Share News

యుద్ధంలో మేమే గెలిచాం.. సైనికపరంగా ఇరాన్‌ను అంతమొందించాం: ట్రంప్

ABN , Publish Date - Mar 25 , 2026 | 10:32 AM

ఇరాన్‌తో యుద్ధంలో తామే గెలిచామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఆ దేశాన్ని సైనికపరంగా పూర్తిగా అంతమొందించామని ఆయన అన్నారు. అయితే.. ఈ వ్యాఖ్యలను ఇరాన్ విదేశాంగ శాఖ ఖండించింది.

యుద్ధంలో మేమే గెలిచాం.. సైనికపరంగా ఇరాన్‌ను అంతమొందించాం: ట్రంప్

ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధంలో తాము గెలిచామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఈ పోరులో ఇరాన్‌ను సైనికపరంగా అంతమొందించామని ఆయన అన్నారు. ఆ దేశం ఇకపై ఎప్పటికీ అణ్వాయుధాలను అభివృద్ధి చేయకూడదనేదే తమ మొదటి షరతు అని.. దానికి ఇరాన్ అంగీకరించిందని కూడా ట్రంప్ పేర్కొన్నారు.


'ఇరాన్‌తో ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నాయి. అమెరికాతో ఒప్పందం కుదుర్చుకునేందుకు ఆ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇప్పటికే వారి నౌకాదళం, వైమానిక దళం పూర్తిగా ధ్వంసమవడం సహా రాడార్ వ్యవస్థలు కూడా దెబ్బతిన్నాయి. అమెరికా విమానాలు టెహ్రాన్ మీదుగా చక్కర్లు కొడుతున్నాయి. ఒకవేళ చర్చలు విఫలమైతే.. అమెరికా ఏదైనా చేయగలదు' అని ట్రంప్ చెప్పారు. మరోవైపు ఇరాన్.. అమెరికాకు హోర్ముజ్ జలసంధికి సంబంధించి ఓ పెద్ద గిఫ్ట్ ఇచ్చిందని ట్రంప్ తెలిపారు. అయితే.. ఆ బహుమతి ఏంటనే వివరాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. అది చాలా విలువైన గిఫ్ట్ అని చెప్పుకొచ్చారు.


అయితే.. ట్రంప్ వ్యాఖ్యాలను పూర్తిగా తోసిపుచ్చింది ఇరాన్. అమెరికాతో ఇప్పటివరకు ఎలాంటి ప్రత్యక్ష చర్చలు జరగలేదని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇదిలా ఉండగా.. పాకిస్థాన్, ఈజిప్ట్, టర్కీ వంటి దేశాలతో కలిసి ఇరాన్.. అమెరికాతో మధ్య మధ్యవర్తిత్వం వహించేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు పాక్ సైన్యాధిపతి అసిమ్ మునీర్ ఇటీవల అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్‌తో మాట్లాడినట్టు పాక్ మీడియా సంస్థలు వెల్లడించినట్టు సమాచారం. మరోవైపు.. సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్.. ఇరాన్‌పై దాడులను కొనసాగించాలని ట్రంప్‌ను కోరినట్టు న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో రాసుకొచ్చింది.


కొనసాగుతున్న దాడులు

యుద్ధానికి ట్రంప్ 5 రోజుల విరామం ప్రకటించినప్పటికీ.. గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు కొనసాగుతున్నాయి. సౌదీ అరేబియా బాలిస్టిక్ క్షిపణి ఇరాన్‌కు చెందిన 6 డ్రోన్‌లను కూల్చివేసింది. తూర్పు ప్రావిన్సులో తమ వాయు రక్షణ వ్యవస్థ ఒక బాలిస్టిక్ క్షిపణిని అడ్డుకుని ధ్వంసం చేసిందని సౌదీ రక్షణ శాఖ తెలిపింది. ఆ వివరాల ప్రకారం.. అదే ప్రాంతంలో కనీసం 6 డ్రోన్‌లను కూల్చివేసినట్టు సమాచారం. ఇజ్రాయెల్, కువైట్ దేశాలపైనా ఇరాన్ డ్రోన్ల దాడి కొనసాగిస్తున్నట్టు అంతర్జాతీయ మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది.


ఇవీ చదవండి:

ట్రంప్‌ చెప్పినా ఆగని దాడులు..

యుద్ధం చేద్దామన్నది మీరే కదా హెగ్సెత్‌!

Updated Date - Mar 25 , 2026 | 10:42 AM