యుద్ధం చేద్దామన్నది మీరే కదా హెగ్సెత్!
ABN , Publish Date - Mar 25 , 2026 | 03:41 AM
అమెరికా రక్షణ మంత్రి, సైనిక దళాల సంయుక్త చీఫ్, సన్నిహిత సలహాదారులు, మరికొందరు ప్రముఖులతో మాట్లాడాకే ఇరాన్‌పై దాడులకు నిర్ణయం తీసుకున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు.
ఇరాన్‌తో యుద్ధంపై ట్రంప్ వ్యాఖ్యలు
వాషింగ్టన్, మార్చి 24: అమెరికా రక్షణ మంత్రి, సైనిక దళాల సంయుక్త చీఫ్, సన్నిహిత సలహాదారులు, మరికొందరు ప్రముఖులతో మాట్లాడాకే ఇరాన్‌పై దాడులకు నిర్ణయం తీసుకున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. ముఖ్యంగా యుద్ధం చేద్దామని తొలుత రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ సూచించారని చెప్పారు. ఇరాన్ వద్ద అణ్వాయుధం ఉండవద్దన్నదే అందరి అభిప్రాయమని పేర్కొన్నారు. నిజానికి ట్రంప్ ఏకపక్ష నిర్ణయంతోనే ఇరాన్‌పైకి దాడికి దిగారనే విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలో తనది ఏకపక్ష నిర్ణయం కాదని, ఇతరుల సలహాల మేరకే యుద్ధంలోకి దిగాననే భావన కలిగించేలా ట్రంప్ తాజా వ్యాఖ్యలు ఉండటం గమనార్హం. ‘‘ఇరాన్ విషయంలో నిర్ణయం తీసుకునే ముందు.. హెగ్సెత్‌ను, జనరల్ కెయిన్‌ను పిలిచాను. ఇంకా సన్నిహితులు, సలహాదారులతో మాట్లాడాను. ఇరాన్ అణ్వాయుధాన్ని తయారు చేయడానికి చాలా దగ్గరగా ఉందని చెప్పాను. మనం దీనిని ఇలా వదిలేయవచ్చని లేదా పశ్చిమాసియాకు వెళ్లి సమస్యను పరిష్కరించవచ్చని వివరించాను’’ అని ట్రంప్ చెప్పారు. తన పక్కనే ఉన్న రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్‌ను ఉద్దేశిస్తూ.. ‘‘పీట్.. ఈ విషయంలో మొదట స్పందించింది నువ్వే కదా.. ఇరాన్ వద్ద అణ్వాయుధం ఉండకూడదని, యుద్ధం చేద్దామని చెప్పావు కదా..’’ అని పేర్కొన్నారు. ఉపాధ్యక్షుడు వాన్స్ యుద్ధం చేయడం విషయంలో ఏమాత్రం ఆసక్తిగా లేరని ట్రంప్ పేర్కొన్నారు. గల్ఫ్ దేశాలపై ఇరాన్ ఇలా దాడులకు దిగుతుందని తాము ఊహించలేదని.. ఇది చూసి తాము షాక్‌కు గురయ్యామని ట్రంప్ చెప్పడం గమనార్హం. ఇరాన్‌పై దాడులకు ట్రంప్‌పై అమెరికా మీడియా మొఘల్ మర్డోక్, నెతన్యాహు తీవ్రంగా ఒత్తిడి తెచ్చారని బ్లూమ్‌బర్గ్ ఇటీవల కథనం ప్రచురించింది.