ఒపెక్ నుంచి యూఏఈ నిష్క్రమణ.. పాక్-సౌదీ స్నేహం కూడా ఒక కారణమా..
ABN , Publish Date - Apr 29 , 2026 | 12:06 PM
ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్‌పోర్టింగ్ కంట్రీస్ (OPEC) నుంచి వైదొలగాలని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) నిర్ణయించుకుంది. దాదాపు 60 సంవత్సరాల పాటు ఒపెక్‌లో సభ్య దేశంగా ఉన్న యూఏఈ ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చింది?
ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్‌పోర్టింగ్ కంట్రీస్ (OPEC) నుంచి వైదొలగాలని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) నిర్ణయించుకుంది. దాదాపు 60 సంవత్సరాల పాటు ఒపెక్‌లో సభ్య దేశంగా ఉన్న యూఏఈ ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చింది? దీని వెనుక పలు కారణాలు ఉన్నాయట. ఒపెక్‌ను నడిపిస్తున్న సౌదీ అరేబియాకు పాకిస్థాన్‌తో ఉన్న స్నేహం కూడా యూఏఈ ఆగ్రహానికి ఓ కారణమని వార్తలు వస్తున్నాయి (UAE exit OPEC).
నిజానికి కొంతకాలంగా యూఈఏ, సౌదీ మధ్య చమురు ఉత్పత్తి విషయంలో విభేదాలు ఉన్నాయి. ముడి చమురు ఉత్పత్తి విషయంలో సౌదీ అరేబియా విధిస్తున్న పరిమితులు యూఏఈ అసంతృప్తికి కారణం. చమురును ఎక్కువగా వెలికి తీయాలని యూఏఈ భావిస్తోంది. డిమాండ్‌కు తగినట్టుగా ఒపెక్ దేశాలన్నీ పరిమితంగానే చమురును ఉత్పత్తి చేయాలని సౌదీ కోరుతోంది. ఒపెక్ విధించిన కోటా కారణంగా తమ ఉత్పత్తిని పెంచుకోలేకపోతున్నామని యూఏఈ అసహనంగా ఉంది (OPEC news 2026).
మరోవైపు పాకిస్థాన్‌తో సౌదీ స్నేహం బంధం కూడా యూఏఈకి చిరాకు కలిగిస్తోంది. అమెరికా-ఇరాన్ దేశాలకు మధ్యవర్తిగా ఉన్న పాకిస్థాన్ తీరుపై యూఏఈ ఆగ్రహంగా ఉంది. యుద్ధ సమయంలో గల్ఫ్ దేశాలపై జరిగిన దాడులకు ఇరాన్‌ను జవాబుదారీగా నిలబెట్టడంలో పాక్ విఫలమైందని యూఏఈ భావిస్తోంది. పాకిస్థాన్ తటస్థ వైఖరితో ఉందని, బాధిత దేశాల వైపు నిలవలేదని యూఏఈ విమర్శలు చేస్తోంది (Saudi Arabia UAE conflict).

గల్ఫ్ దేశాలన్నింటిలోకి యూఏఈనే ఇరాన్ తీవ్ర శత్రువుగా భావిస్తోంది (Pakistan role OPEC exit). యూఏఈపైనే ఎక్కువగా దాడులు చేసింది. దీంతో ఇరాన్‌పై తీవ్ర సైనిక చర్యకు దిగాలని సౌదీని యూఏఈ ఎప్పట్నుంచో ఒత్తిడి చేస్తోందట. అయితే పాకిస్థాన్ కారణంగానే ఇరాన్‌పై చర్యలకు సౌదీ వెనుకాడుతోందని యూఏఈ భావిస్తోందట. పాకిస్థాన్‌కు గతంలో ఇచ్చిన 3.5 బిలియన్ డాలర్ల అప్పును కూడా యూఏఈ ఇటీవల వసూలు చేసిన సంగతి తెలిసిందే. ఆ డబ్బును సౌదీ నుంచి తీసుకున్న పాక్.. యూఏఈకి చెల్లించింది.
మరోవైపు ఒపెక్ నుంచి బయటకు రావడం ద్వారా అమెరికాకు మరింత చేరువ కావొచ్చని యూఏఈ భావిస్తోందట (Global oil politics). ఒపెక్ కూటమిని, చమురు ఉత్పత్తిపై పరిమితులను అమెరికా ఎప్పట్నుంచో వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో ఒపెక్ ద్వారా బయటకు వచ్చి చమురు ఉత్పత్తిని గరిష్ఠ స్థాయికి పెంచి అమెరికాతో స్నేహాన్ని మరింత పెంచుకోవాలని యూఏఈ ఆశపడుతోందట.
ఇవి కూడా చదవండి..
పసిడి ప్రియులకు శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు..
లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు.. 8 మంది మృతి..