Share News

ఎగ్జిక్యూటివ్‌ రూమ్‌లో సీక్రెట్ మైక్.. ఓపెన్ఏఐ ఇంజినీర్ అరెస్ట్

ABN , Publish Date - Oct 14 , 2026 | 09:16 AM

కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ కాన్ఫరెన్స్ గదిలో ఓ రహస్య ఆడియో రికార్డర్‌ను పెట్టాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓపెన్‌ఏఐ ఇంజినీర్‌ను కాలిఫోర్నియా పోలీసులు అరెస్ట్ చేశారు.

ఎగ్జిక్యూటివ్‌ రూమ్‌లో  సీక్రెట్ మైక్.. ఓపెన్ఏఐ ఇంజినీర్ అరెస్ట్

ఇంటర్నెట్ డెస్క్: కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ కాన్ఫరెన్స్ గదిలో ఓ రహస్య ఆడియో రికార్డర్‌ను పెట్టాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓపెన్‌ఏఐ ఇంజినీర్‌ను కాలిఫోర్నియా పోలీసులు అరెస్ట్ చేశారు. సెప్టెంబర్ 30న తమ సంస్థలోని కాన్ఫరెన్స్ గదిలో ఈ పరికరాన్ని ఓపెన్‌ఏఐ గుర్తించి, పోలీసులకు ఫిర్యాదు చేసింది. మీటింగ్ హాల్‌లోని టీవీకి రహస్య ఆడియో రికార్డర్‌ను అమర్చిన విషయాన్ని ఫిర్యాదులో పేర్కొంది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇదే సంస్థలో ఇంజినీర్‌గా వ్యవహరిస్తున్న అబ్దుల్‌ రెహమాన్‌ అల్ఫోజానే ఈ నేరానికి పాల్పడ్డాడని తేల్చారు. దీంతో ఈ నెల 9న అతణ్ని అదుపులోకి తీసుకున్నారు.


సౌదీ అరేబియాకు చెందిన రెహమాన్ ఆడియో రికార్డర్‌‌ను టాయిలెట్ పేపర్‌లో చుట్టి, దాన్ని సెప్టెంబరు 28న టీవీకి అమర్చాడని పోలీసులు గుర్తించారు. మరోవైపు రహస్య పరికరాన్ని పెట్టిన కాన్ఫరెన్స్ గదిలో నిత్యం ఉత్పత్తి ప్రణాళికలు, ప్రభుత్వ ఒప్పందాలు, వాణిజ్య సంబంధాలపై చర్చలు జరుగుతాయని ఓపెన్ఏఐ చెబుతోంది. రెహమాన్‌కు ఈ గదిలోకి వెళ్లడానికి అనుమతి కూడా లేదని, అయినా అతడు ఈ నెల 5న అక్కడ ఉన్నట్టు సీసీటీవీలో రికార్డ్ అయిందని ఆ సంస్థ ఆరోపించింది. ఈ కేసులో అబ్దుల్‌ రెహమాన్‌ అల్ఫోజాన్ దోషిగా తేలితే 5 ఏళ్ల జైలు శిక్ష, రూ.2 కోట్ల 40 లక్షలకు పైగా జరిమానా పడే అవకాశం ఉంది.


ఈ వార్తలూ చదవండి

ఫ్రాన్స్‌ సూపర్‌మార్కెట్లలో ఫ్రీజర్ల హ్యాకింగ్‌!

మన ధనవంతులకన్నా.. అక్కడి నిరుపేదలే మెరుగు!

Updated Date - Oct 14 , 2026 | 09:26 AM