Share News

ట్రంప్‌ చెప్పినా ఆగని దాడులు

ABN , Publish Date - Mar 25 , 2026 | 03:44 AM

యుద్ధానికి కాస్త విరామం ఇస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించినా.. ఇజ్రాయెల్‌, ఇరాన్‌ దాడులు కొనసాగాయి. ఇరాన్‌లోని టెహ్రాన్‌, ఇస్ఫహాన్‌ సహా కీలక ప్రాంతాలపై ఇజ్రాయెల్‌ యుద్ధ విమానాలతో విరుచుకుపడింది.

ట్రంప్‌ చెప్పినా ఆగని దాడులు

  • అమెరికా ఆపినా.. తాము కొనసాగిస్తామన్న నెతన్యాహు

వాషింగ్టన్‌/దుబాయ్‌/న్యూఢిల్లీ, మార్చి 24: యుద్ధానికి కాస్త విరామం ఇస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించినా.. ఇజ్రాయెల్‌, ఇరాన్‌ దాడులు కొనసాగాయి. ఇరాన్‌లోని టెహ్రాన్‌, ఇస్ఫహాన్‌ సహా కీలక ప్రాంతాలపై ఇజ్రాయెల్‌ యుద్ధ విమానాలతో విరుచుకుపడింది. మంగళవారం తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు టెహ్రాన్‌లో పేలుళ్లు వినిపిస్తూనే ఉన్నాయి. అమెరికా దాడులు ఆపినా తాము ఇరాన్‌, లెబనాన్‌పై దాడులు కొనసాగిస్తామని ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు. లెబనాన్‌ రాజధాని బీరూట్‌ శివారు ప్రాంతాలపై ఇజ్రాయెల్‌ ఉధృతంగా దాడులు చేసింది. ఈ దాడుల్లో మూడేళ్ల చిన్నారి సహా 8 మంది చనిపోయారు. లెబనాన్‌ దక్షిణ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంటామని ఇజ్రాయెల్‌ రక్షణ మంత్రి కాట్జ్‌ ప్రకటించారు. ఇరాన్‌లోని ఇస్ఫహాన్‌, ఖోరామ్‌షెహర్‌ పట్టణాల్లో గ్యాస్‌ సరఫరా, విద్యుత్‌ వ్యవస్థలపై దాడులు జరిగాయని ఇరాన్‌కు చెందిన ఫార్స్‌ వార్తా సంస్థ వెల్లడించింది. ఇజ్రాయెల్‌లోని టెల్‌అవీవ్‌, జేరుసలేం, సెంట్రల్‌ ఇజ్రాయెల్‌ ప్రాంతాలపైకి ఇరాన్‌ క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది. బెన్‌ గురియన్‌ విమానాశ్రయం, హైఫా చమురు కేంద్రం సమీపంలోనూ పేలుళ్లు జరిగాయి. బహ్రెయిన్‌లోని అమెజాన్‌ వెబ్‌సర్వీసెస్‌ డేటా సెంటర్‌పై డ్రోన్‌ దాడి జరిగింది. దీనితో అక్కడి నుంచి అందే సేవలపై ప్రభావం పడిందని అమెజాన్‌ ప్రకటించింది. యూఏఈలో జరిగిన దాడిలో ఒక సివిల్‌ కాంట్రాక్టర్‌ మరణించారని, ఐదుగురు సైనికులు గాయపడ్డారని ఆ దేశ రక్షణ శాఖ తెలిపింది. చమురు క్షేత్రాలున్న తూర్పు ప్రావిన్స్‌పైకి దూసుకొచ్చిన 19 డ్రోన్లను కూల్చేశామని సౌదీ అరేబియా రక్షణ శాఖ ప్రకటించింది. మరోవైపు, హోర్ముజ్‌పై పట్టు సాధించేందుకు అమెరికా మూడు యుద్ధ నౌకల్లో తరలిస్తున్న మెరైన్‌, యాంఫిబియస్‌ బలగాలు శుక్రవారం నాటికి పర్షియన్‌ గల్ఫ్‌ ప్రాంతానికి చేరుకోనున్నట్టు రక్షణవర్గాలు వెల్లడించాయి. ఇరాన్‌లో విద్యుత్‌ వ్యవస్థలపై దాడి కోసం ట్రంప్‌ పెంచిన గడువు అదే రోజుతో ముగుస్తుండటం గమనార్హం.


యుద్ధానికి సౌదీ, యూఏఈ సిద్ధం!

తమ దేశాల్లోని చమురు, గ్యాస్‌ వ్యవస్థలపై ఇరాన్‌ దాడుల నేపథ్యంలో.. అమెరికా మిత్రదేశాలైన సౌదీ అరేబియా, యూఏఈ కూడా యుద్ధంలోకి దిగే అవకాశాలు ఉన్నాయని అమెరికా వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ పత్రిక పేర్కొంది. నిజానికి ఇరాన్‌పై యుద్ధం కోసం సౌదీ అరేబియా తమ దేశంలోని స్థావరాలను వినియోగించుకోవడానికి అమెరికాకు తొలుత అనుమతి ఇవ్వలేదు. కానీ ఇటీవలే సౌదీలోని కింగ్‌ ఫాహద్‌ బేస్‌ను వినియోగించుకోవడానికి అంగీకరించింది. మరోవైపు యూఏఈ తమ దేశంలోని ఇరాన్‌ ఆస్పత్రిని, క్లబ్‌ను మూసివేసింది. తద్వారా యూఏఈ నుంచి సహాయం అందకుండా చేసింది. అంతేగాక బహ్రెయిన్‌ నుంచి ఇరాన్‌పైకి క్షిపణులు ప్రయోగించినట్టుగా కొన్ని వీడియోలు బయటికి వచ్చాయి. ఈ క్రమంలో అమెరికాకు మద్దతుగా గల్ఫ్‌ దేశాలు రంగంలోకి దిగుతున్నాయని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ పేర్కొంది. కాగా.. ఇరాన్‌పై సైనిక చర్యను కొనసాగించాలని ట్రంప్‌ను సౌదీ రాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ కోరినట్టు న్యూయార్క్‌ టైమ్స్‌ కథనం ప్రచురించింది. గల్ఫ్‌ దేశాలకు ఇరాన్‌తో ముప్పు ఉందని, ప్రస్తుత ప్రభుత్వం తొలగిపోవాల్సిందేనని బిన్‌ సల్మాన్‌ అభిప్రాయపడ్డారని తెలిపింది. అయితే ఈ వార్తలను సౌదీ ప్రభుత్వం ఖండించింది.

మీరు కన్ను పోగోడితే.. మేం తల తీస్తాం

అమెరికా తనను తాను కాపాడుకునేందుకు తుది గడువు (డెడ్‌లైన్‌) దగ్గరపడిందని ఇరాన్‌ మిలిటరీ నూతన సలహాదారు మోహ్సెన్‌ రెజాయి హెచ్చరించారు. ఇరాన్‌లో మౌలిక సదుపాయాలపై ట్రంప్‌ దాడులకు తెగబడితే.. మేం అమెరికాను పూర్తిగా స్తంభింపజేస్తామని, గల్ఫ్‌లోని అమెరికా నౌకలను ముంచేస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు ఇరాన్‌కు చెందిన ఐఆర్‌ఎన్‌ఏ టీవీలో మోహ్సెన్‌ ఇంటర్వ్యూ ప్రసారమైంది. ఇజ్రాయెల్‌ అమెరికాను ఈ యుద్ధంలోకి లాగిందని.. ఇప్పుడు అమెరికా అమెరికా సైనికాధికారులు, ఇజ్రాయెల్‌ మధ్య అయోమయంలో ఉన్నారని వ్యాఖ్యానించారు. ఇరాన్‌పై ఆంక్షలన్నీ ఎత్తివేసి, నష్టాలకు పరిహారం ఇవ్వాలని.. భవిష్యత్తులో ఇరాన్‌పై దాడులు జరగవని అంతర్జాతీయ స్థాయిలో హామీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అప్పుడే ఈ యుద్ధం ముగుస్తుందని చెప్పారు. కాగా, ఇరాన్‌ పూర్తి విజయం సాధించేవరకు తమ సైనిక దళాలు పోరాడుతాయని ఇరాన్‌ అత్యున్నత సైనిక సమన్వయ కేంద్రం ఖాతమ్‌ అల్‌ అన్బియా ప్రతినిధి అలీ అలియాబాదీ ప్రకటించారు.


మోదీకి ట్రంప్‌ ఫోన్‌ కాల్‌

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మంగళవారం సాయంత్రం ప్రధాని మోదీకి ఫోన్‌ చేశారు. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధంపై చర్చలు జరిపారు. హోర్ముజ్‌ జలసంధిని తెరిచి ఉంచాల్సిన ఆవశ్యకతపై ఇరువురు నేతలు చర్చలు జరిపారని భారత్‌లో అమెరికా రాయబారి సెర్గియో గోర్‌ చెప్పారు. యుద్ధం ప్రారంభమైన తరువాత ఇరువురు నేతలు మాట్లాడుకోవడం ఇదే తొలిసారి. అనంతరం మోదీ ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ‘‘అధ్యక్షుడు ట్రంప్‌ నుంచి ఫోన్‌ వచ్చింది. పశ్చిమాసియా పరిస్థితిపై ప్రయోజనకరమైన రీతిలో అభిప్రాయాలను పంచుకున్నాం. ఉద్రిక్తతలకు సత్వరమే ముగింపు పలికి, శాంతిని పునరుద్ధరించేందుకు భారత్‌ మద్దతు ఇస్తుంది. ప్రపంచానికి అత్యవసరమైన హోర్ముజ్‌ జలసంధిని తెరిచి ఉంచి అందరికీ అందుబాటులోకి తీసుకురావడంతో పాటు సురక్షితంగా ఉంచడం ప్రధానమైన అంశం’’ అని పేర్కొన్నారు.

1.jpg

ఇరాన్‌ సుప్రీం సెక్యూరిటీ కౌన్సిల్‌ సెక్రెటరీగా జోల్గాద్ర్‌

ఇజ్రాయెల్‌ దాడుల్లో మరణించిన ఇరాన్‌ నేషనల్‌ సుప్రీం సెక్యూరిటీ కౌన్సిల్‌ సెక్రెటరీ అలీ లారిజానీ స్థానంలో ఐఆర్‌జీసీ మాజీ కమాండర్‌ మొహమ్మద్‌ బఘర్‌ జోల్ఘాద్ర్‌ నియామకం అయ్యారు. ఇప్పటివరకు ఆయన పార్లమెంటుకు, ప్రభుత్వానికి, సుప్రీంలీడర్‌కు అనుసంధానం కల్పించే ఎక్స్‌పీడియెన్సీ కౌన్సిల్‌కు కార్యదర్శిగా పనిచేశారు.

Updated Date - Mar 25 , 2026 | 03:44 AM