మన ధనవంతులకన్నా.. అక్కడి నిరుపేదలే మెరుగు!
ABN , Publish Date - Oct 13 , 2026 | 07:01 AM
సంపన్న, అభివృద్ధి చెందుతున్న, పేద దేశాలకు మధ్య ఆర్థిక అంతరాలు భారీగా పెరుగుతున్నాయని ప్రపంచబ్యాంకు తాజా నివేదిక వెల్లడించింది. భారత్ పరంగా ఈ నివేదికను పరిశీలించినప్పుడు..
సంపన్న దేశాలతో పోల్చితే మన పరిస్థితి దిగదిడుపే
అమెరికాలో నిరుపేద రోజువారీ సంపాదన 25 డాలర్లు
భారత్‌లో ఆదాయం పరంగా పైవరుసలో ఉన్న 10శాతం మంది తలసరి రోజువారీ ఆదాయం 10 డాలర్లు
ప్రపంచబ్యాంకు తాజా నివేదికలో వెల్లడి
ప్రజల ఆదాయం, ఉత్పాదకతను పెంచడానికి
ప్రభుత్వాలు ప్రాధాన్యమివ్వాలి.. ఆర్థికవేత్తల సూచన
న్యూఢిల్లీ, అక్టోబరు 12: సంపన్న, అభివృద్ధి చెందుతున్న, పేద దేశాలకు మధ్య ఆర్థిక అంతరాలు భారీగా పెరుగుతున్నాయని ప్రపంచబ్యాంకు తాజా నివేదిక వెల్లడించింది. భారత్ పరంగా ఈ నివేదికను పరిశీలించినప్పుడు.. ఆశ్చర్యకరమైన అంశాలు వెల్లడయ్యాయి. సంపన్న దేశాల్లో ఆదాయం పరంగా కనిష్ఠ స్థాయిలో ఉన్న 10 శాతం మంది తలసరి రోజువారీ సంపాదన.. భారత్‌లోని గరిష్ఠ స్థాయిలో ఉన్న 10 శాతం మంది తలసరి రోజువారీ ఆదాయం కంటే అధికమని తెలిసింది. ప్రపంచబ్యాంకు ఇటీవల ‘పేదరికం, అసమానతల వేదిక- 2026’ నివేదికను విడుదల చేసింది. దీంట్లో పేర్కొన్న గణాంకాల ప్రకారం.. దేశ జనాభాలో ఆర్థికంగా కనిష్ఠ స్థాయిలో ఉన్న 10 శాతం మంది తలసరి రోజువారీ ఆదాయం/ వినియోగం కెనడాలో 31 డాలర్లు, జర్మనీ, ఆస్ట్రేలియాల్లో 28 డాలర్లు, అమెరికాలో 25 డాలర్లు, భారత్‌లో 3 డాలర్లుగా నమోదైంది. మరోవైపు, జనాభాలో ఆదాయం పరంగా గరిష్ఠ స్థాయిలో ఉన్న 10 శాతం మంది
విషయానికొస్తే.. భారత్‌లో ఆ వర్గం రోజువారీ తలసరి ఆదాయం/ వినియోగం కేవలం 10 డాలర్లు. అంటే, సంపన్న దేశాల్లోని నిరుపేదల ఆదాయంలో సగం కూడా లేదు. అమెరికాలో ఈ 10 శాతం అగ్రశ్రేణి సంపన్నుల రోజువారీ తలసరి ఆదాయం 173 డాలర్లు, కెనడా, ఆస్ట్రేలియాల్లో 129 డాలర్లు, జర్మనీలో 128 డాలర్లుగా ఉంది. మన దేశంలో ఒక సగటు ‘సంపన్నుడికి’, అమెరికాలో ఓ సగటు సంపన్నుడికి మధ్య ఆదాయంలో తేడా ఏకంగా 163 డాలర్లు. ఈ గణాంకాలపై ఆర్థికవేత్త అహోనా దత్తాగుప్తా తదితరులు స్పందిస్తూ.. ధనిక పేద ఆర్థిక అంతరాలను తగ్గించటం మీద దృష్టి పెట్టే కంటే, అన్ని వర్గాల ప్రజల ఆదాయం, ఉత్పాదకతను పెంపొందించటానికి ప్రభుత్వాలు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. ఈ విధంగానే భారత్‌ను సంపన్న ఆర్థిక వ్యవస్థగా మలచవచ్చని సూచించారు. ఉత్పాదకతలో వృద్ధి ఆవిష్కరణల ద్వారా సాధ్యమవుతుందన్నారు. కాబట్టి, కంపెనీలు కొత్త కొత్త వ్యాపార విధానాలను పరీక్షిస్తూ, వైఫల్యాల ద్వారా నేర్చుకుంటూ, విజయవంతమైన విధానాలను ఆవిష్కరించాలని, ఈ మేరకు ప్రభుత్వాలు వాటికి సహకరించాలని చెప్పారు. దేశంలో వ్యాపారాలు మరింత విస్తరించి ఎక్కువ ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు వీలుగా ఆర్థిక సంస్కరణలను మరింత విస్తృతపరచాలని, ప్రస్తుత నియంత్రణలను సమీక్షించాలని పేర్కొన్నారు.