Share News

ఫ్రాన్స్‌ సూపర్‌మార్కెట్లలో ఫ్రీజర్ల హ్యాకింగ్‌!

ABN , Publish Date - Oct 14 , 2026 | 06:07 AM

హ్యాకర్లు పెద్ద పెద్ద కంపెనీల సర్వర్లను హ్యాక్‌ చేయడం గురించి విని ఉంటారు! కొన్ని దేశాలు శత్రు దేశాల రక్షణ వ్యవస్థలను హ్యాక్‌ చేయడానికి ప్రయత్నించిన ఘటనల గురించీ చదివి ఉంటారు!!

ఫ్రాన్స్‌ సూపర్‌మార్కెట్లలో ఫ్రీజర్ల హ్యాకింగ్‌!
FARIS

  • వాటి ఉష్ణోగ్రతలను 50 డిగ్రీలకు పెంచేసిన హ్యాకర్లు

  • పదార్థాలు పాడై, ఫ్రీజర్లు కాలిపోయి భారీగా నష్టం

పారిస్‌, అక్టోబరు 13: హ్యాకర్లు పెద్ద పెద్ద కంపెనీల సర్వర్లను హ్యాక్‌ చేయడం గురించి విని ఉంటారు! కొన్ని దేశాలు శత్రు దేశాల రక్షణ వ్యవస్థలను హ్యాక్‌ చేయడానికి ప్రయత్నించిన ఘటనల గురించీ చదివి ఉంటారు!! కానీ.. సూపర్‌ మార్కెట్లలో డీప్‌ ఫ్రీజర్లను హ్యాక్‌ చేయడం గురించి ఎప్పుడైనా విన్నారా? అక్టోబరు 11వ తేదీ రాత్రి ఫ్రాన్స్‌లో అదే జరిగింది! ఆ దేశవ్యాప్తంగా ఉన్న పలు సూపర్‌మార్కెట్‌ చైన్లలోని డీప్‌ ఫ్రీజర్లను సైబర్‌ నేరగాళ్లు హ్యాక్‌ చేశారు. ఆ ఫ్రీజర్ల ఉష్ణోగ్రతలను వారు ఆరు గంటలపాటు 50 డిగ్రీల వద్ద ఉంచడంతో.. వాటిలోని పదార్థాలన్నీ చెడిపోయాయి. కొన్ని ఫ్రీజర్లలో మంటలు సైతం చెలరేగాయి. ఫలితంగా కొన్ని కోట్ల యూరోల నష్టం వాటిల్లింది. అక్టోబరు 12వ తేదీ ఉదయాన్నే.. పలు సూపర్‌ మార్కెట్ల వద్ద.. పాడైపోయిన పాల ఉత్పత్తులు, ఇతర పదార్థాలను చెత్త కంటెయినర్లలో తరలించిన దృశ్యాలు కనిపించాయి. అయితే, ఈ హ్యాకింగ్‌ ఒక్క తమదేశానికే పరిమితం కాలేదని.. స్పెయిన్‌, పోర్చుగల్‌, జర్మనీ, పోలండ్‌, బెల్జియం దేశాల్లో కూడా ఫ్రీజర్లు హ్యాకింగ్‌కు గురయ్యాయని ఫ్రాన్స్‌ అధికార వర్గాలు వెల్లడించాయి. డెన్మార్క్‌కు చెందిన డాన్‌పోస్ అనే కంపెనీ తయారుచేసిన కంట్రోలర్లు ఉన్న డీప్‌ఫ్రీజర్లే దాడికి గురైనట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. దీనిపై ఆ సంస్థను సంప్రదించగా.. హ్యాక్‌ అయిన ఫ్రీజర్లన్నీ 2016, 2021 నాటి మోడళ్లని.. కొత్త మోడళ్లకు అప్‌గ్రేడ్‌ కావాలన్న తమ సూచనను సూపర్‌మార్కెట్లు పట్టించుకోలేదని ఆ సంస్థ చెబుతోంది.

ఈ వార్తలు కూడా చదవండి

వాదిస్తే నిజాలు అబద్ధాలు కావు.. లద్దాఖ్‌పై చైనాకు భారత్ కౌంటర్

హూతీలు ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణులను ధ్వంసం చేశాం.. సౌదీ దళాల ప్రకటన


నెట్‌కు ఎందుకు కనెక్ట్‌ చేస్తారు?

సూపర్‌మార్కెట్లలోని ఫ్రీజర్ల ఉష్ణోగ్రతను నియంత్రించడానికి ప్రత్యేకమైన వ్యవస్థ ఉంటుంది. రాత్రిపూట సూపర్‌మార్కెట్‌ను మూసివేసిన తర్వాత ఏదైనా ప్రమాదం జరిగినా, ఉష్ణోగ్రతలు పెరిగినా వెంటనే సంబంధిత సిబ్బందికి హెచ్చరికలు వెళ్లడానికి వీలుగా వాటిని నెట్‌కు అనుసంధానం చేస్తారు. ఆ ఫ్రీజర్ల నిర్వహణ బాధ్యతలను సంబంధిత కంపెనీలకు అప్పగిస్తారు. ఫ్రాన్స్‌లోనూ అదే జరిగింది. అయితే.. ఫ్రీజర్లను కూడా హ్యాక్‌ చేస్తారనే ఆలోచన లేకపోవడం వల్ల పలు సూపర్‌మార్కెట్లు పాతవాటినే ఇంకా వాడుతుండడంతో.. వాటిని హ్యాక్‌ చేయడం సులువైంది.

Updated Date - Oct 14 , 2026 | 06:08 AM