మాకొద్దీ పాక్ దొరతనం
ABN , Publish Date - Jul 07 , 2026 | 06:22 AM
పేరుకే ‘ఆజాద్ కశ్మీర్’గా ఉన్న పాక్ ఆక్రమిత కశ్మీర్.. ఇప్పుడు నిజమైన ‘ఆజాదీ’ కోసం నినదిస్తోంది! నిత్యం నిరసనలు, ఆందోళనలతో అట్టుడికిపోతోంది. ‘మాకొద్దీ పాక్ దొరతనం’ అని తేల్చిచెబుతోంది...
నిజమైన ‘ఆజాదీ’ కోసం నినదిస్తున్న ‘ఆజాద్ కశ్మీర్’
కరెంటు చార్జీలు యూనిట్ రూ.35-45కు చేరడం,
గోధుమ పిండి కొరతపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం
పీవోకే అసెంబ్లీలో కశ్మీరీ శరణార్థులకు కేటాయించిన 12
సీట్లలో దొడ్డిదారిన తనవారిని కూర్చోబెడుతున్న పాక్
ఆ సీట్లు రద్దు చేయాలి.. పాక్ ఆర్మీ వెళ్లిపోవాలని డిమాండ్
పీవోకే ప్రజల నిరసనలను అణచివేస్తున్న పాక్ సైన్యం
ఆ ప్రాంతానికి ఆహారం, ఔషధాల సరఫరా నిలిపివేత
సాయం కోసం భారతదేశం వైపు చూస్తున్న పీవోకే ప్రజలు
తమ డిమాండ్లు నెరవేర్చకుంటే 9న అంతిమ, నిర్ణయాత్మక
చర్యకు దిగుతామని పాకిస్థాన్ సర్కారుకు హెచ్చరిక’
పేరుకే ‘ఆజాద్ కశ్మీర్’గా ఉన్న పాక్ ఆక్రమిత కశ్మీర్.. ఇప్పుడు నిజమైన ‘ఆజాదీ’ కోసం నినదిస్తోంది! నిత్యం నిరసనలు, ఆందోళనలతో అట్టుడికిపోతోంది. ‘మాకొద్దీ పాక్ దొరతనం’ అని తేల్చిచెబుతోంది. దశాబ్దాలుగా పాక్ నియంతృత్వం కింద నలిగిపోయిన స్థానికులు.. తిండి కోసం, కరెంటు చార్జీల తగ్గింపు కోరుతూ మూడేళ్ల క్రితం మొదలుపెట్టిన శాంతియుత నిరసనలు పెల్లుబుకుతున్న ప్రజాగ్రహంతో పెనుజ్వాలగా మారాయి. కశ్మీరీ శరణార్థుల పేరిట తమ అసెంబ్లీలో 12 సీట్లలో పాక్ తనవారిని దొడ్డిదోవన కూర్చోబెట్టడం.. దాన్ని సుప్రీంకోర్టు సైతం అడ్డుకోకపోవడంతో.. జూన్ మొదటివారం నుంచి పీవోకే అగ్నిగుండంలా రగులుతోంది. మహిళలు, పిల్లలు సైతం రోడ్ల మీదకు వచ్చి.. పాక్ సైన్యం తమ గడ్డ మీద నుంచి వెళ్లిపోవాలని డిమాండ్ చేస్తున్నారు! కశ్మీర్ ప్రజల స్వాతంత్య్ర ఆకాంక్ష గురించి ప్రపంచ వేదికలపై పదేపదే మొసలికన్నీళ్లు కార్చే పాకిస్థాన్.. పీవోకే ప్రజల నిరసనలను అత్యంత క్రూరంగా అణచివేస్తోంది.
(సెంట్రల్ డెస్క్)
దాదాపు ఏడున్నర దశాబ్దాలుగా పాకిస్థాన్ ఆక్రమణలో ఉన్న కశ్మీర్ ప్రాంతం నెలరోజులుగా నిరసనలు, ఆందోళనలతో అట్టుడుకుతోంది. అయితే ఈ నిరసనలు కేవలం నెలరోజుల క్రితం ప్రారంభమైనవి కావు. దీనికి బీజం మూడేళ్ల క్రితమే పడింది. తమ ప్రాంతంలోని ప్రకృతి వనరులను పీల్చి పిప్పిచేస్తున్న పాకిస్థాన్.. తమ ప్రాంతంలో ఉత్పత్తి అయ్యే కరెంటును తమకే భారీ ధరలకు విక్రయించడం, చివరకు తమ కడుపు నింపే గోధుమపిండి రవాణాపై ఆంక్షలు విధించడంతో మొదలైంది. అది క్రమక్రమంగా పెరుగుతూ వస్తోంది. పీవోకే అసెంబ్లీలో కశ్మీరీ శరణార్థులకు కేటాయించిన సీట్లలో పాకిస్థాన్ తనకు అనుకూలమైనవారిని నియమించుకోవడంపై మొదలైన అసంతప్తి కూడా వారి ఆగ్రహానికకి తోడైంది. వాటన్నింటి ఫలితమే అక్కడి ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితులకు కారణం. పీవోకే ప్రాంతంలో జీలం నదిపై నిర్మించిన మంగ్లా డ్యామ్, ఇతర జలవిద్యుత్ కేంద్రాల ద్వారా పాకిస్తాన్ ఏటా 3500 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది (1960ల్లో ఈ డ్యామ్ నిర్మాణ సమయంలో లక్షలాది మంది పీవోకే ప్రజలు ఎలాంటి పరిహారమూ లేకుండానే తమ ఇళ్లు, వ్యవసాయ భూములను కోల్పోయారు). ఈ విద్యుదుత్పత్తికి పాకిస్థాన్‌కు అయ్యే ఖర్చు యూనిట్‌కు (పాకిస్థానీ రూపాయల్లో) రూ.1.5 నుంచి రూ.2.5 దాకా అవుతుంది. కానీ, పాకిస్థాన్ ఆ విద్యుత్తుపై రకరకాల పన్నులు, సుంకాలు, సర్‌చార్జీలు వేసి.. పీవోకే ప్రజల నుంచి యూనిట్‌కు రూ.30 నుంచి రూ.45 దాకా ముక్కుపిండి వసూలు చేస్తోంది. ప్రపంచంలో ఎక్కడా కనీవినీ ఎరుగని రేట్లు ఇవి. ‘‘మా భూభాగంలో ఉత్పత్తి చేసిన కరెంటును మాకే ఇంత దారుణమైన ధరలకు అమ్ముతారా?’’ అన్నది పీవోకే ప్రజల ఆగ్రహం. 2024లో దీనిపై వారి నిరసనలు తీవ్రతరం కావడంతో.. నెలకు 100 యూనిట్లలోపు కరెంటు వాడేవారికి మాత్రం రూ.3 చొప్పున యూనిట్ కరెంటు ఇస్తామని పాక్ సర్కారు ప్రకటించింది. కానీ దొడ్డిదోవన మళ్లీ అవే రేట్లు వసూలు చేయడం మొదలుపెట్టింది. దీంతో పన్నులు లేని విద్యుత్ మా హక్కు అంటూ ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు. కరెంటు సంగతి ఇలా ఉంటే.. పీవోకే ప్రజల ప్రధాన ఆహారమైన గోధుమ పిండికి మూడేళ్లుగా అక్కడ తీవ్ర కొరత ఏర్పడింది. పీవోకే అంతా కొండలు గుట్టల ప్రాంతమే కావడంతో వారికి సొంతంగా గోధుమలు పండించుకునే అవకాశం లేదు. 1960ల్లో మంగ్లా డ్యామ్ కోసం పాక్ సర్కారు తమ భూములు లాక్కోవడంతో పీవోకే ప్రజల్లో పెరిగిన ఆగ్రహాన్ని చల్లార్చడానికి 1970ల నుంచి పాక్ సర్కారు ‘సబ్సిడీపై గోధుమ పిండి’ ఇవ్వడం మొదలుపెట్టింది. కానీ, ఇటీవలికాలంలో పాక్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ఐఎంఎఫ్ వంటి సంస్థల వద్దకు రుణం కోసం వెళ్తే.. అన్ని రకాల సబ్సిడీలనూ ఆపేస్తేనే రుణాలిస్తామని ఆయా సంస్థలు ఆంక్షలు విధించాయి. దీంతో.. పీవోకేకు పంపే గోధుమపిండిపై సబ్సిడీ నిలిచిపోయింది.
40 కిలోల గోధుమపిండి బస్తా ధర పాకిస్థానీ రూపాయల్లో రూ.3200కు చేరంది. అటు కరెంటు బిల్లులు పెంచి, ఇటు తినడానికి తిండి కూడా లేకుండా చేయడంతో ప్రజలు భగ్గుమన్నారు. మహిళలు, చిన్నారులు సైతం రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలపడానికి ఇదే ప్రధాన కారణం.
అసెంబ్లీ సీట్ల గొడవ..
పాక్ ఆక్రమిత కశ్మీర్ అసెంబ్లీలో మొత్తం 53 సీట్లుంటాయి. అందులో 12 సీట్లను కశ్మీరీ శరణార్థులకు కేటాయించారు. అంటే.. మన కశ్మీర్ నుంచి పాకిస్థాన్‌కు వలసవెళ్లినవారు ఆ 12 స్థానాలకు పోటీచేయొచ్చు. కానీ.. ఆ సీట్లకు సంబంధించిన ఓటింగ్ అంతా పాకిస్థాన్‌లోనే జరుగుతుంది. పీవోకేలో కాదు. ఈ లొసుగును అడ్డుపెట్టుకుని పాక్ పాలకులు ఆ స్థానాల్లో తమకు నచ్చినవారిని కూర్చోబెడుతోంది. వారికి ఇచ్చే జీతభత్యాలు మాత్రం పీవోకే ప్రజలు కట్టే పన్నుల నుంచే ఇస్తారు. ఈ వ్యవహారంపై పీవోకే ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మూడు సమస్యలపై గళమెత్తేందుకు 2023 సెప్టెంబరులో పీవోకేలోని వ్యాపారులు, న్యాయవాదులు, కొందరు పౌరులు కలిసి ‘జమ్ముకశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (జేఏఏసీ)’గా ఏర్పడ్డారు. కరెంటు చార్జీలు, గోధుమపిండి ధరలు తగ్గించడం, కశ్మీరీ శరణార్థుల కోసం అసెంబ్లీలో కేటాయించిన 12 సీట్లను పూర్తిగా రద్దు చేయడం వంటి 38 డిమాండ్లతో ఒక చార్టర్‌ను రూపొందించి నిరసనలు, ఆందోళనలకు దిగడం మొదలుపెట్టారు. పన్నెండు సీట్ల రద్దుపై పీవోకే సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించారు. కానీ, అందుకు రాజ్యాంగ సవరణ తప్పనిసరి అని.. వాటిని రద్దు చేయడం తమ చేతిలో పని కాదని సుప్రీంకోర్టు జూన్ మొదటివారంలో తేల్చిచెప్పడంతో నెలరోజులగా పీవోకే అగ్గిలా మండుతోంది. ప్రజల నిరసనలను స్థానిక పోలీసులు సమర్థంగా అడ్డుకోలేకపోవడంతో.. పాక్ సైన్యం తన కనుసన్నల్లో పనిచేసే పాకిస్థాన్ రేంజర్స్‌ను రంగంలోకి దింపింది. వీరు ముజఫరాబాద్, రావాలాకోట్, మీర్‌పూర్ తదితర పట్టణాల వీధుల్లో తిరుగుతూ లాఠీచార్జ్‌లు, కాల్పులతో విచక్షణరహితంగా నిరసనకారులపై విరుచుకుపడుతున్నారు. దీంతో 25 మందికిపైగా చనిపోగా పెద్ద సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. మరోవైపు.. జేఏఏసీని ఉగ్రవాద సంస్థగా ప్రకటించి బ్యాన్ చేసిన పాకిస్థాన్ సర్కారు, ఇప్పటిదాకా నిరసనల్లో పాల్గొన్న 600 మందికిపైగా ఉద్యమకారులను అరెస్టు చేసింది. ఉద్యమానికి వెన్నెముకలా నిలిచిన జేఏఏసీ ప్రధాన కేంద్ర కమిటీ నాయకుడు షౌకత్ నవాజ్ మీర్‌ను జూన్ 30న అరెస్ట్ చేసింది. 48 గంటల్లోగా వీరందరినీ విడుదల చేయడంతోపాటు.. తాము చేసిన 38 డిమాండ్లను నెరవేర్చాలని జూలై 4న (కిందటి శనివారం) జేఏఏసీ అల్టిమేటమ్ జారీ చేసింది. లేనిపక్షంలో జూలై 9న తాము అంతిమ, నిర్ణయాత్మక చర్యకు దిగుతామని హెచ్చరించింది.
భారత్‌వైపు అడుగులు..?
తీవ్ర నిర్బంధం, అణచివేతతో ఇప్పటికే ఇబ్బంది పడుతున్న పీవోకే ప్రజలు.. మూడువారాలుగా పాక్ సర్కారు ఆహారం, ఔషధ సరఫరాలను నిలిపివేయడంతో సాయం కోసం భారత్‌వైపు చూస్తున్నారు. దీంతో జేఏసీ లీడర్ సర్దార్ అమన్ ఖాన్ ఇటీవలే రావాలాకోట్‌లోని ఈద్గా మైదానంలో వేలాది మందితో జరిగిన బహిరంగ సభలో.. ఆహారం, మందుల కోసం భారత్ సాయాన్ని అర్ధించారు. అంతే కాదు.. పీవోకే అనేది పాకిస్థాన్‌లో భాగం కాదని, తమకు పాకిస్థాన్ అవసరం లేదని.. పాక్‌కే పీవోకే అవసరమని గుర్తుచేశారు. ‘హమ్ లేకర్ రహేంగే ఆజాదీ (మేము మా స్వేచ్ఛను లాక్కుంటాం)’ అని నినదించారు. పాక్ ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే తమకు ‘వేరే మార్గాలు’ ఉన్నాయని చెప్పడం ద్వారా.. భారత్‌తో చేతులు కలుపుతామని పరోక్షంగా హెచ్చరించారు. సభకు వచ్చిన ప్రజలను ఉద్దేశించి.. ‘‘మనం ఇప్పుడు లైన్ ఆఫ్ కంట్రోల్ వైపు (భారత్ వైపు) మార్చ్ చేద్దామా?’’ అని ఆయన ప్రశ్నించగా.. వేలాది గొంతుకలు ‘పదండి అటే వెళ్దాం’ అని బదులివ్వడం.. 40 వేల మందికిపైగా మహిళలు, చిన్నారులు సైతం తెల్లజెండాలు ధరించి సభలో పాల్గొనడం పాక్ వెన్నులో వణుకు పుట్టిస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి...
మెట్రో ఫేజ్-2పై కేంద్రమంత్రులకు సీఎం రేవంత్‌రెడ్డి లేఖ
కన్నెపల్లి పంపు దగ్గరకెళ్లి కేటీఆర్ నాటకమాడుతున్నారు.. మంత్రి ఉత్తమ్ సెటైర్లు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News