Share News

అప్‌గ్రేడెడ్ ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టిన స్పేస్ ఎక్స్ రాకెట్

ABN , Publish Date - Sep 29 , 2026 | 09:43 AM

స్పేస్ ఎక్స్ మరో మైలురాయిని అధిగమించింది. ఆ కంపెనీకి చెందిన భారీ స్టార్‌షిప్ రాకెట్ మొదటిసారిగా కక్ష్యలోకి విజయవంతంగా చేరింది. అయితే, ఒక ఇంజిన్‌లో సమస్య రావడంతో ప్రయోగాన్ని అనుకున్న సమయం కన్నా ముందుగానే ముగించారు.

అప్‌గ్రేడెడ్ ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టిన స్పేస్ ఎక్స్ రాకెట్

ఇంటర్‌నెట్ డెస్క్: స్పేస్ ఎక్స్ మరో మైలురాయిని అధిగమించింది. ఆ కంపెనీకి చెందిన భారీ రాకెట్ స్టార్‌షిప్ మొదటిసారిగా కక్ష్యలోకి విజయవంతంగా చేరింది. అయితే, ఒక ఇంజిన్‌లో సమస్య రావడంతో ప్రయోగాన్ని అనుకున్న సమయం కన్నా ముందుగానే ముగించారు. సోమవారం ఉదయం 7:49 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) దక్షిణ టెక్సస్‌లోని స్పేస్‌ ఎక్స్ స్టార్‌బేస్ కేంద్రం నుంచి రాకెట్‌ను రోదసిలోకి పంపించారు. ఇందులో 26 కొత్త తరం స్టార్‌లింక్ ఉపగ్రహాలు ఉన్నాయి. ఆ అప్‌గ్రేడెడ్ ఉపగ్రహాలను రాకెట్ విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. అవి ఇప్పటికే ఉన్న స్టార్‌లింక్ నెట్‌వర్క్‌కు అనుసంధానమయ్యాయి. ఈ ప్రయోగం తర్వాత స్పేస్‌ ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ స్పందించారు. స్టార్‌షిప్ తొలి ఆర్బిటల్ ఫ్లైట్ విజయవంతమైందని ఆయన ఎక్స్‌లో తెలిపారు.


3 గంటలపాటే ప్రయోగం

ప్రయోగం ప్రారంభమైన కొద్దిసేపటికే స్టార్‌షిప్‌లోని ఆరు రాప్టర్ ఇంజిన్లలో ఒకటి పనిచేయడం మానేసింది. మొదట ఇంజినీర్లు రాకెట్‌ను కక్ష్యలోకి పంపే ప్రయత్నాన్ని ఆపాలనుకున్నారు. డేటాను పరిశీలించిన తర్వాత పరిస్థితి నియంత్రణలో ఉందని భావించి ముందుకెళ్లారు. చివరకు స్టార్‌షిప్ కక్ష్యలోకి చేరింది. ఈ ప్రయోగం 10 గంటలు కొనసాగాల్సి ఉంది. సాంకేతిక కారణాల వల్ల 3 గంటలే సాగింది. 3 గంటల తర్వాత స్టార్‌షిప్‌‌ను హవాయి సమీపంలోని పసిఫిక్ మహాసముద్రంలో ల్యాండ్ చేశారు. గంటకు 26,900 కిలోమీటర్ల వేగంతో భూవాతావరణంలోకి ప్రవేశించిన రాకెట్.. పసిఫిక్ మహాసముద్రంలో పేలిపోయింది. ఇక ఈ ప్రయోగంలో కొత్తగా 26 వీ3 స్టార్‌లింక్ ఉపగ్రహాలను వాడారు. ఇవి స్టార్‌లింక్ నెట్‌వర్క్‌లో భాగమవుతాయి. ప్రస్తుతం స్టార్‌లింక్ నెట్‌వర్క్‌లో 11,000కు పైగా శాటిలైట్లు ఉన్నాయి. స్టార్‌షిప్‌కు ఇది 14వ ప్రయోగం. ఇంతకుముందు జరిగిన ప్రయోగాల్లో స్టార్‌షిప్‌ను పూర్తి కక్ష్యలోకి పంపించలేదు. ఈసారి మాత్రం ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో కక్ష్యలోకి పంపించారు. భవిష్యత్తులో మనుషులను చంద్రుడు, అంగారక గ్రహంపైకి పంపడమే స్టార్‌షిప్ లక్ష్యం.


ఆదాయాన్ని తెచ్చే మిషన్

స్టార్‌షిప్ మిషన్‌పై స్పేస్‌ఎక్స్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ బ్రెట్ జాన్సన్ స్పందించారు. ఈ రాకెట్ ప్రయోగాన్ని తమ కంపెనీకి ఆదాయాన్ని తెచ్చిపెట్టే మిషన్‌గా ఆయన అభివర్ణించారు. ఇందులో పంపుతున్న వీ3 శాటిలైట్లు నాణ్యమైనవని, వాటిని పూర్తి నెట్‌వర్క్‌తో అనుసంధానం చేయనున్నామని ఆయన తెలిపారు. వీ3 శాటిలైట్ల వల్ల స్టార్‌లింక్ సామర్థ్యం భారీగా పెరుగుతుందని ఎలాన్ మస్క్ కూడా అంతకుముందు ప్రకటించారు. వీ3 శాటిలైట్ ద్వారా స్టార్‌లింక్ కమ్యూనికేషన్స్ ఆదాయం చాలా వేగంగా పెరుగుతుందని ఆశిస్తున్నట్లు మస్క్ గతంలో చెప్పారు. పాత వీ2 శాటిలైట్‌తో పోలిస్తే ఈ కొత్త శాటిలైట్‌కు 10 రెట్లు ఎక్కువ సామర్థ్యం ఉందని, వాటిని 10 రెట్లు ఎక్కువగా లాంచ్ చేయబోతున్నామని ఆయన స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

యూఎస్‌లో ఎస్సార్ గ్రూప్ భారీ పెట్టుబడులు

అమెరికా మోస్ట్ వాంటెడ్ నేరస్థుల జాబితాలో బిష్ణోయ్ గ్యాంగ్ లీడర్

మరిన్ని నేషనల్, ఇంటర్నేషనల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 29 , 2026 | 09:57 AM