ముదిరిన సరిహద్దు వివాదం.. అఫ్గానిస్థాన్‌పై పాకిస్థాన్ భారీ వైమానిక దాడులు
ABN , Publish Date - Feb 27 , 2026 | 06:57 AM
అఫ్గానిస్థాన్, పాకిస్థాన్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. కొంతకాలంగా ఇరుదేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు యుద్ధ వాతావరణానికి దారితీశాయి. పాక్ వైమానిక దళం అఫ్గాన్ భూభాగంలో కీలక సైనిక లక్ష్యాలపై విరుచుకుపడింది. వివరాల్లోకి వెళితే..
ఇంటర్నెట్ డెస్క్: అఫ్గానిస్థాన్, పాకిస్థాన్ మధ్య కొంతకాలంగా నెలకొన్న ఉద్రిక్తతలు యుద్ధ వాతావరణానికి దారితీశాయి. ఇరు దేశాల మధ్య భారీ ఎత్తున దాడులు జరుగుతున్నాయి. అయితే, శుక్రవారం తెల్లవారుజూమున పాక్ వైమానిక దళం అఫ్గాన్ భూభాగంలో కీలక సైనిక లక్ష్యాలపై విరుచుకుపడింది. ఈ దాడుల్లో పలు అఫ్గాన్ ఆర్మీ పోస్టులు పూర్తిగా ధ్వంసం అయినట్లు సమాచారం. అయితే, మొదట అఫ్గానిస్థాన్ దాడులు చేయగా.. పాక్ కూడా దాడులు చేసినట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
పాకిస్థాన్ సైన్యం ఈ దాడులకు ‘ఆపరేషన్ గజబ్-లిల్-హక్’ అని పేరు పెట్టింది. సరిహద్దు వెంబడి పెరుగుతున్న ఉగ్రవాద కార్యకలాపాలు, అంతకు ముందు అఫ్గాన్ దళాలు జరిపిన కాల్పులకు ప్రతీకారంగా ఈ చర్యలు తీసుకున్నట్లు పాక్ రక్షణ శాఖ ప్రకటించింది. పాక్ వైమానిక దళం అఫ్గానిస్థాన్ లోని కాబూల్, కాందహార్, పక్తికా వంటి నగరాల్లోని సైనిక పోస్టులు, మందుగుండు సామగ్రి డిపోలు, శిక్షణ శిబిరాలను ధ్వంసం చేశాయి. మరోవైపు పాకిస్థాన్‌పై అఫ్గానిస్థాన్ ప్రతీకార దాడులు చేస్తోంది. 55 మంది పాక్ సైనికులను మట్టుబెట్టినట్టు తాలిబన్లు ప్రకటించారు. ఇప్పటివరకూ 19 పాక్ అవుట్ పోస్టులు, 2 స్థావరాలను ధ్వంసం చేసినట్టు వెల్లడించారు. ఇదిలా ఉంటే.. పాకిస్థాన్ సైన్యం తమకు ఎంత నష్టం వాటిల్లిందన్న విషయం వెల్లడించలేదు. ప్రస్తుతం పాకిస్థాన్-అఫ్గానిస్థాన్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.
ఈ వార్తలూ చదవండి:
అది విచారకరం.. భారత బడ్జెట్‌పై ఇరాన్ ఆర్థిక మంత్రి కామెంట్
లా డిగ్రీ లేకున్నా న్యాయమూర్తిగా.. పాక్‌లో ఘటన