Share News

‘ప్రతి అందమైన మహిళా.. గూఢచారి కాదు'.. జెన్సెన్ హువాంగ్‌కు ట్రంప్ మద్దతు

ABN , Publish Date - Nov 16 , 2026 | 09:44 PM

ప్రతి అందమైన మహిళా.. గూఢచారి కాదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఎన్విడియా మాజీ సీఈవో జెన్సెన్ హువాంగ్‌కు ట్రంప్ అనూహ్య మద్దతు ప్రకటించారు. మళ్లీ సీఈవోగా రావడానికి స్వాగతం పలుకుతానన్నారు.

‘ప్రతి అందమైన మహిళా.. గూఢచారి కాదు'.. జెన్సెన్ హువాంగ్‌కు ట్రంప్ మద్దతు
Jensen Huang Trump

ఆంధ్రజ్యోతి, నవంబర్ 16: వివాహేతర సంబంధాలు, అనుమానిత చైనా గూఢచారితో సంబంధం ఉందన్న ఆరోపణలతో ఎన్విడియా (Nvidia) సీఈవో పదవి నుంచి తప్పుకున్న జెన్సెన్ హువాంగ్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనూహ్యంగా మద్దతు పలికారు. హువాంగ్ మళ్లీ ఎన్విడియా సీఈవోగా బాధ్యతలు చేపడితే తాను తప్పకుండా స్వాగతిస్తానని ట్రంప్ వ్యాఖ్యానించారు.

సోమవారం విలేకరులతో మాట్లాడిన ట్రంప్.. 'హువాంగ్ ఓ గుణపాఠం నేర్చుకున్నారు. ఆయన మళ్లీ ఎన్విడియా సీఈవో అయితే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. చాలా మంది కూడా అదే కోరుకుంటున్నారు' అని ట్రంప్ అన్నారు. జెన్సెన్ హువాంగ్‌తో సంబంధం ఉందని భావిస్తున్న ఆలిస్ హువాంగ్ నిజంగానే చైనా గూఢచారా అన్న విషయంపై ట్రంప్ సందేహం వ్యక్తం చేశారు. 'ఆమె చైనా గూఢచారి అని నాకు తెలియదు. సాధారణంగా చైనా నుంచి అమెరికాకు వచ్చే ఏ అందమైన మహిళనైనా గూఢచారి అని ముద్ర వేస్తుంటారు. ఆమె అసలు గూఢచారి కాదేమో, నాకైతే నిజంగా తెలియదు' అని ట్రంప్ పేర్కొన్నారు.

రాజీనామా చేసిన కొద్ది రోజుల్లోనే జెన్సెన్ హువాంగ్ తిరిగి ఎన్విడియా అత్యున్నత పదవిలోకి వచ్చేందుకు తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నట్లు 'ఫైనాన్షియల్ టైమ్స్' ఓ కథనంలో వెల్లడించింది. తాను తిరిగి సీఈవోగా రావడంపై హువాంగ్ తన సన్నిహితులతో చర్చించారని, మరోవైపు సిలికాన్ వ్యాలీలోని ఆయన మద్దతుదారులు ఆయన్ను తిరిగి నియమించాలని ఎన్విడియా బోర్డుపై ఒత్తిడి తెస్తున్నారని సమాచారం.

అనుమానిత చైనా గూఢచారితో పాటు, సంస్థలోని ఒక కిందిస్థాయి ఉద్యోగిని (Subordinate) తో హువాంగ్‌కు వివాహేతర సంబంధాలు ఉన్నాయన్న వార్తలు రావడంతో ఆయన పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. 4 ట్రిలియన్ డాలర్ల విలువైన చిప్ దిగ్గజం ఎన్విడియాలో తలెత్తిన ఈ నాయకత్వ సంక్షోభంపై కంపెనీ బోర్డు స్వతంత్ర విచారణ జరుపుతోంది. ఈ వివాదం నేపథ్యంలో చైనాతో సంబంధాలున్న ఆసియా కస్టమర్లకు ఏఐ (AI) చిప్‌ల విక్రయాల విషయంలో ఎన్విడియా నిబంధనలపై కూడా లోతైన పరిశీలన జరుగుతోంది. కిందిస్థాయి ఉద్యోగినితో సంబంధం పెట్టుకోవడం ఉద్యోగం నుంచి తొలగించదగిన నేరమని హువాంగ్ మద్దతుదారులే అంగీకరిస్తుండటంతో, ఆయన ప్రతిష్ఠను మళ్లీ ఎలా పునరుద్ధరించాలనే దానిపై సందిగ్ధత నెలకొంది. (Jensen Huang Trump)


ఈ వార్తలు కూడా చదవండి..

ప్రధాని మోదీతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ

కాళేశ్వరం ప్రాజెక్టులో గేట్లు మూసి నీటిని నిల్వ చేసే అవకాశం లేదు: మంత్రి తుమ్మల

సజ్జనార్ ఆస్తుల కొనుగోళ్లపై విచారణ జరిపించాలి: రాజాసింగ్

Updated Date - Nov 16 , 2026 | 09:55 PM