2023 అక్టోబర్లో ఉగ్రదాడి తర్వాత ఇజ్రాయెల్లో మొదటిసారి ఎన్నికలు
ABN , Publish Date - Oct 27 , 2026 | 12:04 PM
ఇజ్రాయెల్లో 2023 అక్టోబర్ 7న జరిగిన ఉగ్రదాడి తర్వాత మొదటిసారిగా ఆ దేశంలో పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలతో ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు భవితవ్యం తేలిపోనుంది. దీంతో ఈ ఎన్నికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఇజ్రాయెల్లో 2023 అక్టోబర్ 7న జరిగిన ఉగ్రదాడి తర్వాత మొదటిసారిగా ఆ దేశంలో పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలతో ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు భవితవ్యం తేలిపోనుంది. దీంతో ఈ ఎన్నికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇజ్రాయెల్ స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 7 గంటలకు (భారత కాలమానం ప్రకారం ఉదయం 10.30 గంటలకు) పోలింగ్ ప్రారంభం కానుండగా.. రాత్రి 10 గంటలకు (భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి 1.30 గంటలకు) పోలింగ్ ముగుస్తుంది. పోలింగ్ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా ప్రభుత్వ మీడియా.. ఫలితాల సరళిని వెల్లడించనుంది.
ఏ పార్టీకి లేదా పార్టీల కూటమికి స్పష్టమైన మెజారిటీ రాకపోతే.. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మరింత సమయం పట్టవచ్చు. ఈనెల 30 నాటికి ఓట్ల లెక్కింపు పూర్తయ్యే అవకాశం ఉంది. అధికారికంగా ఎన్నికల ఫలితాలను వచ్చే నెల 4న ప్రకటించనున్నారు. నెస్సెట్ (ఇజ్రాయెల్ పార్లమెంట్) లో మొత్తం 120 స్థానాలు ఉన్నాయి. సాధారణంగా ప్రతి నాలుగేళ్లకోసారి ఎన్నికలు జరుగుతాయి. అప్పుడపుడు ముందస్తు ఎన్నికలు కూడా జరుగుతాయి. దేశవ్యాప్తంగా పార్టీలకు వచ్చిన ఓట్ల శాతం ఆధారంగా దామాషా ప్రాతినిధ్యం ప్రకారం సీట్లు కేటాయిస్తారు. పార్లమెంటులో ప్రాతినిధ్యం ఉండాలంటే ఒక పార్టీకి కనీసం 3.25 శాతం ఓట్లు రావాలి. ఫలితాలు వెల్లడైన అనంతరం అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ వివిధ పార్టీల నేతలతో సంప్రదింపులు జరుపుతారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఎక్కువగా ఉందని భావించే నేతను ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎంపిక చేస్తారు. ఆ అభ్యర్థి గరిష్టంగా 42 రోజుల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
ఏ ఒక్క పార్టీకి ఇప్పటివరకూ పూర్తి మెజారిటీ రాలేదు
ఇజ్రాయెల్లో ఇప్పటివరకు ఏ ఒక్క పార్టీ కూడా పూర్తి మెజారిటీ పొందలేదు. దీంతో పలు పార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ వచ్చాయి. ప్రభుత్వ ఏర్పాటుపై పార్టీల మధ్య చర్చలు, సంప్రదింపులు కొన్ని వారాల పాటు కొనసాగుతాయి. ఈ క్రమంలో ప్రతి పార్లమెంటు స్థానం కీలకంగా మారుతుంది. తక్కువ స్థానాలు గెలుచుకున్న చిన్న పార్టీలు సైతం ప్రభుత్వ ఏర్పాటులో కింగ్ మేకర్ పాత్ర పోషిస్తాయి. ప్రధానమంత్రి అభ్యర్థి నిర్ణీత గడువులోగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోతే, ఇతర నేతలకు అధ్యక్షుడు అవకాశం కల్పించవచ్చు. అప్పటికీ ప్రభుత్వ ఏర్పాటు సాధ్యం కాకపోతే మరోసారి ఎన్నికలు నిర్వహిస్తారు. అప్పటివరకు ప్రస్తుత మంత్రివర్గం ఆపద్ధర్మ ప్రభుత్వంగా కొనసాగుతుంది.
ఈ వార్తలు కూడా చదవండి:
డిండి ప్రాజెక్టును రద్దు చేయాలనడం సరికాదు