళులు అర్పిస్తున్నా. గాంధీజీ స్వాతంత్ర్యం కంటే స్వచ్ఛత ముందని పిలుపునిచ్చి ఆచరించి చూపించారు. కోల్‌కతాలో అపరిశుభ్రంగా ఉన్న మరుగుదొడ్లను చూసి ఆయనే స్వయంగా శుభ్రపరిచారు. పరిశుభ్రత అనేది ఏ వర్గానికో సంబంధించింది కాదని, మన ఆరోగ్యం కోసం మనమే పరిసరాలను శుభ్రంగా ఉంచాలని విశ్వసించిన వ్యక్తి గాంధీజీ. అందుకే అక్టోబర్ 2న స్వచ్ఛాంధ్ర అవార్డ్స్-2026 కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం.
జపాన్‌లో ప్రజలు ఎక్కడా రహదారులపై చెత్త వేయరు. చిన్న కాగితాన్నీ జేబులో వేసుకుని వెళ్లి చెత్తబుట్టలో పడేస్తారు. ఏపీలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఏర్పాటు చేసుకుని కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. గత పాలకులు ఎక్కడా పరిశుభ్రతపై శ్రద్ధ పెట్టలేదు. టన్నుల కొద్దీ చెత్త రోడ్లపై పేరుకుపోయింది. రాష్ట్రంలో ప్రతి మూడో శనివారం స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఉద్యమ స్ఫూర్తితో నిర్వహిస్తున్నాం. ప్రతి నెలా మూడో శనివారం నేనే స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాను. ఈ రెండేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్‌లో మన పట్టణాలు, గ్రామాలు అద్భుతమైన ప్రతిభ కనబరుస్తున్నాయి.
ఈ ఉద్యమంలో భాగంగా నేడు అవార్డులు పొందిన వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. 22 విభాగాల్లో 130 రాష్ట్రస్థాయి అవార్డులు, 2,044 జిల్లా స్థాయి అవార్డులు ఇస్తున్నాం. స్వచ్ఛ మున్సిపాలిటీలు, స్వచ్ఛ గ్రామ పంచాయతీలు, పాఠశాలలు, ఆస్పత్రులు, బస్టాండ్లు, పరిశ్రమలను పరిశుభ్రతపై ప్రోత్సహిస్తున్నాం. పారిశుద్ధ్య కార్మికులు, గ్రీన్ అంబాసిడర్లనూ గుర్తిస్తున్నాం. దేశవ్యాప్తంగా 12 వేల మంది క్రీడాకారులు, రన్నర్లు స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి సంఘీభావం తెలియజేయడం అభినందనీయం. పరిశుభ్రత అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు.. పాఠశాల, ఆస్పత్రి, పార్కు లాంటివి పరిశుభ్రంగా ఉండాలంటే సామాజిక బాధ్యత రావాలి. ఐదు కోట్ల ప్రజల భాగస్వామ్యంతో ఉద్యమంగా పనిచేస్తే మార్పు వస్తుంది.
పరిశుభ్రత అంటే కేవలం రోడ్లు మాత్రమే బాగుండటం కాదు. మన వ్యక్తిగత శుభ్రత, ఆరోగ్యం, ఆలోచన కూడా పరిశుభ్రంగా ఉండాలి. చెత్తను సమస్యగా చూడటం లేదు.. సంపద సృష్టించేలా, విద్యుత్ తయారు చేసుకునేలా కృషి చేస్తున్నాం. వ్యర్థాలను ఎరువులుగా, బయోగ్యాస్‌గా తయారు చేసి సర్క్యులర్ ఎకానమీ దిశగా ఏపీని తీసుకెళ్తున్నాం. రాష్ట్రంలో జీరో గార్బేజ్ కోసం మా ప్రభుత్వం కృషి చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఘన వ్యర్థాలను సేకరించేందుకు స్వచ్ఛ రథాలను నిర్వహిస్తున్నాం. ఈ-ఆటోలు, పుష్‌కార్టులు, మెకనైజ్డ్ రోడ్ స్వీపింగ్ వంటి యంత్రాలనూ ఏర్పాటు చేశాం.
కొత్తగా చెత్త పేరుకుపోకుండా ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ కేంద్రాలను ఏర్పాటు చేశాం. మ్యాజిక్ డ్రెయిన్లు, సోక్ పిట్లు, కంపోస్ట్ పిట్లు లాంటి వినూత్న విధానాలను ఏర్పాటు చేస్తున్నాం. గోబర్ధన్, ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్‌మెంట్ యూనిట్లను ఏర్పాటు చేశాం' అని పేర్కొన్నారు. మరోవైపు, సీఎం చంద్రబాబు సమక్షంలో నెట్ జీరో అంశంపై ఐఐటీ కాన్పూర్- స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ మధ్య ఎంఓయూ కుదిరింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు మంత్రి పొంగూరు నారాయణ, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
విశాఖ తీరంలో విషాదం.. అలల తాకిడికి ముగ్గురు విద్యార్థుల గల్లంతు
వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఏపీ విద్యార్థులకు చోటు.. మంత్రి లోకేశ్ హర్షం..