డెడ్‌లైన్ తర్వాత 4 గంటల్లో ఇరాన్‌లోని పవర్ ప్లాంట్లు, బ్రిడ్జిలు పేల్చేయగలం: ట్రంప్
ABN , Publish Date - Apr 07 , 2026 | 11:29 AM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌ను ఉద్దేశించి మరోసారి నిప్పులు చెరిగారు. ఇరాన్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య ఆయన చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
వాషింగ్టన్, ఏప్రిల్ 7: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌ను ఉద్దేశించి మరోసారి నిప్పులు చెరిగారు. ఇరాన్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య ఆయన చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తాము విధించిన డెడ్‌లైన్ ముగిసిన తర్వాత కేవలం 4 గంటల వ్యవధిలోనే ఇరాన్‌లోని కీలక మౌలిక సదుపాయాలను నాశనం చేయగల సామర్థ్యం అమెరికాకు ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఇరాన్ సైనిక శక్తిని తక్కువ చేస్తూ ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 'ఇరాన్ దగ్గర అసలు నేవీ లేదు, ఎయిర్‌ఫోర్స్ లేదు, కనీసం సరైన డిఫెన్స్ సిస్టమ్ కూడా లేదు' అని ఆయన ఎద్దేవా చేశారు. తమ అధునాతన యుద్ధ తంత్రం ముందు ఇరాన్ నిలవలేదని, ఆ దేశంలోని పవర్ ప్లాంట్లు, వంతెనలను పేల్చివేయడం తమకు పెద్ద లెక్క కాదని స్పష్టం చేశారు.
ఈ యుద్ధ సమయంలో తమకు అండగా నిలవని మిత్రదేశాలపై ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 'ఈ పోరాటంలో దక్షిణ కొరియా, జపాన్, ఆస్ట్రేలియా వంటి దేశాలు మాకు కనీస సహకారం అందించలేదు' అని ఆయన బహిరంగంగానే విమర్శించారు. అమెరికా రక్షణ గొడుగు కింద ఉంటూ, కీలక సమయంలో ముఖం చాటేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇన్ని సవాళ్లు ఎదురైనప్పటికీ, యుద్ధంలో అమెరికానే విజయం సాధించిందని ట్రంప్ ప్రకటించారు. తమ సైనిక పటిమను ప్రపంచానికి చాటిచెప్పామని, శత్రువులను కోలుకోలేని దెబ్బ తీశామని ఆయన పేర్కొన్నారు. ఇరాన్ తన పద్ధతి మార్చుకోకపోతే మరిన్ని తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
వలస కార్మికులకు ఊరట.. 5 కిలోల సిలిండర్ల కోటా రెట్టింపు
Read Latest Telangana News and National News