Share News

క్రైస్తవంలోకి మారితే ఎస్సీ హోదా రద్దే!

ABN , Publish Date - Mar 25 , 2026 | 03:58 AM

షెడ్యూల్డ్‌ కులాల(ఎస్సీ)కు చెందిన వ్యక్తి క్రైస్తవ మతంలోకి మారితే.. అతడి ఎస్సీ హోదా తక్షణమే పూర్తిగా రద్దవుతుందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంచేసింది. తాను ఎస్సీనని అతడు చెప్పుకోజాలడని..

క్రైస్తవంలోకి మారితే ఎస్సీ హోదా రద్దే!

  • వారికి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం వర్తించదు

  • హిందూ, సిక్కు, బౌద్ధులకు మాత్రమే ఎస్సీహోదా

  • మరే మతంలోకి వెళ్లినా షెడ్యూల్డ్‌ కుల హోదా ఉండదు

  • తక్షణమే సంపూర్ణంగా ప్రయోజనం కోల్పోతారు

  • 1950 నాటి రాజ్యాంగ ఉత్తర్వులు చెబుతున్నది ఇదే

  • దీని నుంచి ఎవరికీ మినహాయింపు ఉండదు

  • క్రైస్తవ మతంలో కుల వ్యవస్థకు తావు లేదు

  • కులధ్రువీకరణ పత్రం ఉన్నా.. చట్టపరమైన రక్షణ దక్కదు

  • ఏపీ హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీం కోర్టు

  • పాస్టర్‌ చింతాడ ఆనంద్‌ కేసులో సంచలన తీర్పు

న్యూఢిల్లీ, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): షెడ్యూల్డ్‌ కులాల(ఎస్సీ)కు చెందిన వ్యక్తి క్రైస్తవ మతంలోకి మారితే.. అతడి ఎస్సీ హోదా తక్షణమే పూర్తిగా రద్దవుతుందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంచేసింది. తాను ఎస్సీనని అతడు చెప్పుకోజాలడని.. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం అతడికి వర్తించదని సంచలన తీర్పు ఇచ్చింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు గత ఏడాది ఏప్రిల్‌ 30న వెలువరించిన తీర్పును జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ ఎన్‌వీ అంజారియాతో కూడిన ధర్మాసనం మంగళవారం సమర్థించింది. ఏపీలోని బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెంలో చింతాడ ఆనంద్‌ అనే పాస్టర్‌.. అక్కల రామిరెడ్డి అనే వ్యక్తిపై 2021లో ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంలోని 3(1ఆర్‌), 3(1ఎస్‌), 3(2వీఏ) సెక్షన్ల కింద.. ఐపీసీ 341, 506, 323 రెడ్‌ విత్‌ 34 సెక్షన్ల కింద క్రిమినల్‌ కేసు నమోదు చేశారు. తాను ఓ గ్రామంలో పాస్టర్‌ విధులు నిర్వహిస్తుండగా.. ఆదివారం ప్రార్థనల్లో ఉండగా రామిరెడ్డి తనపై దాడిచేశారని ఆరోపించారు. పలు సార్లు దాడికి పాల్పడ్డారని.. చంపుతానని తనను, తన కుటుంబాన్ని బెదిరించారని.. కులం పేరుతో తమను దూషించారని తెలిపారు. ఈ కేసులో దర్యాప్తు పూర్తయి చార్జిషీటు కూడా దాఖలైంది. తనపై కేసును కొట్టివేయాలని కోరుతూ రామిరెడ్డి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టును ఆశ్రయించారు. తనపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు.


ఫిర్యాదీ చింతాడ ఆనంద్‌ క్రైస్తవంలోకి మారారని.. పాస్టర్‌గా పనిచేస్తున్నారని.. ఎస్సీనని చెప్పుకోవడానికి వీల్లేదని తెలిపారు. హిందూమతాన్ని ఆచరించే వ్యక్తిని తప్ప మరెవరినీ ఎస్సీగా పరిగణించడానికి వీల్లేదని.. 1950నాటి రాజ్యాంగ ఉత్తర్వులు (ఎస్సీ) ఈ విషయాన్ని స్పష్టంగా చెబుతున్నాయని పేర్కొన్నారు. అయితే ఆనంద్‌ తదితర ప్రతివాదులు మాత్రం కేసు దర్యాప్తు పూర్తయిందని. పది మంది సాక్షుల వాంగ్మూలాలతో చార్జిషీటు కూడా వేశారని తెలిపారు. చింతాడ ఆనంద్‌ ఎస్సీ అని, హిందూమాదిగ కులానికి చెందినవారని పిట్టలవానిపాలెం మండల తహశీల్దారు కులధ్రువీకరణ పత్రం కూడా ఇచ్చారని.. ఆనంద్‌కు ఎస్సీ, ఎస్టీ చట్టం రక్షణను నిరాకరించలేరని వాదించారు. హైకోర్టు దీనిపై స్పందిస్తూ.. ఆయన ఎస్సీ కులధ్రువీకరణ పత్రం కలిగి ఉండడం.. ఆంధ్రప్రదేశ్‌ కులధ్రువీకరణ పత్రాల జారీ చట్టంలోని ఐదో సెక్షన్‌ కింద సంబంధిత అధికారులు విచారణ చేపట్టాల్సిన అంశమని తెలిపింది. క్రైస్తవంలోకి మారాక ఆయన కులధ్రువీకరణ పత్రాన్ని రద్దుచేయనంత మాత్రాన ఎస్సీ, ఎస్టీ చట్టం కింద ఆయనకు రక్షణ లభించదని తేల్చిచెప్పింది. గత ఏడాది రామిరెడ్డిపై అభియోగాలను కొట్టివేస్తూ న్యాయమూర్తి ఎన్‌.హరినాథ్‌ తీర్పు ఇచ్చారు. దీనిని పాస్టర్‌ సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు. కానీ హైకోర్టు తీర్పునే ధర్మాసనం సమర్థించింది. ఈ మేరకు 33 పేజీల తీర్పును వెలువరించింది.

ఎస్సీ కానే కాదు..

‘ఎవరైనా వ్యక్తి క్రైస్తవ మతంలోకి మారి.. దానిని క్రియాశీలంగా బోధిస్తూ ప్రచారం చేస్తుంటే.. అతడిని ఎస్సీ కులానికి చెందిన వ్యక్తిగా పరిగణించడానికి వీల్లేదు. జన్మతః ఎస్సీ కులంలో పుట్టిన వ్యక్తి.. హిందూమతం, బౌద్ధమతం, సిక్కుమతం తప్ప మరే మతాన్ని పుచ్చుకున్నా అతడికి ఎస్సీ హోదా దక్కదు. తక్షణమే సంపూర్ణంగా ఆ హోదాను కోల్పోతాడు. షెడ్యూల్డ్‌ కులాల జాబితాను రూపొందించిన 1950 నాటి రాజ్యాంగ ఉత్తర్వులు ఇదే స్పష్టం చేస్తున్నాయి. రాజ్యాంగం ప్రకారం గానీ, పార్లమెంటు లేదా శాసనసభ చేసిన చట్టం ద్వారా గానీ ఎలాంటి చట్టబద్ధ ప్రయోజనాలు, రక్షణ, రిజర్వేషన్‌ మతంమారిన వారికి వర్తించవు. సదరు ఉత్తర్వులోని మూడో క్లాజు ప్రకారం.. వారు ఎస్సీ కులానికి చెందరు. దీనికి తిరుగులేదు. ఎలాంటి మినహాయింపూ ఉండదు’ అని స్పష్టంచేసింది. 1950లో హిందువులకు మాత్రమే ఎస్సీ హోదా ఉండేదని, 1956లో సిక్కు మతస్థులను, 1990లో బౌద్ధ మతస్థులను ఈ జాబితాలో చేర్చారని గుర్తు చేసింది. ఈ జాబితాలో క్రైస్తవం లేదా ఇస్లాం మతాలు లేవని స్పష్టం చేసింది.


పార్లమెంటు చట్టం ద్వారా మార్పు చేసే వరకు ఇతర మతాల వారికి ఎస్సీ హోదా దక్కదని తేల్చిచెప్పింది. ‘ప్రస్తుత కేసులో పిటిషనర్‌ ఆనంద్‌ తిరిగి తన మాతృ మతం(హిందూమతం)లోకి మారినట్లు గానీ, మాదిగ సామాజికవర్గం ఆయన్ను తిరిగి తమలో కలుపుకొన్నట్లు గానీ చెప్పేందుకు ఆధారాలు లేవు. దీనికి విరుద్ధంగా.. ఆయన దశాబ్ద కాలానికి పైగా క్రైస్తవ మతాన్ని ఆచరిస్తూ, పాస్టర్‌గా సేవలు అందిస్తున్నట్లు సాక్ష్యాధారాలు స్పష్టం చేస్తున్నాయి. గ్రామాల్లోని ఇళ్లలో ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. దాడి జరిగినట్లు చెబుతున్న రోజున కూడా ఆయన ఒక ఇంట్లో ప్రార్థన నిర్వహిస్తున్నట్లు స్వయంగా అంగీకరించారు. ఈ వాస్తవాలన్నీ పరిశీలిస్తే.. దాడి జరిగే నాటికి ఆయన క్రైస్తవుడనే విషయంలో ఎటువంటి సందేహానికీ తావులేదు’ అని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. క్రైస్తవ మత ఆచారాలను పాటిస్తూ, పాస్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న వ్యక్తికి ఎస్సీ హోదా వర్తించదని, అట్రాసిటీ చట్టం కింద రక్షణ పొందే అర్హత ఉండదని తేల్చిచెప్పింది. కాగా సుప్రీం కోర్టు తీర్పుపై పిటిషనర్‌ అక్కల రామిరెడ్డి స్పందించారు. ఐదేళ్లుగా న్యాయపోరాటం చేస్తున్నానని, తనతోపాటు కుటుంబ సభ్యులు ఐదుగురిపైనా అన్యాయంగా అట్రాసిటీ కేసు పెట్టారని చెప్పారు. అప్పట్లో తనపై విపరీతమైన రాజకీయ ఒత్తిడి ఉండేదన్నారు.హైకోర్టు ఇచ్చిన తీర్పునే సుప్రీంకోర్టు సమర్థించడంఆనందాన్ని ఇచ్చిందన్నారు.

క్రైస్తవంలోకుల వ్యవస్థకు తావులేదు...

క్రైస్తవంలో కుల వ్యవస్థకు తావులేదని ధర్మాసనం ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. ‘క్రైస్తవ మతం కుల వ్యవస్థను అంగీకరించదు. అందరూ క్రీస్తునందు సమానమే. అక్కడ ఎవరినీ యూదులుగానో, అన్యులుగానో, దాసులుగానో చూడరు. ఒక వ్యక్తి క్రైస్తవంలోకి మారిన తర్వాత, హిందూ మతంలోని సామాజిక వివక్ష నుంచి బయటపడినట్లు భావించాలి. అటువంటి పరిస్థితుల్లో ఎస్సీ, ఎస్టీ చట్టం కింద రక్షణ కోరడం చెల్లదు’ అని తీర్పులో స్పష్టం చేసింది. ఆనంద్‌కు ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాన్ని అధికారులు రద్దు చేయనంత మాత్రాన.. మతం మారిన వాస్తవాన్ని విస్మరించలేమని, మారినవారికి ఎస్సీ, ఎస్టీ చట్టం కింద రక్షణ పొందే అర్హత రాదని పునరుద్ఘాటించింది. ఆంధ్రప్రదేశ్‌ సాంఘిక సంక్షేమ శాఖ 1977 ఆగస్టు 30న జారీ చేసిన జీవో 341ని కూడా ధర్మాసనం విశ్లేషించింది. ఈ జీవో ద్వారా మతం మారిన ఎస్సీలకు కొన్ని సంక్షేమ పథకాలు అందుతాయని, అయితే రిజర్వేషన్లు, అట్రాసిటీ చట్టం రక్షణ వంటి చట్టపరమైన ప్రయోజనాలు అందవని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ కార్యనిర్వాహక ఉత్తర్వులు ఎప్పటికీ రాష్ట్రపతి ఉత్తర్వులను లేదా పార్లమెంటు చట్టాలను అధిగమించలేవని తేల్చిచెప్పింది.ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తీర్పును సమర్థిస్తూ.. పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది.

Updated Date - Mar 25 , 2026 | 03:58 AM