ఎంత కఠినమైన ప్రశ్నలు ఎదుర్కొంటున్నానో చూశారా?
ABN , Publish Date - Nov 19 , 2026 | 02:16 AM
ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో ఇటీవల జరిగిన క్వాడ్ దేశాల సదస్సులో విలేకరుల సమావేశం సందర్భంగా ట్రంప్ చేసిన వ్యాఖ్య వైరల్ అవుతోంది
మీడియాతో భేటీపై మోదీ సమక్షంలోట్రంప్ వ్యాఖ్యలు.. వీడియో వైరల్
మనీలా, నవంబరు 18: ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో ఇటీవల జరిగిన క్వాడ్ దేశాల సదస్సులో విలేకరుల సమావేశం సందర్భంగా ట్రంప్ చేసిన వ్యాఖ్య వైరల్ అవుతోంది. ప్రధాని మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్, జపాన్ ప్రధాని తకాయ్‌చీలతో కలిసి ట్రంప్ మీడియాతో మాట్లాడారు. ఎన్‌విడియా, ఇరాన్, జిన్‌పింగ్‌తో సమావేశం తదితర అంశాల గురించి విలేకర్లు వరుసగా ప్రశ్నలు గుప్పించారు. వాటికి సమాధానాలిస్తున్న క్రమంలో ట్రంప్.. ‘చూశారా! నేను ఎంత కఠినమైన ప్రశ్నలను ఎదుర్కొంటున్నానో?’ అంటూ వ్యాఖ్యానించారు. 2014లో ప్రధాని పదవిని చేపట్టినప్పటి నుంచీ నేటివరకూ బహిరంగ విలేకరుల సమావేశంలో (ముందస్తుగా ప్రశ్నలు ఇవ్వకుండా జరిగే మీడియా భేటీలో) మోదీ ఒక్కసారి కూడా పాల్గొనలేదన్న విమర్శలున్న నేపథ్యంలో.. ట్రంప్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఈ వీడియో వైరల్ అవుతోంది. కాగా, ఇదే క్రమంలో ట్రంప్ తనపక్కనున్న మోదీని కఠినమైన వ్యక్తి అని, జపాన్ ప్రధాని తకాయ్‌చీని మరింత కఠినమైన వ్యక్తి అని అభివర్ణించటం విశేషం. విలేకరులు ట్రంప్‌ను మరిన్ని ప్రశ్నలు అడుగుతున్న సమయంలో.. మోదీ ‘ఇక వెళ్దామా’ అని బయల్దేరటానికి సిద్ధం కావటం వీడియోలో కనిపించింది. అయితే, ట్రంప్‌తోపాటు ఇతర దేశాధినేతలు కదలకుండా అక్కడే ఉండటంతో మోదీ కూడా ఉండిపోయారు.
ఇవి కూడా చదవండి..
కాంగ్రెస్‌కు అఖిలేశ్ యాదవ్ షాకిచ్చారా.. కేవలం 24 సీట్లే ఇస్తామంటూ ఆఫర్..
జంతుబలులను నిషేధించాలంటూ పిటిషన్.. కొట్టివేసిన సుప్రీంకోర్టు