Share News

ట్రంప్‌కు పరాభవం!

ABN , Publish Date - Nov 05 , 2026 | 04:47 AM

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో అధ్యక్షుడు ట్రంప్‌కు పరాభవం ఎదురైంది. ట్రంప్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న రిపబ్లికన్‌ పార్టీకి ఊహించలేని షాక్‌ తగిలింది.

ట్రంప్‌కు పరాభవం!
Donald Trump

  • మధ్యంతర ఎన్నికల్లో చిత్తుగా ఓడిన రిపబ్లికన్‌ పార్టీ

  • ప్రతినిధుల సభ, సెనేట్‌ రెండింట్లోనూ డెమోక్రాట్ల హవా

  • పెరిగిన ధరల సెగ.. ఇరాన్‌ యుద్ధం ప్రభావం

  • స్వయంగా ప్రచారం చేసి, తననే అభ్యర్థిగాభావించి ఓటేయాలన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌

  • ఆయనపై అసంతృప్తిని ఓట్లతో చెప్పిన అమెరికన్లు

  • దశాబ్దాలుగా పట్టున్న రాష్ట్రాల్లోనూ ఎదురుదెబ్బ

  • మిగతా స్థానాలకు కొనసాగుతున్న కౌంటింగ్‌

  • ట్రంప్‌ విధానాల అమలుకు కాంగ్రెస్‌లో ఆటంకమే!

  • ఆయనకు ఇకపై ఎగ్జిక్యూటివ్‌ ఆదేశాలే దిక్కు!

వాషింగ్టన్‌, నవంబరు 4: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో అధ్యక్షుడు ట్రంప్‌కు పరాభవం ఎదురైంది. ట్రంప్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న రిపబ్లికన్‌ పార్టీకి ఊహించలేని షాక్‌ తగిలింది. స్వయంగా ప్రచారం చేసి, తననే అభ్యర్థిగా భావించి ఓటువేయాలని ట్రంప్‌ అభ్యర్థించినా ప్రతికూల ఫలితమే ఎదురైంది. అధ్యక్ష ఎన్నికల సమయంలో ట్రంప్‌ భారీ మెజారిటీ సాధించిన రాష్ట్రాల్లోనూ ఎదురుదెబ్బ తగిలింది. ట్రంప్‌ విధానాలపై.. ముఖ్యంగా విపరీతంగా పెరిగిపోయిన నిత్యావసరాలు, డీజిల్‌ ధరలు, ఇరాన్‌తో యుద్ధం, వీసాల విధానంపై ఇష్టారాజ్యంగా మార్పులు వంటి అంశాల్లో అమెరికా ప్రజల్లో నెలకొన్న అసంతృప్తి ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. అంచనాలకు మించి డెమోక్రాట్ల హవా కనిపించింది. దశాబ్దాలుగా రిపబ్లికన్లకుకంచుకోటలుగా ఉన్న రాష్ట్రాల్లోనూ డెమోక్రాట్లు విజయకేతనం ఎగురవేశారు. అమెరికా పార్లమెంటు అయిన కాంగ్రెస్‌లోని ప్రతినిధుల సభ, సెనేట్‌ రెండింటిలోనూ రిపబ్లికన్లు పట్టుకోల్పోయారు. కీలక రాష్ట్రాల్లోని గవర్నర్‌ పదవులనూ డెమోక్రాట్లు కైవసం చేసుకున్నారు. మొత్తంగా అధ్యక్షుడు ట్రంప్‌కు ముకుతాడు వేసే అవకాశం డెమోక్రాట్లకు చిక్కింది. ట్రంప్‌ అధ్యక్షుడిగా కొనసాగే మరో రెండేళ్లపాటు ఆ దేశ నిర్ణయాలు, వ్యవహారాలను నియంత్రించే అవకాశం వచ్చింది. దీనితో అమెరికాలో పాలన, విధానాలకు సంబంధించిన అంతర్గత అంశాలతోపాటు అమెరికా చేస్తున్న యుద్ధాలు, వివిధ దేశాలపై వేస్తున్న సుంకాలు, ఆ దేశ విదేశాంగ విధానాలు, వాణిజ్యం వంటి అంతర్జాతీయ అంశాలెన్నో.. మధ్యంతర ఎన్నికల ఫలితాలతో ప్రభావితమయ్యే పరిస్థితి నెలకొంది.


trump.jpgకంచుకోటల్లోనూ ఎదురుదెబ్బ

చాలా ఏళ్లుగా రిపబ్లికన్‌ పార్టీకి కంచుకోటల్లా ఉన్న రాష్ట్రాల్లోనూ ఇప్పుడు ఎదురుదెబ్బ తగిలింది. టెక్సాస్‌, జార్జియా, అయోవా, ఓహియో వంటి రాష్ట్రాల్లో గవర్నర్‌ పదవులు డెమోక్రాట్ల పరమయ్యాయి. టెక్సాస్‌, మేన్‌, దక్షిణ కరోలినా, ఉత్తర కరోలినా, కాన్సాస్‌, అయోవా, ఓహియో రాష్ట్రాల్లో రిపబ్లికన్లు దారుణ ఓటమి చవిచూశారు. మొత్తం 100 స్థానాలున్న సెనేట్‌లో గత ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ 53 సీట్లు, డెమోక్రాట్లు 47 సీట్లు గెలుచుకున్నారు. ఇప్పుడు డెమోక్రాట్లకు 54 సీట్లు, రిపబ్లికన్లకు 44 సీట్లు, స్వతంత్రులకు 2 సీట్లు వచ్చాయి. ఇక ప్రతినిధుల సభలోని మొత్తం 415 స్థానాలకుగాను గత ఎన్నికల్లో రిపబ్లికన్లకు 220, డెమోక్రాట్లకు 215, ఇతర పార్టీలు, స్వతంత్రులకు 10 స్థానాలు దక్కాయి. ఇప్పుడు డెమోక్రాట్లు ఇప్పటికే మ్యాజిక్‌ ఫిగర్‌ అయిన 218 స్థానాలను దాటేసి.. 228 సీట్లు గెలుచుకున్నారు. రిపబ్లికన్లకు 139 సీట్లు దక్కాయి. మిగతా స్థానాల ఫలితాలు వెలువడాల్సి ఉంది.

ట్రంప్‌ ధోరణిపై పెల్లుబికిన వ్యతిరేకత!

మధ్యంతర ఎన్నికల సందర్భంగా ట్రంప్‌పై అమెరికా ప్రజల్లో పెరిగిన వ్యతిరేకత స్పష్టంగా కనిపించింది. జార్జియాలోని ఒక పోలింగ్‌ కేంద్రం వద్ద ఓటరు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ట్రంప్‌ విధానాలు అవమానకరం. ఆయన మా పిల్లలకు ఆదర్శంగా ఉండాలని ఏమాత్రం కోరుకోవడం లేదు. ఆయన ఎంత త్వరగా పదవి నుంచి దిగిపోతే అంత మంచిది’’ అని వ్యాఖ్యానించడం గమనార్హం. ఇక ఎన్నికల సమయంలో సర్వే నిర్వహించిన అసోసియేటెడ్‌ ప్రెస్‌ (ఏపీ) వార్తా సంస్థ.. దాదాపు 60శాతం మంది ఓటర్లలో ట్రంప్‌ పనితీరుపై అసంతృప్తి కనిపించిందని తెలిపింది. అధ్యక్షుడి అధికారాలను నియంత్రించేందుకు, సమతుల్యత ఉండేందుకు కాంగ్రెస్‌ మరింత చురుగ్గా వ్యవహరించాలని 70శాతం మంది కోరుకుంటున్నారని పేర్కొంది.


సొంత పార్టీలోనూ ట్రంప్‌పై అసంతృప్తి

ట్రంప్‌ విధానాలు, ఆయన వ్యవహార శైలిపై రిపబ్లికన్‌ పార్టీలోనూ అసంతృప్తి, వ్యతిరేకత కనిపించాయి. చాలా రాష్ట్రాల్లో రిపబ్లికన్ల మధ్య విభేదాలూ ఎన్నికల సమయంలో బయటపడ్డాయి. ట్రంప్‌ తర్వాత అధ్యక్ష అభ్యర్థిగా నిలవొచ్చని ప్రచారం జరిగిన వారిలో ఒకరైన వివేక్‌ రామస్వామి.. ఓహియో గవర్నర్‌ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ‘‘ఇక ట్రంప్‌ శకం ముగిసినట్టే..’’ అని రిపబ్లికన్‌ నేత క్రిస్‌ కిస్టీ వ్యాఖ్యానించారు. పలు రాష్ట్రాల్లో రిపబ్లికన్లు ట్రంప్‌ అనుకూల, ఆయన విధానాలను వ్యతిరేకించే వర్గాలుగా విడిపోవడంతోనూ.. ప్రతికూల ఫలితాలు వచ్చాయని నిపుణులు చెబుతున్నారు.

ట్రంప్‌కు ఎగ్జిక్యూటివ్‌ ఆదేశాలే దిక్కు!

కాంగ్రెస్‌ ఉభయ సభల్లో డెమోక్రాట్లకు పూర్తి మెజారిటీ రావడంతో ట్రంప్‌ ఇష్టానుసారం పాలన సాగించే అవకాశాలకు అడ్డుకట్ట పడనుంది. ఆయన సూచనలు, నిర్ణయాలకు అనుగుణంగా రిపబ్లికన్లు ప్రవేశపెట్టే బిల్లులు ఆమోదం పొందడం, చట్టాలుగా మారడం కష్టమే. అయితే ట్రంప్‌ పదవీకాలం ముగిసే వరకు ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్లు (మనదేశంలో ఆర్డినెన్స్‌ల తరహాలో) జారీ చేస్తూ.. తన నిర్ణయాలను అమల్లోకి తీసుకురావొచ్చు. కానీ ఆయా అంశాలను బట్టి సదరు ఆదేశాలు నిర్ణీత కాలం పాటు మాత్రమే అమల్లో ఉంటాయి. తర్వాత మళ్లీ ఆదేశాలు జారీ చేయాల్సి ఉంటుంది. అదీ కోర్టుల్లో ప్రతికూల తీర్పులు రాకుంటే మాత్రమే. అయితే కాంగ్రెస్‌లో డెమోక్రాట్లు ఆమోదించి పంపే బిల్లులను తిరస్కరించే అధికారం అధ్యక్షుడు ట్రంప్‌కు ఉంటుంది. దీనితో అధ్యక్షుడు తన ఆదేశాలపై, డెమోక్రాట్లు తమ బిల్లులపై పరస్పరం చర్చించి, మార్పులు చేసుకుని అమల్లోకి తీసుకువచ్చేందుకు అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

డెమోక్రాట్లపై ట్రంప్ చివరి అస్త్రం! ఎలా పనిచేస్తుందంటే.

అమెరికా తొలి ముస్లిం సెనెటర్ భార్యకు భారతీయ మూలాలు

Updated Date - Nov 05 , 2026 | 04:49 AM